logo

kadapa: కొండలు మింగిన అనకొండలు.. గ్రావెల్‌ తవ్వకాల్లో గుత్తాధిపత్యం

సీఎం  జగన్‌ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన కొండలను అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వకాలతో మింగేశారు. కొందరు అధికారపార్టీకి చెందినవారు ఈ తవ్వకాల్లో గుత్తాధిపత్యం చేపట్టి యథేచ్ఛగా కొండలమట్టిని తవ్వి

Updated : 24 May 2024 09:45 IST

ప్రభుత్వ ఖజానాకు గండి

గ్రావెల్‌ తవ్వకాలతో గోతులుగా మారిన వేంపల్లె మైనార్టీ గురుకుల పాఠశాల వెనుకవైపు ఉన్న కొండ

వేంపల్లె, న్యూస్‌టుడే: సీఎం  జగన్‌ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన కొండలను అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వకాలతో మింగేశారు. కొందరు అధికారపార్టీకి చెందినవారు ఈ తవ్వకాల్లో గుత్తాధిపత్యం చేపట్టి యథేచ్ఛగా కొండలమట్టిని తవ్వి ఇతరులకు విక్రయించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. లీజులు లేకున్నా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించామంటూ అధికారులు, పాలకులను నమ్మించి కొందరు మట్టిని అమ్ముకుంటూ అర్జిస్తున్నారు. వేంపల్లెలో మట్టిమాఫీయా కొందరి కనుసన్నల్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ఇతరులను అడ్డుకోవడమే కాకుండా మైనింగ్‌ శాఖాధికారులకు మట్టిని తవ్వే యంత్రాలు, ట్రాక్టర్లను సీజు చేయిస్తున్నారని వేంపల్లె ఎన్‌డీఏ నేతలు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా గ్రావెల్‌ తరలింపు విషయమై బుధవారం వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు భారతి, వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు మధ్య జరిగిన వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇక్కడ మట్టిమాఫీయా ఆగడాలు, ప్రభుత్వానికి పైసా డబ్బులు కట్టకుండా రేయింబవళ్లు మట్టిని తరలిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చుట్టుపక్కల కొండలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గ్రావెల్‌ తరలింపునకు లీజుకు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించామని చెబుతూ ఒకరు రంగంలోకి దిగారు. ఇక్కడి పులివెందుల రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ కేంద్రంగా మట్టి మాఫీయా తమ కార్యకలాపాలకు తెరలేపారు. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ స్థలాలు, పొలాలకు మంచి గిరాకీ ఉంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా మండలంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేసింది. స్థిరాస్తి వ్యాపారులకు, గ్రావెల్, సీమెంట్‌రోడ్లు, ఇతరత్రా పనులకు గ్రావెల్‌ అవసరం. దీన్ని ఆసరాగా తీసుకున్న ఒకరిద్దరు ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అనుమతుల్లేకుండా స్థానిక ఏపీమైనార్టీ గురుకులం, రాజీవ్‌నగర్‌కాలనీల వెనుకవైపు, పాములూరుగుట్ట, నందిపల్లెగుట్ట ఇలా ఎక్కడపడితే అక్కడ కొండలను యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులను తమ పలుకుబడితో సదరు వ్యక్తులపై దాడులు చేయించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. తమను కాదని మట్టి తీసుకెళుతుంటే సదరు నిర్మాణాలను, వ్యక్తులను ఈ మాఫీయా అడ్డుకుంటోంది. ఇదెక్కడి న్యాయమంటూ ఎన్నో పర్యాయాలు స్థానికులే మాఫీయాకు ఎదురుతిరిగిన దాఖలాలున్నాయి. 


లీజులు ఒకచోట.. మట్టితవ్వకాలు ఇంకోచోట

వేంపల్లెలో కొందరికి మట్టితవ్వకాలకు ప్రభుత్వం లీజులిస్తే వారు మరోచోట మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఒకరిద్దరిదే గుత్తాధిపత్యం కావడం వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకపోవడంతో మట్టిమాఫీయాది ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఇటీవలే ఒకరిద్దరికి మట్టితవ్వకాల కోసం 15ఎకరాలకు లీజు, టెండర్లు రాగా వేంపల్లెలో ఉన్న కొండల్లో ఉన్న మట్టి తరలింపును చూస్తే ఏమేర అక్రమాలు జరిగాయో అర్థమవుతోంది. అక్రమార్కుల మట్టి తవ్వకాలకు అండగా నిలిచే ఆయా శాఖాధికారులకు సదరు మాఫీయా నెలనెలా కప్పం చెల్లిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు