
సచ్ఛీలురకే పదవులు
భారతావని భాగ్యరేఖలు మారాలంటే నిజాయతీపరులు, శీలసంపన్నులు, దార్శనికులు, కొద్దిమంది మేలుకోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టనివారు ప్రభుత్వాధినేతలు కావాలని రాజ్యాంగ సభాధ్యక్షులుగా రాజేన్ బాబు అభిలషించారు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఆనాటి ఆదర్శాలన్నీ అందని ద్రాక్షలుగానే మిగిలిపోయాయి. ఎన్నికల అభ్యర్థిత్వాలలో ఆశావహుల అర్థ, అంగబలాలకు అగ్రతాంబూలమిస్తున్న రాజకీయ పక్షాలు- కుబేరులు, నేరచరితులకు ఏరికోరి ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. మకిలి రాజకీయాల వెల్లువలో విలువలు విలుప్తమవుతున్న వేళ- పంజాబ్‌లో ‘ఆప్’ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే నిశ్చయించాలని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపిచ్చారు. ఆ కిరీటాలంకరణకు ఎంపీ భగవంత్‌సింగ్ మాన్ అన్నివిధాలా అర్హులంటూనే, జనాభిప్రాయ సేకరణకు ఆయన ఒక ఫోన్ నంబరు ప్రకటించారు. సీల్డుకవర్ సీఎంలను కొలువుతీర్చే అధిష్ఠానం రాజకీయాలకు బదులుగా ప్రజావళికే ఆ బాధ్యతను అప్పగించే నవ్యాలోచన స్వాగతించదగింది. నేతల గతచరిత్రలపై జనానికి సమగ్ర అవగాహన కొరవడుతున్న పరిస్థితుల్లో ఆ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందన్నదే ప్రశ్నార్థకం! అర్హతలకు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు నేతలను పార్టీయే ఎంపిక చేసి, వారి పూర్వాపరాలను ప్రజలకు వెల్లడించి నిర్ణయం కోరడం మేలిమి ప్రత్యామ్నాయం. దేశవ్యాప్తంగా మూడో వంతు ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 26శాతం వరకు హేయ నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారని గతంలో వెలుగుచూసింది. రాజకీయ పక్షాల అవలక్షణాలకు కాయకల్ప చికిత్స చేయకుండా చేపట్టే ఎన్నికల సంస్కరణలేవీ సఫలీకృతం కానేరవని జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రెండు దశాబ్దాల క్రితమే కుండ బద్దలుకొట్టింది. సచ్ఛీలురు, ప్రజా సేవానురక్తులైన నేతలతోనే దేశీయంగా సమ్మిళిత సమతులాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి వారు కీలక పదవుల్లోకి రావాలంటే- వ్యవస్థాగత నిర్వహణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు రాజకీయ పక్షాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం వెల్లివిరియాలి. అందుకుగానూ న్యాయ సంఘం(లా కమిషన్) సూచించినట్లు, రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా పార్టీల కార్యకలాపాల నియంత్రణకు చట్టపరమైన కట్టుదిట్టాలు ఏర్పాటు కావాలి!
చట్టాల ఉల్లంఘనులు శాసన నిర్మాతలు కాకూడదని కె.ప్రభాకరన్ వర్సెస్ పి.జయరాజన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. అటువంటి వారు మొత్తం ఎన్నికల ప్రక్రియనే కలుషితం చేస్తారని ఈసడించింది. 2004లో 120 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉంటే, 2019 నాటికి అటువంటి వారి సంఖ్య 233కి ఎగబాకింది. దాదాపు నలభై శాతం టిక్కెట్లను నేరచరితులకు కట్టబెడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు- ప్రజాస్వామ్య విలువలకు సమష్టిగా సమాధి కడుతున్నాయి. అవి వెదజల్లుతున్న ధనరాశులతో భారతీయ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా తరగని దుష్కీర్తిని మూటగట్టుకున్నాయి. గడచిన ఆరు సార్వత్రిక సమరాల్లో పార్టీల వ్యయం ఆరు రెట్లు అధికమై, సుమారు రూ.60 వేల కోట్లకు చేరిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లోగడే లెక్కకట్టింది. అభ్యర్థుల పోలింగ్ ఖర్చుపై నిబంధనలన్నీ నీటిపై రాతలవుతున్న దుస్థితిలో సుప్రీంకోర్టు గతంలో ఆందోళన వ్యక్తంచేసినట్లు- నేరగ్రస్త, గుర్తుతెలియని మూలాల నుంచి వచ్చిపడుతున్న కాసుల మూటలతో ఓట్ల కొనుగోలు పోనుపోను విశృంఖలమవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెళుసుబారుస్తున్న పార్టీల పెడపోకడలను కట్టడిచేయడానికి నిర్వాచన్ సదన్ లోగడే 47 సంస్కరణలను ప్రతిపాదించింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ ద్వారా ఈసీ సభ్యుల నియామకాలను చేపట్టాలని లా కమిషన్ సూచించింది. దేశం తలరాతను నిర్దేశించే ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణంలో వినియోగించుకోవాలంటే- ఎన్నికల సంఘం సర్వస్వతంత్రం కావాలి. దేశీయ జనస్వామ్య తేజోదీప్తులను ద్విగుణీకృతం చేసే క్రతువులో అన్ని రాజకీయ పక్షాలూ కూడిరావడమే, స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా జాతినేతలకు ఘన నివాళి కాగలదు!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం

నెత్తురోడుతున్న రహదారులు
ప్రధాన వ్యాఖ్యానం

కడలిపై పెత్తనానికి డ్రాగన్ కుయుక్తులు
ఉప వ్యాఖ్యానం

రైతుకు నకిలీల శరాఘాతం

అలవిమాలిన ఆదాయ అంతరాలు
అంతర్యామి
