యువశక్తులకు నవ నైపుణ్యాలు

మట్టిముద్దల వంటి మానవ వనరులను నిపుణ శక్తులుగా మలిస్తేనే సామాజిక ప్రగతి, ఆర్థిక వ్యవస్థ పురోగమనం జోరందుకుంటాయి. తమ యువతకు సరైన సమయంలో తగిన నైపుణ్య శిక్షణ అందిస్తున్న దక్షిణ కొరియా, జపాన్‌, జర్మనీ, యూకే, అమెరికా

Published : 18 Jan 2022 00:29 IST

ట్టిముద్దల వంటి మానవ వనరులను నిపుణ శక్తులుగా మలిస్తేనే సామాజిక ప్రగతి, ఆర్థిక వ్యవస్థ పురోగమనం జోరందుకుంటాయి. తమ యువతకు సరైన సమయంలో తగిన నైపుణ్య శిక్షణ అందిస్తున్న దక్షిణ కొరియా, జపాన్‌, జర్మనీ, యూకే, అమెరికా వంటి దేశాలు ఆ దిశగా సత్ఫలితాలు సాధిస్తూ, అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి. భారతదేశమూ ఆ బాటలో వడివడిగా ముందుకు సాగాలనే సుందర స్వప్నాన్ని ఆవిష్కరించిన 2009 జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం- 2022 నాటికి 50 కోట్ల మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ ప్రయత్నం ఆరంభ శూరత్వమైన దరిమిలా, రాబోయే ఏడేళ్లలో 40 కోట్ల మంది సామర్థ్యాలకు సానపడతామని మోదీ ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనకు శ్రీకారం చుట్టింది. నిరుడు డిసెంబరు నాటికి ఆ పథకం కింద 1.32 కోట్ల మందికే శిక్షణ లభించింది. దాని ఆసరాతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొన్నవాళ్లు 23.59 లక్షల మంది మాత్రమే! వివిధ పథకాల కింద దాదాపు 2.40 కోట్ల మందిని ప్రజ్ఞావంతులను చేసినట్లు ప్రభుత్వం వెల్లడిస్తున్నా- వాటి సాయంతో సంపాదనాపరులైనవారి సంఖ్య పరిమితమేనని పలు కథనాలు వెలువడ్డాయి. ఐటీఐ, పాలిటెక్నిక్‌లతో పాటు ఇతర వృత్తివిద్యా సంస్థల్లో సాంకేతిక శిక్షణ పొందదలచినవారికి బ్యాంకుల ద్వారా చేయూత అందించేందుకు ఉద్దేశించిన నైపుణ్య రుణ పథకం (ఎస్‌ఎల్‌ఎస్‌) సైతం అమలులో వట్టిపోయింది. గడచిన ఆరేళ్లలో కేవలం ఆరు వేల మందికి రూ.64.37 కోట్ల మేరకు లబ్ధి ఒనగూర్చిన ఎస్‌ఎల్‌ఎస్‌ను పునర్‌వ్యవస్థీకరించేందుకు కేంద్రం తాజాగా తలపోస్తోంది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో విద్యార్థులకు విశిష్ట మేలు చేకూర్చే విధానాలకు సర్కారు పట్టంకట్టాలి. పిల్లల భవితకు భరోసా కల్పించేలా ప్రధాన విద్యలో వృత్తివిద్యను మిళితం చేయాలి!
దక్షిణాసియా దేశాల్లోని దాదాపు సగం విద్యార్థుల్లో భవిష్యత్తు తరం ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టే నైపుణ్యాలు లోపిస్తున్నాయని యునిసెఫ్‌ లోగడ ఆందోళన వ్యక్తంచేసింది. దేశీయంగా 51శాతం మహిళలు, 46శాతం పురుషులకే ఉద్యోగ సాధనా సామర్థ్యం ఉన్నట్లు భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం, ఏఐసీటీఈ, సీఐఐల భాగస్వామ్యంతో రూపుదిద్దుకొన్న ‘ఇండియా నైపుణ్యాల నివేదిక-2022’ స్పష్టీకరించింది. యాంత్రీకరణ, సాంకేతికతల ద్వారా ఉత్పాదకత పెంపు ప్రణాళికలపై అంతర్జాతీయ సంస్థల సీఈఓలలో అత్యధికులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తృతమవుతున్న కృత్రిమ మేధా వినియోగ ఉద్ధృతిలో ఉద్యోగాలను పదిలం చేసుకోవాలంటే సృజనాత్మకత, విమర్శనాత్మక బుద్ధి కుశలత వంటి వాటిని నవతరం తప్పనిసరిగా అలవరచుకోవాల్సిందే. ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో పట్టు కలిగిన వారికి, గణిత శాస్త్ర ప్రావీణ్యులకు రాబోయే రోజుల్లో గిరాకీ ఇనుమడించనుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్ది ప్రజ్ఞాపాటవాలుగా వాసికెక్కిన వాటిని భావితరం సముపార్జించుకునేలా పాఠ్యప్రణాళికలను సాకల్యంగా సమీక్షించాలి. నాలుగు గోడల నడుమ మూస పద్ధతుల్లో ఈసురోమంటున్న బోధనకు బదులుగా విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించి, ఆచరణాత్మక శిక్షణకు సమధిక ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా సంస్కరణలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నిర్వహణతో యువతను సంసిద్ధం కావించేందుకు పాలకులు సంకల్ప దీక్ష వహించాలి. జ్ఞానాధారిత పోటీ ప్రపంచ యవనికపై భారతదేశ ముద్రను ప్రస్ఫుటం చేసేందుకు అదే సరైన దారి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.