సామాజిక సంకెళ్లలో వ్యక్తిస్వేచ్ఛ

నచ్చిన మనిషిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం- రాజ్యాంగదత్తమైన వ్యక్తిస్వేచ్ఛలో అంతర్భాగం. మేజర్లు అయిన యువతీ యువకుల హక్కు అది. లతాసింగ్‌ వర్సెస్‌ యూపీ ప్రభుత్వం కేసులో(2006) అదే అంశాన్ని స్పష్టీకరించిన సుప్రీంకోర్టు- కులాంతర..

Published : 19 Jan 2022 00:19 IST

చ్చిన మనిషిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం- రాజ్యాంగదత్తమైన వ్యక్తిస్వేచ్ఛలో అంతర్భాగం. మేజర్లు అయిన యువతీ యువకుల హక్కు అది. లతాసింగ్‌ వర్సెస్‌ యూపీ ప్రభుత్వం కేసులో(2006) అదే అంశాన్ని స్పష్టీకరించిన సుప్రీంకోర్టు- కులాంతర, మతాంతర వివాహాలతో ఒక్కటయ్యేవారిని కుటుంబ, సామాజిక వేధింపుల నుంచి రక్షించాలని దేశ పాలన, పోలీసు యంత్రాంగాలను ఆదేశించింది. నాగరిక సమాజ విశిష్ట లక్షణమైన వ్యక్తి స్వాతంత్య్రానికి గొడుగుపట్టిన న్యాయస్థానం ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో కొల్లబోతున్నాయి. ప్రత్యేక వివాహ చట్టం (ఎస్‌ఎంఏ, 1954) ఆసరాతో వైవాహిక బంధంలోకి అడుగు పెడదామనుకొనేవారికి ఆ శాసన నిబంధనలే మోకాలడ్డుతున్నాయి. ఎస్‌ఎంఏ కింద పెళ్ళి చేసుకొందామనుకొనే వ్యక్తులు జిల్లా వివాహ అధికారికి ముప్ఫై రోజుల ముందుగా ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలి. పదుగురికీ తెలిసేలా ఆ నోటీసును ప్రచురించడం, ఎవరైనా సరే ఆ వివాహానికి అభ్యంతరం తెలిపే అవకాశం ఉండటం తదితరాలు కొత్త జంటలకు తీవ్ర సమస్యాత్మకమవుతున్నాయి. నిబంధనలను దుర్వినియోగపరుస్తూ సంబంధిత వ్యక్తుల వివరాలను ఆరాతీస్తున్న బంధువర్గాలు, విద్వేష మూకలు- వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అవి ఆయా జంటలపై భౌతిక దాడులకూ తెగబడుతున్నాయి. ఆ దుస్థితికి కారణభూతమవుతున్న బహిరంగ ప్రకటన నిబంధనను వ్యక్తిగత గోప్యతకు విఘాతకరమైనదిగా అలహాబాదు హైకోర్టు నిరుడు అభివర్ణించింది. అది ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి అంశమేమీ కాదని తేల్చిచెప్పింది. దిల్లీ, పంజాబ్‌-హరియాణా, రాజస్థాన్‌ ఉన్నత న్యాయస్థానాలు సైతం వివిధ సందర్భాల్లో అటువంటి తీర్పులే వెలువరించాయి. వివాదాస్పద నిబంధనల చట్టబద్ధతను సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో 2020లో వ్యాజ్యం దాఖలైంది. దానిపై ప్రతిస్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది! అసహాయ ప్రేమికులకు అండగా నిలవాలన్న శాసన లక్ష్యం నెరవేరాలంటే- ఎస్‌ఎంఏ నిర్దేశిస్తున్న వివాహ విధివిధానాలను పూర్తిగా సరళీకరించాలి. భారత న్యాయసంఘం (లా కమిషన్‌) దశాబ్దం క్రితమే ఆ దిశగా చేసిన మేలిమి సిఫార్సులకు కేంద్రం సత్వరం ఆమోదముద్ర వేయాలి!

పెళ్ళి, పిల్లలు, కుటుంబ జీవితం, లైంగిక ధోరణి వంటివి వ్యక్తిగత గోప్యతా హక్కులో అవిభాజ్యమైనవి. వ్యక్తుల ఇష్టాయిష్టాలు, సంతోషకర జీవనంకోసం వారు తీసుకునే నిర్ణయాలను సమాజం నిర్దేశించజాలదు. శక్తివాహిని, షఫీన్‌ జహాన్‌, జస్టిస్‌ పుట్టస్వామి కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, వెలువరించిన చరిత్రాత్మక తీర్పులు- ఆ మేరకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నాయి. సామాజిక కట్టుబాట్ల రూపేణా పౌరుల చట్టబద్ధ హక్కులకు లక్ష్మణరేఖలు గీయడాన్ని అవి తీవ్రంగా గర్హిస్తున్నాయి. పితృస్వామ్య, భూస్వామ్య భావజాలాల ప్రతిఫలనాలుగా భారతీయ సమాజంలో కుల, లింగ దుర్విచక్షణలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వ భావనను బీటలువారుస్తూ మత విద్వేషాలూ పెచ్చరిల్లుతున్నాయి. అవి పరువు హత్యలకు దారితీస్తున్నాయి. 2014-20 మధ్య దేశవ్యాప్తంగా అటువంటివి 470 కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నా- ఆత్మహత్యలు, ప్రమాదాల పేరిట వాస్తవాలకు మసిపూస్తున్న ఘటనలు అనేకం! న్యాయపాలిక లోగడ ఈసడించినట్లు, ఆటవికమైన ఆ దుష్కృత్యాల్లో పరువేముంటుంది? అటువంటి హేయ నేరాలకు పాల్పడుతున్నవారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. సమాజ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఏకమయ్యే జంటలకు రక్షణ కల్పించేందుకు, వారిపై దురాగతాలకు ప్రేరేపించే పెద్దల పంచాయతీలను కట్టడి చేసేందుకు 2018లో ‘సుప్రీం’ జారీచేసిన విస్తృత మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలి. పౌరుల వైయక్తిక అంశాల్లో విశ్వాసాలు, సంప్రదాయాల మాటున బాహ్యశక్తుల జోక్యం అవాంఛనీయం, ఆందోళనకరం. నాగరిక విలువలతో కూడిన విద్యావ్యాప్తికి ప్రోదిచేస్తూ చట్టబద్ధమైన పరిపాలనకు పాలకులు పట్టంకడితేనే- ఆ పెడధోరణులకు అడ్డుకట్ట పడేది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.