ప్రజాభద్రతకు సైబర్‌ సవాలు

డిజిటలీకరణ దిశగా ప్రపంచ పురోభివృద్ధికి సైబర్‌ దాడులు పెనువిఘాతాలుగా పరిణమిస్తున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పది రోజుల క్రితం ఆందోళన వ్యక్తపరచారు. ర్యాన్సమ్‌వేర్లతో విచ్చలవిడిగా....

Updated : 22 Jan 2022 04:11 IST

డిజిటలీకరణ దిశగా ప్రపంచ పురోభివృద్ధికి సైబర్‌ దాడులు పెనువిఘాతాలుగా పరిణమిస్తున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పది రోజుల క్రితం ఆందోళన వ్యక్తపరచారు. ర్యాన్సమ్‌వేర్లతో విచ్చలవిడిగా పేట్రేగిపోతున్న కేటుగాళ్లు- ఎన్నో సంస్థల కీలక సమాచారాన్ని చులాగ్గా చేజిక్కించుకొంటూ, వందల కోట్ల రూపాయలను అప్పనంగా దండుకుంటున్నారు. 2020తో పోలిస్తే విశ్వవాప్తంగా సైబరాసురుల దాష్టీకాలు నిరుడు 151శాతం మేరకు అధికమయ్యాయని ప్రపంచ ఆర్థిక వేదిక తాజాగా వెల్లడించింది. రాబోయే రోజుల్లో అవి ఇంకా పెచ్చుమీరతాయని హెచ్చరించింది. దేశీయంగా సైబర్‌ దాడుల సంఖ్య 2019లో 3.94 లక్షలుగా నమోదైతే- ఏడాది తిరిగేసరికి అవి 11.58 లక్షలకు ఎగబాకాయి. అమెరికన్‌ సంస్థ క్రౌడ్‌స్ట్రయిక్‌ సర్వే ప్రకారం, క్రితం సంవత్సరం భారతీయ కంపెనీల్లో 76శాతం ర్యాన్సమ్‌వేర్ల బారినపడ్డాయి. నేరగాళ్లకు మూడు కోట్ల రూపాయల నుంచి రూ.300 కోట్ల వరకు ముడుపులు చెల్లించి కానీ, వాటిలో మూడో వంతు సంస్థలు మళ్ళీ ఊపిరి పీల్చుకోలేకపోయాయన్న అధ్యయనాంశాలు కలవరపరుస్తున్నాయి. అంతర్జాల ఆధారిత వ్యాపార సంస్థలకు అనుమతులు మంజూరు చేసే సమయంలోనే వాటి సాంకేతిక రక్షణ వ్యవస్థలను తనిఖీ చేయాల్సి ఉన్నా- ఆ పరిశీలన నామమాత్రంగా సాగుతున్నట్లు లోగడే కథనాలు వెలువడ్డాయి. దాని పర్యవసానంగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలు తస్కరణకు గురై, అంగడి సరకులవుతున్నాయి. 2018-21 నడుమ 94వేలకు పైగా భారతీయ వెబ్‌సైట్లు హ్యాకర్ల పాలబడినట్లు కేంద్ర సర్కారు ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. ‘ఐపీ’ (ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) చిరునామాలను బట్టి చూస్తే- ఆ దాడుల మూలాలు చైనా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియా, రష్యా, టర్కీ తదితర 19 దేశాల్లో ఉన్నట్లు తేలింది. ప్రధాని మోదీ గతంలో ఉద్ఘాటించినట్లు, జాతీయ భద్రతలో సైబర్‌ రక్షణ అంతర్భాగమైతేనే ‘డిజిటల్‌ ఇండియా’ స్వప్నాలు ఈడేరుతాయి!

నూటపది కోట్లకు పైబడిన మొబైల్‌ కనెక్షన్లు, దాదాపు 70 కోట్ల మంది అంతర్జాల వినియోగదారులను కలిగిన ఇండియాలో సైబర్‌ చోరుల ఆగడాలు పోనుపోను శ్రుతిమించుతున్నాయి. రాజస్థాన్‌, ఝార్ఘండ్‌ తదితర రాష్ట్రాల్లో తిష్ఠవేసిన నేర తండాలు- స్థానిక నేతలు, పోలీసుల దన్నుతో దేశవ్యాప్తంగా సామాన్యులను నిలువునా దోచుకుంటున్నాయి. జనాన్ని బురిడీ కొట్టించడంలో ఆరితేరిన మాయగాళ్లు 2019లోనే దేశీయంగా రూ.1.25 లక్షల కోట్లను కొల్లగొట్టారు. కొవిడ్‌ ప్రజ్వలనం తరవాత వారి నేరాల ఉద్ధృతి అయిదింతలైందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ స్పష్టీకరించారు. మోసాలు పెచ్చరిల్లుతున్న దృష్ట్యా సైబర్‌ భద్రత, సమాచార గోప్యతలకు పెద్దపీట వేయాలని రిజర్వ్‌బ్యాంక్‌ లోగడే సూచించినా- యాభై శాతం బ్యాంకులు సంస్థాగతంగా వార్షిక ప్రమాద మదింపు అధ్యయనాలనే చేపట్టడం లేదు! తమ ప్రమేయం లేకుండానే సొమ్మును పోగొట్టుకుంటున్న ఖాతాదారులకు న్యాయం జరగాలంటే, సైబర్‌ నేరాలకు బ్యాంకులు బాధ్యత వహించాలని అలహాబాద్‌ హైకోర్టు తాజాగా స్పష్టీకరించింది. ఆన్‌లైన్‌ మోసగాళ్లపై పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో శిక్షలుపడుతున్న వాటి సంఖ్య పదిశాతానికి లోపే పరిమితమవుతుండటం విస్మయపరుస్తోంది. సైబర్‌ భద్రతా నిపుణుల అందుబాటులో ప్రపంచ సగటు కన్నా ఇండియా వెనకబడి ఉందన్న విశ్లేషణలూ ఆందోళనకరమే. ఆ దుస్థితిని తొలగించేలా నవతరంలోంచి సాంకేతిక సైన్యాన్ని కూడగట్టేందుకు తీరైన పాఠ్యప్రణాళికలు అత్యవసరం. రాష్ట్రాల మధ్య సమన్వయం దృఢతరమై, జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యదళం సత్వరం సాకారమైతేనే- సైబర్‌ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు వీలవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.