విశ్వామిత్ర సృష్టి
‘సూర్యుడు’ అనే పదానికి ప్రేరేపించేవాడని అర్థం. జీవులను కర్తవ్యం దిశగా పురిగొల్పుతాడాయన. కవులను కవిత్వాల దిశగా ప్రేరేపించేదీ ఆయనే... సూర్యుడు ‘కవిత్వ సద్గురు మూర్తి’ అన్నాడు భాస్కర శతకకర్త మారన.
‘సూర్యుడు’ అనే పదానికి ప్రేరేపించేవాడని అర్థం. జీవులను కర్తవ్యం దిశగా పురిగొల్పుతాడాయన. కవులను కవిత్వాల దిశగా ప్రేరేపించేదీ ఆయనే... సూర్యుడు ‘కవిత్వ సద్గురు మూర్తి’ అన్నాడు భాస్కర శతకకర్త మారన. ‘ఇంచుక నేర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వమున్- మించు(కాంతి) వహించె నీ కతన!’ అంటూ జేజేలు పలికాడు. సూర్యుడి పేరు చెప్పి సుప్రభాత సౌందర్యం, మధ్యందిన మార్తాండ తేజం, సాయంసంధ్యా వందనం... ఎన్నిరకాలుగా, ఎంత గొప్ప కవిత్వం వెలువడిందనీ! ఆకుపచ్చని గరిక పరకల కొసలమీది మంచు ముత్యాలకు గోరువెచ్చని భానవీయ కిరణావళి రంగులద్దితే- ఆ సౌందర్యం ఒక రకం. ఉరకలెత్తే సముద్రపుటలలకు ఉదయారుణ కిరణాలు ఓపిగ్గా పసిడి పూతలు పూస్తే- ఆ సొగసు మరోరకం. సుదూర నిశ్చల గిరుల మధ్యలోంచి సర్రున లేచే అరుణ గభస్తి బింబాన్ని తిలకించడం అసమాన అనుభూతి. ఈ విభిన్న దృశ్యాలన్నింటినీ మయూరుడి సూర్యశతకం విలక్షణంగా చిత్రించింది. ఆ స్ఫూర్తితో శ్రీనాథుడు తన కాశీఖండంలో ‘పాథోనిధులయందు (సముద్ర జలాల్లో) పవడంపు లేతీగ, కాలాభ్రములయందు (మేఘాలలో) కోల మెరుపు...’ అంటూ చివరకు సూర్యబింబాన్ని సుప్రభాత జవరాలి జడకొప్పులో ఎర్రకలువల గుత్తిగా ముక్తాయించాడు. మనోహరమైన ఈ దృశ్యమాలికలను ఆస్వాదించడమూ సూర్యోపాసనే అనిపించాడు. మనిషిని ఓ కంట కనిపెట్టే 18 మహా పదార్థాల్లో సూర్యుడొకడని మహాభారతం చెప్పింది. సూర్యుణ్ని కర్మసాక్షిగా పేర్కొంది. ‘ప్రపంచాన్నంతటినీ పరికించే కన్ను’ అనే అర్థంలో సూర్యుణ్ని అందరూ ‘జగచ్చక్షువు’గా వర్ణిస్తే- విశ్వనాథ ‘ఆయన జగదక్షుడు... ప్రపంచానికే కన్ను’ అంటూ అభివర్ణించారు. ‘వెలుగులు తన్నుమించి మరి విశ్వమునందున వేరు చోట లేవు’ అని తేల్చి చెప్పారు.
‘దినాంతే నిహితం తేజః సవిత్రేవ హుతాశనః... సాయం సమయాల్లో తన తేజాన్ని అగ్నిలో దాచి ఉదయం తిరిగి స్వీకరిస్తాడు’ అన్నాడు రఘువంశంలో కాళిదాసు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ తాపం పెరుగుతుంది. వేసవిలో అయితే మరీను! ‘జఠరస్థ జలము నాసానాళమున పీల్చి, సామజంబు ఇరుప్రక్క చల్లుకొనియె... ఉదర జలాన్ని తొండంతో పీల్చి, ఏనుగు ఇరువైపులా చల్లుకొంటోంది’ అంటూ పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్పినట్లు- లోకం ఉక్కబోతతో అల్లాడుతుంది. సూర్యాస్తమయాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించినవాడు తిక్కన. తన కొడుకైన కర్ణుడు కురుక్షేత్రంలో మరణించగానే మైలశుద్ధి కోసమా అన్నట్లు... ‘పావన స్నానము ఒనరింప అపర జలనిధి (పశ్చిమ సాగరం) లోనికి అరిగె ఇనుడు’ అన్నాడు. ఇలా ఎంతోమంది కవులకు ప్రేరణగా నిలిచిన సూర్యుణ్ని- విద్యుదుత్పత్తికి ఉపకరణంగా మార్చుకోవాలని చైనా ఆలోచిస్తోంది. ‘మెదడన్నది మనకున్నది... అది సరిగా పని చేస్తే విశ్వరహః పేటిక విపాటన జరగక తప్పదు’ అన్న శ్రీశ్రీ మాటలను నిజం చేస్తోంది. విద్యుదుత్పత్తికి మధ్యాహ్న సూర్యుడు మిక్కిలి అనుకూలుడు. కనుక హరివంశంలో ఎర్రాప్రగడ వర్ణించిన ‘ప్రచండ మార్తాండమండల సహస్ర దుర్నిరీక్ష్య సహజ తేజో విరాజితుడైన’ కృత్రిమ సూర్యుణ్ని సృష్టించింది. అసలు సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉండగా కృత్రిమ సూర్యుడి ప్రచండ తీవ్రత ఏడు కోట్ల డిగ్రీల సెల్సియస్ అట! పైగా దాని మొదటి అక్షరాలను కలిపితే ఈస్టు(తూర్పు) అని అర్థమొచ్చేలా ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్‌కు ‘ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్’ అని పేరు పెట్టింది. ఇది విలయానికో వికాసానికో కాలం తేలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్