సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

ప్రథమ రాజ్యాంగ అధికరణ ప్రకారం, రాష్ట్రాల సమాహారమే భారతదేశం. కేశవానందభారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించినట్లు, సమాఖ్యతత్వమే దాని మౌలిక స్వభావం. బహుళ వర్గాలు, బహు భాషలు, భిన్న అవసరాలు

Published : 24 Jan 2022 00:11 IST

ప్రథమ రాజ్యాంగ అధికరణ ప్రకారం, రాష్ట్రాల సమాహారమే భారతదేశం. కేశవానందభారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించినట్లు, సమాఖ్యతత్వమే దాని మౌలిక స్వభావం. బహుళ వర్గాలు, బహు భాషలు, భిన్న అవసరాలు, విభిన్న ఆకాంక్షలతో కూడిన దేశంలో అధికార కేంద్రీకరణ అనర్థాలకు దారితీస్తుందని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా గుర్తించారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, బాధ్యతలను నిర్దేశించారు. ఆ లక్ష్మణరేఖలను మీరుతూ రాష్ట్రాలను శక్తిహీనం చేసి సర్వంసహాధికారాలను గుప్పిట పట్టాలన్న కేంద్ర పాలకుల విపరీత ధోరణి- దశాబ్దాలుగా వివాదాస్పదమవుతోంది. తత్ఫలితంగా ఇరుపక్షాల నడుమ విశ్వాసరాహిత్యం పోనుపోను అధికమవుతోంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఓఎస్‌ అధికారుల కేడర్‌ నిబంధనల్లో మార్పుచేర్పులు తలపెడుతున్న మోదీ ప్రభుత్వం- తాజాగా మరోసారి ఆ వివాదాల తేనెతుట్టెను కదిపింది. కేంద్రంలో విధుల నిర్వహణకు అధికారగణం తరుగుపడటంతో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర సర్కారు ఈ సందర్భంగా ఉటంకిస్తోంది. నియమాల సవరణతో ఆ పరిస్థితిని అధిగమించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారుల కొరతను పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల ప్రస్తావించింది. ఆసేతుహిమాచలం పాలనావసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాల్సి ఉంది. తద్భిన్నంగా అఖిల భారత సర్వీసు అధికారుల డెప్యుటేషన్‌ ప్రక్రియలో తమ ప్రమేయాన్ని పరిమితం చేసే ప్రతిపాదనలపై రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉన్నతాధికారుల పనితీరుపై అవి దుష్ప్రభావం చూపడమే కాదు, రాష్ట్ర పాలనా యంత్రాంగాలను కుంటుపరుస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ లోగడ ఉద్ఘాటించినట్లు, కేంద్రం ఆలోచనలను రాష్ట్రాలపై రుద్దడం అసమంజసం. సహకార సమాఖ్యతత్వానికి బీటలు వార్చే ప్రయత్నాలేవైనా సరే, జాతీయ సమగ్రతకు అతి ప్రమాదకరమైనవి. ఆ దుస్థితి తలెత్తకూడదంటే- రాష్ట్రాల హక్కులను గుర్తిస్తూ, వాటి అభిప్రాయాలకు సమధికంగా విలువిచ్చే రాజకీయ సంస్కృతి దేశీయంగా పాదుకొనాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కాలానుగుణమైన గుణాత్మక మార్పులను అభిలషిస్తూ రాజమన్నార్‌, సర్కారియా, జస్టిస్‌ వెంకటాచలయ్య, జస్టిస్‌ ఎం.ఎం.పూంఛీ తదితర సంఘాలు చేసిన కీలక సూచనలకు మన్నన దక్కాలి!

శాసన పూర్వ సంప్రతింపుల విధానానికి చెల్లుకొడుతూ కేంద్రం పట్టాలకెక్కిస్తున్న చట్టాలపై కొన్నాళ్లుగా విమర్శలు ముమ్మరిస్తున్నాయి. సమాచార హక్కు చట్ట సవరణల నుంచి వివాదాస్పద సాగు శాసనత్రయం వరకు అందుకు ఎన్నో దృష్టాంతాలు పోగుపడ్డాయి. చిన్న ఓడరేవులపై అజమాయిషీని కేంద్రానికి దఖలుపరచే భారతీయ రేవుల బిల్లు-2021ను గుజరాత్‌, ఏపీ, తమిళనాడు, ఒడిశా తీవ్రంగా వ్యతిరేకించాయి. పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా- రాష్ట్రాల పరిధిలోని పోలీసింగ్‌లో కేంద్రం జోక్యానికి అవకాశమిస్తోందంటూ ఎన్‌ఐఏ శాసన సవరణపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వమూ అదే బాట పట్టింది. విద్యుత్తు చట్టంలో మార్పుచేర్పుల ప్రతిపాదనలపైనా వివిధ రాష్ట్రాలు గళమెత్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థల స్వతంత్రతపై నీలినీడలు పరచుకొంటున్నట్లుగా వెలువడుతున్న కథనాలు కలవరపరుస్తున్నాయి. హక్కుల గురించి మాట్లాడటం, వాటి కోసం పోరాడటాన్ని సమయాన్ని వృథా చేయడంగా అభివర్ణిస్తూ; ప్రాథమిక విధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నేతల వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి. భారత రాజ్యాంగం హక్కులకే పెద్దపీట వేసింది. వాటిని, ఆత్యయిక స్థితి కాలంలో ఉనికి లోకి వచ్చిన ప్రాథమిక విధులను ఒకేగాటన కడితే ప్రజాతంత్రం పెళుసుబారుతుంది. ఆర్థిక వనరుల లేమితో అల్లాడుతున్న రాష్ట్రాలకు చేయూతనందిస్తూ పౌరసేవలను పటిష్ఠీకృతం చేస్తూ, విధాన రచనలో జనాకాంక్షలకు పట్టంకట్టినప్పుడే- బలమైన, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య భారతం ఆవిష్కృతమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.