‘తయారీ’ ప్రగతి... జాతికే కలిమి!

అక్షరాలా ఎలెక్ట్రానిక్స్‌ యుగమిది. చరవాణులు, ట్యాబులు, కంప్యూటర్ల వంటివెన్నో ఇంటింటా అత్యవసర వస్తువుల జాబితాలోకి చేరిపోతున్నాయి. చైనా ఏటా రూ.18,68,000 కోట్ల దాకా విలువ చేసే ఎలెక్ట్రానిక్‌ ఉత్పాదనల్ని ఎగుమతి చేస్తోందని అంచనా. అందులో సగానికైనా చేరలేక ఇండియా..

Published : 26 Jan 2022 00:31 IST

క్షరాలా ఎలెక్ట్రానిక్స్‌ యుగమిది. చరవాణులు, ట్యాబులు, కంప్యూటర్ల వంటివెన్నో ఇంటింటా అత్యవసర వస్తువుల జాబితాలోకి చేరిపోతున్నాయి. చైనా ఏటా రూ.18,68,000 కోట్ల దాకా విలువ చేసే ఎలెక్ట్రానిక్‌ ఉత్పాదనల్ని ఎగుమతి చేస్తోందని అంచనా. అందులో సగానికైనా చేరలేక ఇండియా కిందుమీదులవుతుండటం సమకాలీన చరిత్ర. కేంద్రం దఫాల వారీగా ప్రకటించిన ఉత్పాదక సంబంధిత ప్రోత్సాహకాల దన్నుతో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగం ఏడు లక్షల కోట్ల రూపాయల స్థాయిని అందిపుచ్చుకోనుందన్న ఆశావహ విశ్లేషణలు ఇటీవల వెలుగు చూశాయి. కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌ సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ తాజాగా వెలువరించిన దార్శనిక పత్రం మరింత జోరును లక్షిస్తోంది. 2026 సంవత్సరం నాటికి భారత ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగం వార్షిక టర్నోవరు రూ.22.4 లక్షల కోట్లకు చేరాలన్నది నిజంగా బృహత్తర నిర్దేశమే. అందులో ఒక్క ఎగుమతుల పద్దుకిందే తొమ్మిది లక్షల కోట్ల రూపాయల మార్కు చేరాలని దార్శనిక పత్రం సూచిస్తోంది. వాస్తవానికి, ఎలెక్ట్రానిక్స్‌పై 2019 నాటి జాతీయ విధానం 2025 సంవత్సరానికే రూ.30లక్షల కోట్ల టర్నోవరు సాధించాలని అభిలషించింది. అది ఆచరణ సాధ్యం కాదని ఐసీఈఏ (ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలెక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) ఖండించింది. 2026 నాటికి సుమారు రూ.22.5 లక్షల కోట్ల మేర ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తి సాధ్యం కావచ్చునని మదింపు వేసింది. తాజా దార్శనిక పత్రం బాణీ అందుకు అనుగుణంగానే ఉంది! ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తి ఎగుమతుల్లో చైనా, వియత్నామ్‌లకు దీటుగా రాణించాలన్న ఉద్బోధ వినసొంపుగా ఉంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, 10-30 ఏళ్ల పాటు పన్ను మినహాయింపులు... వర్తింపజేయడంలో పోటీ పడితేనే, గణనీయ పురోగతి సుసాధ్యమయ్యేది!

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ను నినదించిన కేంద్రం- అత్యవసర అజెండా తొలి వరసలో తయారీరంగ సముద్ధరణను నిలబెట్టింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశీయ తయారీరంగం వాటా కొన్ని సంవత్సరాలుగా 15-16 శాతం వద్దనే గిరికీలు కొడుతోంది. చైనాలో అది 26 శాతం పైమాటే. దక్షిణకొరియా, ఫ్రాన్స్‌ వంటివీ మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. జీడీపీలో దేశీయ తయారీరంగం వాటాను కనీసం 25 శాతానికి చేరుస్తామన్న ఘనసంకల్ప దీక్షా ప్రకటనలెన్నో మాటలకే పరిమితమయ్యాయి. ఇండియాలో తయారీరంగం దృఢంగా వేళ్లూనుకుంటే కోట్లాది ఉద్యోగాల పరికల్పనకది విశేషంగా దోహదపడుతుందని నిపుణులెందరో ఉద్బోధించారు. దశాబ్దాల తరబడి వాస్తవిక కార్యాచరణలో నేతాగణం హామీలకు చర్యలకు మధ్య యోజనాల దూరం పేరుకుపోయింది. పిన్నీసులనుంచి విమానాలదాకా ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడేలా తిష్ఠవేసిన పోకడలు- పారిశ్రామిక భారతావనిని స్థిరంగా నిలదొక్కుకోనివ్వలేదు. ఇకనైనా ఈ దురవస్థ చెదిరిపోవాలంటే, భారత్‌లో తయారీ స్ఫూర్తిని పరిమళింపజేస్తూ భిన్న అంచెల్లో చర్యలు ఊపందుకోవాలి. విడిభాగాలపై పెద్దయెత్తున దిగుమతి సుంకాల విధింపు, నియంత్రణ విధానంలో అనిశ్చితి వంటివి భారత ఎలెక్ట్రానిక్స్‌ రంగానికి ప్రతిబంధకాలవుతున్నాయన్న యథార్థాన్ని దార్శనిక పత్రమే నిర్ధారించింది. రేపటి కేంద్ర బడ్జెట్లో ఆ మేరకు దిద్దుబాటు చర్యలు చోటు చేసుకుంటాయేమో చూడాలి. కొడితే డ్రాగన్‌నే కొట్టాలన్న పంతం సమర్థనీయమైందే. ధర, నాణ్యతా ప్రమాణాల్లో చైనా, వియత్నాం తదితరాల్ని బెంబేలెత్తించే విధంగా ఉత్పత్తుల వ్యూహప్రణాళికలు పదునుతేలాలి. లఘు పరిశ్రమలకూ సముచిత భాగస్వామ్యం కల్పిస్తూ విస్తృత ప్రాతిపదికన మానవ వనరుల సద్వినియోగానికి దీర్ఘకాలిక యోజనల్ని పట్టాలకు ఎక్కించాలి. మౌలిక జాడ్యాల్ని కుదర్చడమే, తయారీరంగాన దిగ్గజశక్తిగా భారత్‌ అవతరణకు బాటలుపరుస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.