ప్రలోభస్వామ్యం!

అదుపు లేని గుర్రాలు అడవులు పట్టుకుని తిరిగినట్లు, అడ్డూఆపూ కొరవడిన రాజకీయ పక్షాలు ఓట్ల యావలో వాగ్దానాల వరద పారిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ఉచిత పథకాల పందేరంగా మార్చేస్తున్నాయి. పంజాబ్‌ అధికారపీఠాన్ని

Published : 27 Jan 2022 00:05 IST

అదుపు లేని గుర్రాలు అడవులు పట్టుకుని తిరిగినట్లు, అడ్డూఆపూ కొరవడిన రాజకీయ పక్షాలు ఓట్ల యావలో వాగ్దానాల వరద పారిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ఉచిత పథకాల పందేరంగా మార్చేస్తున్నాయి. పంజాబ్‌ అధికారపీఠాన్ని తమకు అప్పగిస్తే పద్దెనిమిదేళ్లకు పైబడిన మహిళలకు నెలకు తలా వెయ్యి రూపాయల వంతున అందిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. తామొస్తే అంతకు రెండింతల చొప్పున అతివలకు ఆర్థిక సాయం చేస్తామని అకాలీదళ్‌ ఊదరగొడుతోంది. కోటి మంది విద్యార్థులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్ల పంపిణీకి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత నెలలో తెరతీసింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే సమ్మిళిత సుస్థిర సమాజాభివృద్ధికి ఏమి చేస్తామో చెప్పకుండా, వర్గాల వారీగా ఏమేమి ఇస్తామో పార్టీలు ఏకరువు పెడుతున్నాయి. తాత్కాలిక తాయిలాల పంపకమే సంక్షేమ పాలనకు సరికొత్త ప్రమాణంగా అవి అభివర్ణిస్తున్నాయి. ప్రజాధనమే పెట్టుబడిగా పెచ్చరిల్లుతున్న ప్రలోభస్వామ్యంపై సుప్రీంకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న పార్టీల వైఖరి- రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యానికీ పెనుముప్పుగా పరిణమించింది. రిజర్వ్‌ బ్యాంకు ఇటీవలి నివేదికల ప్రకారం, పది పెద్ద రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లు వడ్డీల భారంతో మరింతగా కుంగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మౌలిక సదుపాయాల వృద్ధి, ఉత్పత్తి పెంపుతో సంపద సృష్టికి మారుగా జనాకర్షక పథకాలతో వ్యక్తిగత పరపతిని పెంచుకునేందుకు ఆ రుణాల సొమ్మును పాలకులు ధారపోస్తున్నారు. అధిక పన్నుల రూపంలో అంతిమంగా ఆ బకాయిల భారాన్ని ప్రజలే వహించవలసి వచ్చే దుర్గతిని చేజేతులా కల్పిస్తున్నారు. గట్టి నిర్ణయాలతో పార్టీల పెడపోకడలకు ఎన్నికల సంఘం కళ్లెం వేయలేకపోవడం- దేశం దురదృష్టం. న్యాయపాలిక గతంలోనే ఆశించినట్లు ప్రత్యేక శాసన నిర్మాణంతోనే అది సాధ్యం. కానీ, అన్ని పార్టీలూ అదే తానుముక్కలైనప్పుడు పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

వెనకబడిన వర్గాలకు, తాడిత పీడిత ప్రజాసమూహాలకు సర్కారీ చేయూత కచ్చితంగా అవసరం. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనతో జనశ్రేయానికి పాటుపడటమే సంక్షేమ విధానాల అసలు లక్ష్యం. పారిశ్రామిక ప్రగతికి పాదులుతవ్వుతూ, నైపుణ్య శిక్షణతో యువతను తీర్చిదిద్దుతూ నిరుద్యోగ పెనుభూతాన్ని పారదోలాలి. మొత్తంగా జనజీవన ప్రమాణాల పెంపునకు ప్రజాధనాన్ని సద్వినియోగపరచాలి. తద్భిన్నంగా ప్రత్యక్ష నగదు బదిలీలతో బులిపించడమంటే- ప్రజలను అచ్చంగా మోసపుచ్చడమే! జనం జీవితాంతం ఏలినవారి దయపై ఆధారపడేలా చేసే సంకుచిత రాజకీయ వ్యూహమది. తమ జీవన నాణ్యతపై 46శాతం భారతీయులు పెదవి విరిచినట్లు నిరుడు కథనాలు వెలుగుచూశాయి. సామాజిక భద్రతకు దోహదపడే పలు పథకాలు క్షేత్రస్థాయిలో వట్టిపోతున్నట్లు అధికారిక అధ్యయనాలు లోగడే నిర్ధారించాయి. ఆ లోపాలను సరిచేసేందుకు ఆసక్తి చూపని ఏలికలు- పదవులను అంటిపెట్టుకోవడమే ఏకైక లక్ష్యంగా ఉచిత హామీలకు లాకులెత్తుతున్నారు. పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రణాళికలను ఈసీలు కాచివడపోసి, అసంబద్ధమైన వాటిని తొలగించే వ్యవస్థ భూటాన్‌, మెక్సికోల్లో అమలులో ఉంది. బడ్జెట్‌పై తమ వాగ్దానాల ప్రభావాన్ని మ్యానిఫెస్టోల్లో ఉటంకించడమే కాదు- వాటిని ఆడిట్‌కోర్టుకు నివేదించే పద్ధతి కొన్ని ఐరోపా దేశాల్లో సువ్యవస్థితమైంది. నోటికొచ్చిన వరదానాలతో నేతలు చెలరేగిపోతూ, ఓట్ల పథకాలతో సర్కారీ ఖజానాలను ఊడ్చేసే దుర్విధానాలు దేశీయంగా వెర్రితలలు వేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట పడనంత కాలం ప్రజాస్వామ్యం అపహాస్యమవుతూ, వాస్తవ జన సంక్షేమం ఎండమావిగా మిగిలిపోతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.