రాజకీయ స్వాహాకారం

ఆరు లక్షలకు పైగా గ్రామాల్లో సుమారు 13 కోట్ల మంది సభ్యులతో 95 వేలకు మించిన సంఘాలు... దేశంలో పీఏసీ(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా)ల విస్తృతికి దర్పణం పట్టే గణాంకాలివి.

Published : 29 Jan 2022 00:15 IST

ఆరు లక్షలకు పైగా గ్రామాల్లో సుమారు 13 కోట్ల మంది సభ్యులతో 95 వేలకు మించిన సంఘాలు... దేశంలో పీఏసీ(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా)ల విస్తృతికి దర్పణం పట్టే గణాంకాలివి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామ స్థాయి రుణ వితరణ వ్యవస్థ దేశీయంగా కొలువు తీరినా- రైతాంగానికి సరైన సేవలందించడంలో నిరాసక్త ధోరణులు నివ్వెరపరుస్తున్నాయి. పంట సాగు మొదలు దిగుబడుల విక్రయాల దాకా సంవత్సరం పొడుగునా రైతాంగానికి సహకరించడం పీఏసీల మౌలిక విధి. సంఘాల నిర్వహణలో ఎక్కడా రాజకీయాలకు తావుండరాదని, అంతటా పారదర్శకతకు పెద్దపీట వేయాలని సహకార చట్టం నిర్దేశిస్తోంది. వాస్తవిక కార్యాచరణలో ఆ స్ఫూర్తి నిలువునా నీరోడుతుండటమే దురదృష్టకరం. రాజకీయ మకిలంటి అవినీతికి అవకతవకలకు పర్యాయపదాలుగా ఎన్నో సంఘాలు భ్రష్టుపడుతున్నాయి. రుణాలకు సంబంధించి అక్రమాలు పెచ్చరిల్లాయంటూ రాజ్‌ సహకార్‌ పోర్టల్‌కు దాదాపు 83వేల ఫిర్యాదులు వెల్లువెత్తాయని రాజస్థానీ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఏడు నెలల క్రితం లెక్క చెప్పారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోనూ అవినీతి బాగోతాలు వీధికెక్కాయి. కేరళ మినహా చాలా రాష్ట్రాల్లోని సహకార సంఘాలు(ప్యాక్స్‌), డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)లు అక్రమాలకు నష్టాలకు నెలవులై పరువు మాస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడోవంతుకు పైగా సంఘాలు ఆర్థిక ఇక్కట్ల పాలబడి ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు క్షేత్ర స్థాయి కథనాలు చాటుతున్నాయి. రాజకీయాల ఉచ్చు నుంచి సహకార సంస్థల్ని బంధవిముక్తం చేసి, వాటి అవతరణ లక్ష్యాలు నెరవేరడానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టి పూనిక వహించాలని ప్రధానిగా వాజ్‌పేయీ రెండు దశాబ్దాల క్రితం పిలుపిచ్చారు. ఇప్పటికీ వాటి తలరాత ‘నానాటికి తీసికట్టు...’ సామెత చందంగానే ఉండటం- రైతాంగం ప్రయోజనాలకు గండి కొడుతోంది.

గ్రామీణులకు నామమాత్ర వడ్డీపై రుణవసతి కల్పించే లక్ష్యంతో దేశంలో ఏనాడో 1904లో సహకార సంఘాల చట్టాన్ని రూపొందించారు. స్థానికంగా పెట్టుబడి సమకూర్చుకునేందుకు వీలుగా 1912లో ఇంకో శాసనం తెచ్చారు. రైతుల అవసరాల్ని తీర్చడంలో సహకారోద్యమం విఫలమైందని అఖిల భారత గ్రామీణ రుణ పరపతి అధ్యయన సంఘం ఆరున్నర దశాబ్దాల క్రితం తూర్పారపట్టింది. దేశానికి స్వాతంత్య్రం లభించిన దరిమిలా అనేక కమిటీలు సహకార సంస్థల పనిపోకడల్ని సంస్కరించేందుకు సూచనలెన్నో చేశాయి. ఎవరేమని ఉద్బోధించినా- రాజకీయ పార్టీలు స్వీయ లబ్ధికోసం సహకారోద్యమాన్ని చెరపట్టి, నేటికీ యథేచ్ఛగా చలాయించుకుంటున్నాయన్నది నిష్ఠుర సత్యం. బోగస్‌ సభ్యత్వాలు, రుణాల మంజూరులో రాజకీయ జోక్యం... అసంఖ్యాక సహకార సంఘాల జవసత్వాలను హరించివేశాయి. చాలా చోట్ల పాలక మండళ్లకు జవాబుదారీతనం లేదు, ఎప్పటికప్పుడు ఆడిటింగూ కరవు. అవసరమైన రైతులకు విత్తనాలు, పురుగుమందులు, సేద్య యంత్రాల విక్రయాలు చేపట్టి ఇతరత్రా సేవలందించి తామూ లబ్ధి పొందగల అవకాశాన్ని సంఘాలెన్నో చేజేతులా జారవిడుస్తున్నాయి. కౌలు రైతులకూ సభ్యత్వం కల్పించి మరిన్ని ‘ప్యాక్స్‌’ ఏర్పరుస్తామన్న హామీలు ఒకవంక వినిపిస్తున్నా- కోట్ల రూపాయల్లో గోల్‌మాల్‌ బాగోతాలకు అడ్డుకట్ట పడటం లేదు. గాడి తప్పాయంటూ 44 అంతర్రాష్ట్ర సహకార రుణ సంఘాలపై కేంద్రం ఇటీవల కొరడా ఝళిపించింది. అమిత్‌ షా నేతృత్వాన ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను నెలకొల్పడం, పునాది స్థాయిలో పట్టు పెంచుకునేందుకేనన్న ఆరోపణల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బ్రెజిల్‌, నార్వే, ఉరుగ్వే, కెనడా ప్రభృత దేశాలు సహకార ఫలాల్ని విస్తృత జనబాహుళ్యానికి చేరువ చేస్తుండగా- ఇక్కడ దిద్దుబాటు పేరిట సమాఖ్య భావనను బీటలు వార్చే యత్నాలు ఆందోళనపరుస్తున్నాయి. రుణవితరణతో అన్నదాతలకు ఎంతో కొంత అక్కరకొస్తున్న సహకార సంఘాల్ని పరిపుష్టం చేయడమెంత ముఖ్యమో, ఫెడరల్‌ స్ఫూర్తి కదలబారకుండా కేంద్రం కాచుకోవడమూ అంతే కీలకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.