ఆన్‌లైన్‌ చదువుల విప్లవం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్ల కొరత మూలాన గత్యంతరం లేక ఏటా ఎంతోమంది తాము కోరుకున్నదానిలో కాక వేరే కోర్సులో చేరాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఆర్థిక స్థోమత కరవై మరెందరో ఉన్నత విద్యార్జనపై ఆశలు వదిలేసుకుని రాజీపడిపోతుండటమూ చేదునిజం.

Published : 25 Feb 2022 00:26 IST

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్ల కొరత మూలాన గత్యంతరం లేక ఏటా ఎంతోమంది తాము కోరుకున్నదానిలో కాక వేరే కోర్సులో చేరాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఆర్థిక స్థోమత కరవై మరెందరో ఉన్నత విద్యార్జనపై ఆశలు వదిలేసుకుని రాజీపడిపోతుండటమూ చేదునిజం. కారణాలు ఏమైనా దేశంలోని ప్రతి నలుగురిలో ఒక్కరే ఉన్నత చదువులకు నోచుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పై చదువుల్లో స్థూల ప్రవేశాల నిష్పత్తిని 2035 సంవత్సరం నాటికి 50శాతానికి చేర్చాలని నూతన జాతీయ విద్యావిధానం లక్షిస్తోంది. అందుకు దోహదకారి కాగలదంటూ ఇటీవలి బడ్జెట్లో డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటును ప్రస్తావించిన కేంద్రం విద్యామంత్రిత్వశాఖను, యూజీసీని, ఏఐసీటీఈ (అఖిలభారత సాంకేతిక విద్యామండలి)ని ఉరకలెత్తిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఆన్‌లైన్‌ డిగ్రీల ప్రదానానికి 900 వరకు ప్రతిభా సంపన్నమైన స్వయం ప్రతిపత్తి ్బఅటానమస్శ్‌ కళాశాలలు సన్నద్ధమవుతున్నాయన్న యూజీసీ తాజా ప్రకటన వెనక ఇంత విస్తృత నేపథ్యముంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులు నిర్వహించి, పట్టాలిచ్చే అవకాశం విశ్వవిద్యాలయాలకే పరిమితం. ఇకమీదట పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా ఆన్‌లైన్‌ పద్ధతిలో పట్టభద్రత, స్నాతకోత్తర పట్టభద్రత పీజీ సాధించగల అవకాశం ఉంటుందనడం అసంఖ్యాక విద్యార్థులకు గొప్ప శుభసమాచారం. పైగా, సీట్లకు సంఖ్యాపరిమితి అన్నది ఉండదు. నిర్దేశిత స్థాయీప్రమాణాలు కలిగిన కళాశాలలు ముందస్తు అనుమతులు తీసుకోనక్కరలేదని, ఆన్‌లైన్‌ చదువులకు కనీసం 75 శాతం హాజరు అవసరమూ లేదని యూజీసీ చెబుతోంది. ప్రతిపాదిత మార్పుల పర్యవసానంగా నాణ్యతా ప్రమాణాలు బీటలు వారకుండా ఎలా నియంత్రిస్తారన్నది అమిత ఉత్కంఠ రేపుతున్న అంశం!

అంతర్జాల కోర్సులు నేర్చుకుంటున్నవారి సంఖ్య అమెరికా తరవాత ఇండియాలోనే అధికమని ్ఞకోర్సెరా 2020్ఠ నివేదికాంశాలు స్పష్టీకరించాయి. మెక్సికో, బ్రెజిల్‌తోపాటు చైనా సైతం మనకన్నా వెనకబడి ఉండటం దేశీయంగా వేళ్లూనుకుంటున్న ఆన్‌లైన్‌ సంస్కృతిని కళ్లకు కడుతోంది. సుమారు 140కోట్ల జనాభాకు నెలవైన దేశంలో డిజిటల్‌ అగాధాన్ని ప్రస్ఫుటీకరించే చీకటి కోణాలూ ఉన్నాయి. బోధన సిబ్బందిలో చాలామందికి డిజిటల్‌ సామర్థ్యాలు, వసతులు కరవేనని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఇటీవలి అధ్యయనం ధ్రువీకరించింది. ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ కలిగినవారిలో సగం మంది తరచూ కనెక్షన్‌ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలతోపాటు కేబుల్‌ ఇబ్బందులూ తలెత్తుతున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు తెలియజెబుతున్నాయి. నెట్‌ వేగం ప్రాతిపదికన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్‌ కన్నా భారత్‌ వెనకంజలో ఉండే దుస్థితి ఎంత త్వరగా సమసిపోతే దేశానికంత మంచిది. బోధన సిబ్బందిని నిరంతర శిక్షణతో పదును తేల్చడం మరింత ముఖ్యం. ఆన్‌లైన్‌ విద్యలో గురువులకు శాస్త్రీయ శిక్షణ అవసరాన్ని 'అసర్' (వార్షిక విద్యా నివేదిక) ఆమధ్య ప్రస్తావించినా తగిన దిద్దుబాటు చర్యలు ఇంకా ఊపందుకోలేదు. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్‌ మెలకువలు నేర్పడంపై ఎన్‌సీఈఆర్‌టీ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి), ఎస్‌సీఈఆర్‌టీలు (రాష్ట్రస్థాయి మండళ్లు); కళాశాల అధ్యాపకుల్ని మెరికల్లా తీర్చిదిద్దడంపై ఏఐసీటీఈ ప్రధానంగా దృష్టి  కేంద్రీకరించాలి. పాఠ్యాంశాల ఎంపిక, కూర్పు అత్యుత్తమంగా ఉండాలి. ప్రాంతీయత, కులమత భేదాలకు అతీతంగా చదువులో బాగా రాణిస్తున్న పేద విద్యార్థులందరినీ ప్రభుత్వమే అమ్మలా సమాదరించాలి. ప్రభుత్వమిప్పుడు నూతన జాతీయ విద్యావిధాన లక్ష్యాల సాధనలో నెగ్గడమెంత కీలకమో, పునాదినుంచి పైదాకా సమర్థ మానవ వనరుల ఆవిష్కరణకు దోహదపడటం అంతే ప్రాణావసరం. అందుకు తగ్గట్లు అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటేనే కొత్త సమస్యలు తలెత్తకుండా ఆన్‌లైన్‌ డిగ్రీల ప్రణాళిక సవ్యంగా కార్యాచరణకు నోచుకుంటుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.