పారిశ్రామిక పెనువిషాదాలు

యాజమాన్యాల బాధ్యతారాహిత్యం, అత్యవసర ప్రతిస్పందనా వ్యవస్థల వైఫల్యం, మన్ను తిన్న పాములా మారిన సర్కారీ యంత్రాంగాలే దేశీయంగా దారుణ పారిశ్రామిక ప్రమాదాలకు కారణభూతాలవుతున్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్‌ కర్మాగారంలో బుధవారం రాత్రి సంభవించిన దుర్ఘటన సైతం ఆ కోవలోనిదే

Published : 16 Apr 2022 00:11 IST

యాజమాన్యాల బాధ్యతారాహిత్యం, అత్యవసర ప్రతిస్పందనా వ్యవస్థల వైఫల్యం, మన్ను తిన్న పాములా మారిన సర్కారీ యంత్రాంగాలే దేశీయంగా దారుణ పారిశ్రామిక ప్రమాదాలకు కారణభూతాలవుతున్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్‌ కర్మాగారంలో బుధవారం రాత్రి సంభవించిన దుర్ఘటన సైతం ఆ కోవలోనిదే. హానికారక రసాయన వ్యర్థాలను వెదజల్లుతూ ఆ పరిశ్రమ తమ గ్రామాన్ని కబళిస్తోందని స్థానికులు కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు. వారి గోడును పెడచెవిన పెడుతూ వస్తున్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు- తాజా ప్రమాదంతో తీరిగ్గా మేల్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిందంటూ దాని మూసివేతకు ఆదేశాలిచ్చారు! 2020 మే నెలలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరీన్‌ ఆవిరి విశాఖపట్నం వెన్నులో వణుకు పుట్టించింది. ఆ దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం- ప్రమాదకర పదార్థాలతో పనిచేసే పరిశ్రమల్లో సమగ్ర భద్రతా తనిఖీలకు సిఫార్సు చేసింది. ప్రమాణాలకు నీళ్లొదులుతున్న 380 ఫ్యాక్టరీలకు ఆ తరవాత తాకీదులిచ్చినట్లు, 111 సంస్థలపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, కర్మాగారాల స్థితిగతులను కాలానుగుణంగా పరిశీలించడంలో వారు విఫలురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నగరంలోనే గడచిన పదేళ్లలో కనీసం 57 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించాయి. గడచిన రెండేళ్లలో కాకినాడ, నెల్లూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లోనూ అటువంటివి చోటుచేసుకున్నాయి. రసాయన పరిశ్రమల్లో భద్రతాపరంగా ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి. భోపాల్‌ నగరాన్ని శోకసంద్రంగా మార్చిన యూనియన్‌ కార్బైడ్‌ ఉదంతంతో మూడున్నర దశాబ్దాల నాడే అవి దేశానికి అనుభవంలోకి వచ్చాయి. అటువంటి పెనువిపత్తులు తిరిగి తలెత్తకుండా కట్టుదిట్టాలు చేయడంలో చేతులెత్తేస్తున్న ప్రభుత్వాలు- అభాగ్యుల జీవితాలను అగ్నికీలలు, విషవాయువులకు బలిపెడుతున్నాయి!

దేశవ్యాప్తంగా కర్మాగారాల్లో సంభవిస్తున్న ప్రమాదాల్లో రోజుకు సగటున ముగ్గురు కార్మికులు మరణిస్తుంటే, 47 మంది క్షతగాత్రులు అవుతున్నట్లుగా అధికారిక గణాంకాలు లోగడ వెలుగుచూశాయి. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో దుర్ఘటనలు అధికంగా సంభవిస్తున్నాయి. పరిశ్రమలు, పని ప్రాంతాల్లో విపత్తులు పోనుపోను పెచ్చరిల్లుతుండటంపై నిరుడు ఆందోళన వ్యక్తంచేసిన కేంద్రం- మూడు ఉన్నతస్థాయి కమిటీలను కొలువుతీర్చింది. ఆసేతుహిమాచలం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో భద్రత, పని వాతావరణాలకు సంబంధించిన నిబంధనలను అవి సమీక్షించనున్నట్లు వెల్లడించింది. భారతదేశ పాలకులు కొన్నాళ్లుగా అనుసరిస్తున్న విధానాల మూలంగానే కర్మాగారాలు మృత్యువాటికలు అవుతున్నాయని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య ఐజీయూ దుమ్మెత్తిపోస్తోంది. ‘తనిఖీలు తగ్గించారు... స్వీయ ధ్రువీకరణలకు అనుమతించారు... పలు సంస్థలకు ఇంకెన్నో మినహాయింపులు మంజూరు చేశారు’ అంటూ 140 దేశాల్లోని అయిదు కోట్ల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ సంస్థ విశ్లేషిస్తోంది. భద్రతాపరమైన నియంత్రణలను బలహీనపరచడంతోనే భారత పరిశ్రమల్లో పెనువిషాదాలు చోటుచేసుకుంటున్నట్లుగా ఐజీయూ సహాయ ప్రధాన కార్యదర్శి కెమల్‌ ఒజ్కాన్‌ ఇటీవల అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాలను సురక్షితంగా మార్చేందుకు సమీకృత కార్యాచరణ ప్రణాళికకు రూపుదిద్దాలని కేంద్రానికి సూచించారు. పారిశ్రామిక ఉపద్రవాలతో విలువైన మానవ వనరులు కడతేరిపోవడమే కాదు, ఆర్థికంగానూ దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఆసేతుహిమాచలం ఏకీకృత ప్రమాణాలు, వాటిని పక్కాగా అమలుచేసే వ్యవస్థల సాకారంతోనే ఆ దురవస్థను రూపుమాపగలం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.