అన్నదాతకు గుండెకోత

అండమాన్‌ నికోబార్‌ దీవుల్ని, పరిసర ప్రాంతాల్ని సేదతీర్చిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు తథ్యమన్న వాతావరణ శాఖ అంచనా- అసంఖ్యాక రైతాంగాన్ని హడలెత్తిస్తోంది. సాధారణంగా సకాలంలో వానలు పడతాయంటే సంబరపడే రైతన్న....

Published : 19 May 2022 00:26 IST

అండమాన్‌ నికోబార్‌ దీవుల్ని, పరిసర ప్రాంతాల్ని సేదతీర్చిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు తథ్యమన్న వాతావరణ శాఖ అంచనా- అసంఖ్యాక రైతాంగాన్ని హడలెత్తిస్తోంది. సాధారణంగా సకాలంలో వానలు పడతాయంటే సంబరపడే రైతన్న, ఇప్పుడు ముందస్తు వర్షాల మాట వింటేనే ఉలికులికిపడుతున్నాడు. మే నెల మొదటివారంలోనే అకాల వర్షాలు ఎందరో తెలుగు రైతుల్ని ఆగమాగం చేసేశాయి. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, కుమురంభీం, కామారెడ్డి, పల్నాడు, నెల్లూరు, కోనసీమ, కృష్ణా తదితర జిల్లాలోని వేలాది ఎకరాల్లో పండించిన వడ్లు నీటిపాలయ్యాయి. కల్లాల్లో రహదారులపై ఆరబెట్టిన వడ్లే కాదు- వ్యవసాయ మార్కెట్లకు తరలించి కుప్పలు పోసిన ధాన్యరాశుల్నీ సాగుదారులు నష్టపోయారు. బస్తాలకు బస్తాలు తడిసిపోయి మొలకలు రావడం, కాలువల్లోకి కొట్టుకుపోయిన వడ్లను తట్టలతో సేకరించి ఎండబెట్టాల్సిన దుస్థితి దాపురించడం- నిస్సహాయ రైతుల్ని కుంగదీస్తున్నాయి. శ్రమకోర్చి పండించిన పంటను అమ్ముడయ్యేదాకా భద్రపరచడానికి కనీస ఏర్పాట్లూ కొరవడటం అన్నదాతలకు తీరని గర్భశోకం కలిగిస్తోంది. అత్యవసరంగా కప్పడానికి టార్పాలిన్లు, బస్తాల్ని నిల్వ ఉంచడానికి తగిన వసతులతో కేంద్రాలు లేకుండా పోవడం- ఏటేటా కల్లాల్లో కన్నీటి సుడిగుండాలు సృష్టిస్తోంది. ఎకరా వరి సాగుకు రూ.40వేల దాకా పెట్టుబడులు గుమ్మరించి, ధాన్యం విక్రయించే దశలో అకాల వర్షాల మూలాన అదనంగా రూ.10వేల మేర ఖర్చును తలకెత్తుకోవాల్సి రావడంతో దిక్కుతోచక శ్రమజీవులు కుమిలిపోతున్నారు. కోత కోయాల్సినవి, కోసి పనలపై ఉన్నవి, నూర్పిడి చేసి ఆరబెట్టినవి... ఏ మేరకు విక్రయించగలమన్న ప్రశ్న సాగుదారుల్ని వేధిస్తోంది. వర్షాలు ముమ్మరించేలోగా సాధ్యమైనంత త్వరగా ధాన్య సేకరణ ఒక కొలిక్కి వస్తేనే- అవిసిపోయిన గుండెలు ఎంతో కొంత తెప్పరిల్లుతాయి.

రెండేళ్ల క్రితం భీకర కుంభవృష్టి హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌, యూపీ వంటిచోట్ల భారీ నష్టం వాటిల్లజేసింది. చేతికి అందివచ్చిన పంట ఏప్రిల్‌లో ఈదురు గాలులు, వడగండ్ల వానలకు పొలంలోనే నేలరాలి రైతాంగాన్ని దుఃఖ సముద్రంలో ముంచింది. అంతకు నాలుగైదు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన కుండపోత లక్షల ఎకరాల్లో పంటను నాశనం చేసింది. ఇలాంటి వైపరీత్యాల్ని మించి, కొనుగోలు కేంద్రాల ఆవరణలో రోడ్లపై ఆరబోసిన దశలో ధాన్యం తడిసి రంగుమారి మొలకలు వచ్చే దుర్ఘటనలు ఏటేటా పునరావృతమవుతున్నాయి. ఎందుకింతటి దారుణ దురవస్థ ఆనవాయితీగా దాపురిస్తోంది? దేశంలో పలు చోట్ల పంటల సేకరణకు సన్నాహకాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. టార్పాలిన్లు, గోనెసంచులు, తేమ కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు... అన్నింటికీ తీవ్ర కొరత వెన్నాడుతోంది. దేశీయంగా కర్షకుల్లో 80శాతానికి పైగా సన్న, చిన్నకారు రైతులే. సరైన ధర లభించేవరకు పంట దిగుబడుల్ని భద్రపరచగల వెసులుబాటు లేనందువల్లే విక్రయించడానికి వారు బారులు తీరాల్సి వస్తోంది. తరుగు, తేమశాతం పేరిట వ్యాపారుల అడ్డగోలు దోపిడికి గురికాక తప్పడంలేదు. ఆపైనా ధాన్యం సొమ్ముకోసం నెలల తరబడి నిరీక్షణ- వ్యవసాయదారుల పాలిట క్రూర పరిహాసమే. డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రం తరవాతా సేద్య ప్రధాన దేశంలో కనీస మౌలిక వసతులకింత దుర్భర క్షామం సిగ్గుచేటు! పనలు కోస్తూనే యంత్రాలపై ఆరబెట్టి గోదాములకు తరలించి అక్కడే కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేలా విధివిధానాల్ని ఇకనైనా ప్రక్షాళించాలి. దేశమంతటా పంట సేకరణ సజావుగా పూర్తయ్యేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు బాసటగా నిలవాలి. కరవు కాటకాలు, తుపానులు, వరదల దుష్ప్రభావాలకు ఏ దశలోనూ కర్షకులు బలైపోకుండా కాచుకునే జాతీయ రక్షణ ఛత్రం రూపొందిస్తేనే- రైతు జీవన భద్రతను, జాతి ఆహార భద్రతను కదలబారకుండా సంరక్షించుకోగలిగేది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.