కాలుష్యరక్కసి వికటాట్టహాసం

భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కును కాలుష్యభూతం కరకరా నమిలేస్తోంది. దేశంలో గాలి, నేల, నీరు పోనుపోను మరింత విషకలుషితమై పర్యావరణానికి నిలువెల్లా తూట్లు

Published : 20 May 2022 00:25 IST

భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కును కాలుష్యభూతం కరకరా నమిలేస్తోంది. దేశంలో గాలి, నేల, నీరు పోనుపోను మరింత విషకలుషితమై పర్యావరణానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. మూడొంతులకు పైగా నీటి వనరులు కలుషితమైన కారణంగా ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతిఆయోగ్‌ ఆమధ్య వెల్లడించింది. అటువంటివన్నీ కాకిలెక్కలేనంటూ నిగ్గుతేల్చిన లాన్సెట్‌ తాజా అధ్యయనం, సంక్షోభ విశ్వరూపాన్ని ఆవిష్కరించింది! 2019 సంవత్సరంలో అంతర్జాతీయంగా సంభవించిన ప్రతి ఆరు మరణాల్లో ఒకదానికి కాలుష్యమే కారణమన్న నివేదిక- ఆ ఏడాది అలా గాలిలో కలిసిపోయిన 90 లక్షల ప్రాణాల్లో ఇండియా వాటా రమారమి 24 లక్షలుగా ధ్రువీకరించింది. అందులో 16.7 లక్షల దాకా అకాల మరణాలు వాయుకాలుష్యం పద్దులోనివే. జలకాలుష్యం సుమారు అయిదు లక్షలమందిని, పారిశ్రామిక కాలుష్యం 1.6 లక్షల మందిని కబళించిందంటున్న గణాంక విశ్లేషణ దిగ్భ్రాంతపరుస్తోంది. పీఎం 2.5గా వ్యవహరించే సూక్ష్మధూళికణాలు 9.8 లక్షల మందిని బలి తీసుకోగా- ఘన, జీవ ఇంధనాల వినియోగంతో ఇళ్లలోనే వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుని విగత జీవులైనవారి సంఖ్య ఆరు లక్షలకు మించిపోవడం బహుముఖ సంక్షోభ తీవ్రతను చాటుతోంది. బొగ్గు ఉద్గారాలూ ప్రాణాల్ని తోడేస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతం మేర ఆర్థిక నష్టాన్ని, అంతకుమించి లక్షల సంఖ్యలో ప్రాణనష్టాన్ని వాటిల్లజేస్తున్న కాలుష్య విజృంభణకు మూలాలు ఎక్కడున్నాయి? గాలి, నేల, నీరు... వాటి నాణ్యతా పరిరక్షణకు తద్వారా ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని సంరక్షించే లక్ష్యంతోనే రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణ మండళ్లు (పీసీబీలు) కొలువు తీరాయి. వాటి పర్యవేక్షణ, ఉత్పత్తి స్థానాల్లోనే కశ్మల నియంత్రణల కోసమంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అవతరించింది. విధ్యుక్తధర్మాన్ని తుంగలో తొక్కి ఆ వ్యవస్థ అవినీతి మత్తులో జోగుతున్నందువల్లే- కాలుష్యంతో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్‌ నేడిలా పరువు మాస్తోంది!

అత్యంత కాలుష్య పూరితమైన దేశ రాజధాని దిల్లీ మహానగరమేనని ప్రపంచ వాయునాణ్యత నివేదిక ఇటీవల మళ్ళీ స్పష్టీకరించింది. విశ్వవ్యాప్తంగా పీఎం 2.5 ధూళికణాలు అధికంగా పోగుపడిన 100 నగరాల్లో 63 ఇండియాలోనే ఉన్నాయనీ ప్రకటించింది. కలుషితమైన గాలి మూలాన గత రెండు దశాబ్దాల్లో దేశీయంగా మరణాలు రెండున్నర రెట్లు అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన అధ్యయనమే చాటింది. కాలుష్యం కోరల్లో దిల్లీ విలవిల్లాడుతుండటాన్ని గర్హిస్తూ- ‘అసలు మనిషి ప్రాణం విలువ ఎంతనుకుంటున్నారు మీరు?’ అంటూ నిగ్గదీసిన కోర్టు, రాజధానికన్నా నరకమే నయమని సూటిగా ఆక్షేపించింది. ఒక్క దిల్లీ అనేముంది- కాలుష్య నియంత్రణ మండళ్ల అసమర్థ నిర్వాకాలకు అద్దం పడుతూ దేశంలోని మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలపై దుర్భర విషధూమం దట్టంగా ఆవరిస్తోంది. గర్భస్త శిశువుల్నీ కాలుష్యం వదిలిపెట్టడం లేదు. వయోభేదాలకు అతీతంగా ప్రజానీకం ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు అది పొగపెడుతోంది. వాహన పారిశ్రామిక కాలుష్యాన్ని చురుగ్గా కట్టడి చేయని పక్షంలో భారత ఉపఖండంలో కోట్లమందిని ఆహార సంక్షోభం క్రూరంగా వెన్నాడుతుందన్న హెచ్చరికలు ప్రభుత్వాలకు ఇకనైనా కనువిప్పు కావాలి. దేశం నలుమూలలా ప్రతిరోజూ టన్నుల కొద్దీ పరిమాణంలో పారిశ్రామిక వ్యర్థాలు, లక్షలాది లీటర్ల మురుగునీరు నదుల్ని జలవనరుల్ని ముంచెత్తుతున్నాయి. భూగర్భ, ఉపరితల జలాలు విషతుల్యమై, మానవ వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి. ఒక్క ముక్కలో- వర్తమానాన్ని, భవిష్యత్తును సైతం కాలుష్యం కుళ్లబొడుస్తోంది. భారత్‌లో కాలుష్య నియంత్రణకంటూ సమర్థ కేంద్రీకృత వ్యవస్థ కొరవడిందని లాన్సెట్‌ తాజా అధ్యయనం తప్పుపట్టింది. దేశంలో కాలుష్య నియంత్రణ వ్యవస్థ పనితీరు పరమ లోపభూయిష్ఠంగా అఘోరించిందని ‘కాగ్‌’ లోగడే హెచ్చరించింది. ప్రకృతి సహజ వనరుల్ని కలుషితం చేయడాన్ని హత్యానేరంకన్నా తీవ్రంగా పరిగణించి, నిబంధనల ఉల్లంఘనకు అక్కడి నియంత్రణ మండలినే జవాబుదారీ చేస్తూ కంతలన్నీ పూడ్చి, నట్లు బిగించాలి. జనజీవనం కుదురుకొని, దేశార్థికం తెప్పరిల్లేదప్పుడే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.