క్రీడాజగత్తులో మనమెక్కడ?

వెక్కిరింపులు, హుంకరింపులు, అవమానాల కొలిమిలోంచి రాటుతేలిన తెలంగాణ చిచ్చరపిడుగు నిఖత్‌ జరీన్‌- నేడు ప్రపంచ ఛాంపియన్‌! బాక్సింగ్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా, యావద్భారతంలో అయిదో నారీమణిగా ఇప్పుడామె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

Published : 21 May 2022 00:43 IST

వెక్కిరింపులు, హుంకరింపులు, అవమానాల కొలిమిలోంచి రాటుతేలిన తెలంగాణ చిచ్చరపిడుగు నిఖత్‌ జరీన్‌- నేడు ప్రపంచ ఛాంపియన్‌! బాక్సింగ్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా, యావద్భారతంలో అయిదో నారీమణిగా ఇప్పుడామె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తన పవర్‌ పంచ్‌లతో సామాజిక దుర్విచక్షణల గోడలు బద్దలు కొడుతూ నిఖత్‌ నమోదు చేసిన చరిత్రాత్మక విజయం- ఆసేతుహిమాచలం ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకం. సరైన సమయంలో మెరుగైన శిక్షణ లభిస్తే- అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించగలిగిన సహజ ప్రతిభావంతులకు భారతావనిలో కొదవ లేదు. ఆ దిశగా సంవత్సరాలుగా పాలకుల ప్రకటనలు వెల్లువెత్తుతున్నా, దురదృష్టవశాత్తు అటువంటి క్రీడా వాతావరణమేదీ దేశంలో పూర్తిస్థాయిలో పాదుకోవడం లేదు. జాతీయస్థాయి పాఠశాలల బాక్సింగ్‌ పోటీల్లో ఆరేళ్ల క్రితం రజత పతకం సాధించిన చండీగఢ్‌ అమ్మాయి రీతూ- పేదరికంతో చదువుకే కాదు, ఆటకూ దూరమై రోజుకూలికి పనిచేస్తున్నట్లుగా ఇటీవలే వెలుగుచూసింది. పలు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో రాణించిన ఎందరో ఆటగాళ్లు వ్యవస్థాపరమైన తోడ్పాటుకు నోచుకోక; ఇటుకల బట్టీ కార్మికులు, పానీపూరీ విక్రేతలు, ప్రైవేటు ఉపాధ్యాయులుగా మిగిలిపోతున్న దయనీయావస్థ దేశీయంగా నెలకొంది. లెక్కకు కేంద్ర ప్రభుత్వ క్రీడా కేటాయింపుల్లో కొన్నేళ్లుగా పెరుగుదల కనిపిస్తోంది. కానీ, సంవత్సరాల వారీగా మొత్తం సర్కారీ వ్యయాలతో సరిపోలిస్తే వాటి వాటా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటోంది. 2011-12 కేంద్ర బడ్జెట్‌లో యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు దక్కిన నిధులు 0.07శాతమైతే... 2021-22 బడ్జెట్‌ అంచనాల్లోనూ దానికి దాదాపుగా అంతే మొత్తం దఖలు పడింది. ఆటలు రాష్ట్రాల పరిధిలోని అంశం అయినందువల్ల వాటి అభివృద్ధికి అవే తగిన చర్యలు తీసుకోవాలని, తమవంతుగా వాటికి సహకరిస్తామని కేంద్రం చెబుతోంది. ఏతావతా నిధుల కొరత, మౌలిక సదుపాయాలూ శిక్షకుల లేమితో క్షేత్రస్థాయిలో వర్ధమాన క్రీడాకారుల కలలు కరిగిపోతున్నాయి!  

ఆట అంటే కేవలం పతకాల వేట కాదు... మానసిక వికాసం, శారీరక దృఢత్వాల సాధనలో అది రాచబాట. భావితరం ప్రగతి, సామాజిక సమ్మిళితత్వం, ఉపాధి అవకాశాల కోసం ఆటలను ఇతోధికంగా ప్రోత్సహించాలని జాతీయ క్రీడాభివృద్ధి స్మృతి-2011 స్పష్టీకరిస్తోంది. మైదానాలు సైతం కరవైన ఎన్నో పాఠశాలల్లో కొల్లబోతున్న పిల్లల క్రీడాహక్కుతో దాని స్ఫూర్తే మట్టిగొట్టుకుపోతోంది. పాఠ్యప్రణాళికల్లో వ్యాయామ విద్యకు సముచిత ప్రాధాన్యం లభించాల్సిన ఆవశ్యకతను లోగడ పలు సంఘాలూ చాటిచెప్పాయి. ఏమిటి ఉపయోగం? ‘అసర్‌’ గత నివేదికల ప్రకారం, దేశీయంగా ప్రతి పది ప్రాథమిక బడుల్లో కనీసం రెండింటిలోనూ ప్రత్యేక వ్యాయామ ఉపాధ్యాయులు లేరు! రెండున్నర దశాబ్దాల క్రితమే జాతీయ క్రీడా చట్టాన్ని అమలులోకి తెచ్చిన చైనా- చిన్నతనం నుంచే వ్యాయామ విద్యాబోధనను తప్పనిసరి చేసింది. జర్మనీ, పోర్చుగల్‌ తదితర దేశాలూ చదువుల్లో ఆటలను అంతర్భాగం చేసి, నవతరాన్ని సానపడుతున్నాయి. వ్యవస్థీకృతమైన ఆ కృషికి ముఖంవాచిన ఇండియా విశ్వక్రీడా సమరాల్లో వెలాతెలాపోతోంది. ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా గతంలో ఉద్ఘాటించినట్లు, భారతీయ క్రీడారంగం మరో మెట్టుకు చేరాలంటే- సాకల్య క్షాళనే శరణ్యం. పంచాయతీల స్థాయి నుంచీ వసతులను మెరుగుపరచడం, పాఠశాల దశలోనే నైపుణ్యవంతులను గుర్తించడం, మెరికలుగా వారిని తీర్చిదిద్దడం, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమించడం- క్రీడాజగత్తులో భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు సరైన మార్గం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.