Published : 22 May 2022 00:29 IST

చదువే మేలిమి ఆభరణం

‘చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!’ అని ప్రహ్లాదుడు చెబుతుంటే- హిరణ్యకశిపుడు పొంగిపోయాడు. ‘చదవనివాడు అజ్ఞుండగు, చదివిన సదసత్‌ వివేక చతురత గల్గున్‌’ అని లోకం విశ్వసించిన కాలమది. చదువుల కారణంగా మనిషి అంతఃకరణలో వచ్చే అద్భుత పరిణామాలను మన పెద్దలు గుర్తించారు. ‘విద్య యొసగును వినయంబు... వినయంబు వలన పాత్రత’ అలవడతాయని గమనించారు. ‘విద్య నిగూఢమగు విత్తము’ అని నిశ్చయించారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అన్నారు. చదువులకు అవకాశం దొరకని సందర్భాల్లో ‘ఎయ్యది హృద్యము? అపూర్వం బెయ్యది ఎద్దాని వినిన ఎరుక సమగ్రంబై యుండు...’ ఆ చదువులను తమకు అనుగ్రహించమని పెద్దలను కోరి, వినికిడి చేతనూ ఆ రోజుల్లో చక్కని విద్యావంతులయ్యేవారు. ‘విద్యకన్నా విశేష అలంకారాలు మనిషికి ఏముంటాయి?’ అని ప్రశ్నించాడు ఎలకూచి బాలసరస్వతి. ‘కమనీయంబగు విద్యభంగి తనుశృంగారంబు కల్పింపలేవు- అమలేందు ద్యుతులైన హారములు’ అని తేల్చి చెప్పాడు. చదువులు నేర్వని నోరు నోరే కాదంటూ బద్దెనకవి ‘ఇమ్ముగ చదవని నోరు... కుమ్మరి మను(మట్టి) త్రవ్వినట్టి గుంటర సుమతీ’ అని ఘాటుగా విమర్శించాడు. చదువుల మూలంగా లోచూపు బలపడటం అన్నింటికన్నా ముఖ్యమైన ప్రయోజనం. మనిషి తరించే మార్గం అది. చదువులు బాగా ఒంటపట్టేకొద్దీ- తనదేపాటి చదువో తనకే తెలిసివచ్చి గర్వం నశించడం, వినయశీలి కావడం- మనిషి జీవితంలో గొప్ప పరిణామం. ‘తెలివి ఒకింత లేనియెడ దృప్తుడనై(గర్విష్టినై) కరిభంగి గర్విత మతిన్‌ విహరించితి తొల్లి’ అనే భర్తృహరి పశ్చాత్తాపం- వాస్తవానికి సహృదయ విద్యావంతుల పరితాపం. అయితే, స్త్రీవిద్య విషయంలో మాత్రం మనవారి ఔదార్యం సన్నగిల్లింది.

‘ఉద్యోగాలు చేయాలా... ఊళ్లేలాలా...’ అంటూ ఛాందస భారతం ఒకప్పుడు ఆడపిల్లలను అక్షరాస్యతకు దూరం చేసింది. దరిమిలా ‘పద్దులు రాసుకొనేపాటి చదువుంటే చాలు’ అనేసి పైచదువులను నిర్లక్ష్యం చేసింది. తెలుగునేలపై వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు, జాషువా వంటి అభ్యుదయ కాముకులైన కవులు- దాన్ని గట్టిగా నిరసించారు. ‘భారతదేశ సంస్కృతికి భంగము వాటిలునంచు విద్యకున్‌ దూరము చేసి మీ బ్రతుకు దోపిడి చేసిరి’ అని విలపించారు జాషువా. ‘బయట ప్రపంచానికి గవాక్షాలు మూసుకుపోయి, విజ్ఞానం వెలుతురు సోకక బందిఖానాలో మగ్గిపోయేది మేమే’ అంటూ మందరపు హైమవతి ఆనాటి దుస్థితిని తన కవితలో కళ్లకు కట్టారు. ‘చుట్టూ ఆవరించిన చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే చిరుదివ్వెను వెలిగించడం ఎంతో మంచిది’ అన్న కాళోజీ సద్భావనను మహిళాలోకం క్రమంగా అందిపుచ్చుకొంది. జయప్రభ వంటి కవయిత్రులైతే ‘నీ కొంగు తప్ప వేరే ప్రపంచాన్ని అమ్మా! నాకు ఎందుకు చూపించలేదు?’ అని ముందుతరాన్ని నిలదీశారు. ‘నీలా కాకుండా, నాలా కాకుండా నా కూతురు- దాని కూతురికి ప్రపంచాన్ని పిడికిట పట్టుకోగలనన్న నమ్మకాన్ని పుట్టుకతో కలిగించాలి’ అని స్త్రీలోకం గట్టి పట్టు పట్టింది. చదువులకై ఆరాటపడింది. ఫలితంగా అక్షరాస్యత శాతం వేగంగా, అద్భుతంగా పెరిగింది. గత ఇరవై ఏళ్లలో ప్రాథమిక విద్యతోనే చదువును ముగించేవారి శాతం- 70 నుంచి నాలుగు శాతానికి పడిపోయిందని తాజా గణాంకాలు వివరిస్తున్నాయి. ఇది స్వాగతించవలసిన, గర్వించదగ్గ పరిణామం. ‘సహజ విమూఢతన్‌ గెలువజాలిన విద్యయె ముఖ్యమూలమై... ఇహపర సౌఖ్య హేతువు...’ కావడం- సమాజ సమష్టి పరివర్తనకు చక్కని సూచిక, అభ్యుదయ వీచిక, విజయగీతిక.

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని