Published : 25 May 2022 00:45 IST

క్వాడ్‌ సంకల్ప దీక్ష

‘కడలి నురగలా చెల్లాచెదురవుతుంది’- ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌ల చతుర్భుజ కూటమి(క్వాడ్‌)కి లోగడ చైనా పెట్టిన పిల్లి శాపమిది!  కృత్రిమ దీవులు నిర్మిస్తూ, సైనిక స్థావరాలు నెలకొల్పుతూ, నావికా దళాన్ని దుర్భేద్యపరచుకుంటూ ఇండో-పసిఫిక్‌లో అంతకంతకూ తన పడగ నీడను డ్రాగన్‌ విస్తరిస్తోంది. దాన్ని అడ్డుకోవడంలో ఐకమత్యమే ‘క్వాడ్‌’కు మహాబలం. పద్నాలుగు నెలల వ్యవధిలో తాజాగా నాలుగో సారి టోక్యోలో సమావేశమైన కూటమి నేతలు అదే కీలకాంశాన్ని పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్య సంరక్షణ, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో సమష్టి కృషిని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ వివాదాల్లో బలప్రయోగాన్ని నిరసించారు. ప్రాంతీయంగా ఉద్రిక్తతలను రాజేసే కుటిల యత్నాలను గట్టిగా ప్రతిఘటిస్తామన్న వారి ఉమ్మడి ప్రకటన- పరోక్షంగా బీజింగ్‌నే హెచ్చరించింది. పసిఫిక్‌ రాజ్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే దూరాలోచనలో భాగంగా ఆస్ట్రేలియాకు సమీపంలోని సాలమన్‌ దీవులతో ఇటీవలే చైనా రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండో పసిఫిక్‌ దేశాల్లో మౌలిక వసతులు, పెట్టుబడులు, రుణ సమస్యల పరిష్కారానికి చేయూతపై ‘క్వాడ్‌’ హామీ ఇవ్వడం- డ్రాగన్‌ దూకుడుకు బ్రేకులు వేసే యత్నమే. సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలపై నిఘాకు అవకాశం కల్పించే నూతన భాగస్వామ్య వ్యూహమూ కొత్తగా తెరపైకి వచ్చింది. అమెరికాలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించగలిగేలా నాలుగు దేశాల నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ‘క్వాడ్‌’ ఉపకార వేతనాలను కల్పించడం- పరిశోధన, నవకల్పనలకు ఇతోధికంగా దోహదపడుతుంది. రష్యా పట్ల ఇండియా తటస్థ విధానాన్ని అర్థంచేసుకోవడం, అసంతృప్తులను అధిగమిస్తూ సమష్టి ప్రయోజనాల సాధనకు కూటమి కట్టుబాటు చాటడం స్వాగతించదగింది. ప్రధాని మోదీ ఉద్ఘాటించినట్లుగా- పరస్పర విశ్వాసం, దేశాధినేతల సంకల్పాలే చోదకశక్తులుగా అంతర్జాతీయ యవనికపై ‘క్వాడ్‌’ నేడు కీలకపాత్ర పోషిస్తోంది!  

అమెరికా నేతృత్వంలోని ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం(ఐపీఈఎఫ్‌)లో భారత్‌ భాగస్వామి కావడం మోదీ జపాన్‌ పర్యటనలో విశేష పరిణామం. వాణిజ్యం, సుస్థిర సరఫరా గొలుసులు, స్వచ్ఛ ఇంధనం, అవినీతి నిరోధం అనే పునాదులపై అది ప్రాణంపోసుకుంది. ప్రపంచ జనాభా, జీడీపీల్లో అరవై శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రాబల్యాన్ని అడ్డుకోవడమే ఐపీఈఎఫ్‌ అసలు లక్ష్యమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. సుంకాల తగ్గింపు ద్వారా భాగస్వాములను ప్రోత్సహించడం, అమెరికా విపణిలోకి వారి ప్రవేశం కల్పించడంలో లోపాల దృష్ట్యా అది ఎంతవరకు సఫలమవుతుందన్నదానిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 21వ శతాబ్దపు సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొంటూ పరస్పర ప్రయోజనకారిగా ఐపీఈఎఫ్‌ రూపుదిద్దుకోవాలి. ప్రధాని మోదీ అభిలషించినట్లు, ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో పసిఫిక్‌ను ప్రధాన కేంద్రంగా మలచేందుకు అది అక్కరకు రావాలి. మోదీ టోక్యో యాత్రలో భాగంగానే- అమెరికాతో ఇండియాకు సరికొత్త పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం ముడివడింది. దానితో దేశీయ ఆరోగ్య సేవలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సూక్ష్మ పరిశ్రమలకు నాలుగు వందల కోట్ల డాలర్ల వరకు పెట్టుబడి సాయం లభిస్తుందంటున్నారు. ఆకర్షణీయ నగరాలు, 5జీ ప్రాజెక్టుల్లో భారత్‌కు సహకరించేందుకు జపాన్‌ పారిశ్రామిక వర్గాలు ముందుకు రావడమూ హర్షణీయం. మరోవైపు, భారత ఇరుగు పొరుగు దేశాల్లో భారీగా నిధులు గుమ్మరిస్తున్న చైనా- ముత్యాలసరంలా ఇండియాను కమ్ముకొస్తోంది. దాని వలలో చిక్కిన ఆయా దేశాలను ‘క్వాడ్‌’ దన్నుతో జాగ్రత్తగా తన వైపు తిప్పుకోవడంపై దిల్లీ నిశితంగా దృష్టి సారించాలి. సరిహద్దుల్లో నిత్యం పేచీలకు దిగుతున్న డ్రాగన్‌ పన్నాగాలను తిప్పికొట్టేలా అత్యంత అప్రమత్తతతో మెలగాలి!

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts