ముంచెత్తుతున్న ఈ-వ్యర్థాలు

శాస్త్ర సాంకేతిక రంగాలు ఊహకందని వేగంతో విస్తరిస్తున్నాయి. తత్ఫలితంగా ఆవిష్కృతమవుతున్న ఆధునిక ఉపకరణాలు మానవ జీవనాన్ని మరింతగా సౌకర్యవంతం చేస్తున్నాయి. అదే సమయంలో

Published : 26 May 2022 00:07 IST

శాస్త్ర సాంకేతిక రంగాలు ఊహకందని వేగంతో విస్తరిస్తున్నాయి. తత్ఫలితంగా ఆవిష్కృతమవుతున్న ఆధునిక ఉపకరణాలు మానవ జీవనాన్ని మరింతగా సౌకర్యవంతం చేస్తున్నాయి. అదే సమయంలో గుట్టలుగుట్టలుగా జమవుతున్న ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలపై దేశీయంగా ఎవరూ తగిన శ్రద్ధ పెట్టడం లేదు. మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీయడమే కాదు; పుట్టబోయే పిల్లలపైనా దుష్ప్రభావం చూపే వాటిని పద్ధతిగా వదిలించుకోవడంలో కనబరుస్తున్న నిర్లక్ష్యం భారతావనికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో చైనా, అమెరికాల తరవాతి స్థానం ఇండియాదేనని ఐరాస నివేదిక లోగడే స్పష్టీకరించింది. భారతదేశంలో 2019లో 32 లక్షల టన్నుల మేరకు అవి మేటవేసినట్లు తేటతెల్లం చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ గణాంకాలతో  విభేదిస్తోంది. 2019-20లో దేశవ్యాప్తంగా 10.14 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలే ఉత్పత్తి అయినట్లు గత నెలలో లోక్‌సభకు అది నివేదించింది. సర్కారీ లెక్కల ప్రకారం, 2017-20 మధ్య స్థానికంగా సుమారు పాతిక లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు పోగుపడితే; అందులో సేకరణ, పునశ్శుద్ధికి నోచుకున్నవి కేవలం 4.58 లక్షల టన్నులు! బహిరంగ ప్రదేశాల్లో భారీగా పేరుకుపోతున్న ఆ చెత్తతో భూగర్భ జలాలు విషపూరితమవుతున్నాయి. సమీప ప్రాంతాల్లోని పంట పొలాలూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పాతపడిన పాడైన లాప్‌టాప్‌లు, చరవాణులు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిని సేకరించి, పునర్వినియోగంలోకి తెచ్చేలా ఎలక్ట్రానిక్‌ వస్తూత్పాదకులకు కేంద్రం కొన్నాళ్లుగా లక్ష్యాలు నిర్దేశిస్తోంది. వచ్చే మూడేళ్లలో వారు చేరుకోవాల్సిన గమ్యాలను వెల్లడిస్తూ తాజాగా ముసాయిదా ప్రకటనను వెలువరించింది. ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కాగితాలపై ఘనంగానే ఉన్నా- వాటి అమలులో ఉన్నతస్థాయి పర్యవేక్షణ కొరవడుతోందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నిరుడు ఆక్షేపించింది. అటువంటి లోపాలను పరిహరించడంలో పాలకుల అశ్రద్ధే ఆసేతుహిమాచలం ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తోంది!

నవీన జీవనశైలి మూలంగా ఉత్పన్నమవుతున్న ఈ-వ్యర్థాల నిర్వహణకు సమర్థ విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం ఉద్ఘాటించారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ వర్గాలు ఆ మేరకు సృజనాత్మక పరిష్కారాలను సూచించాలని రెండు నెలల క్రితమూ ఆయన పిలుపిచ్చారు. దురదృష్టవశాత్తు, దేశీయంగా బడుగు బలహీన వర్గాల కార్మికులే ఈ-వ్యర్థాల నిర్వహణలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. సీసం, పాదరసం, పాలీక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌, పాలీబ్రోమినేటెడ్‌ బైఫినైల్స్‌ వంటి అతి ప్రమాదకర పదార్థాలతో కూడిన వాటిని పునశ్శుద్ధి చేయడంలో అవగాహన లేమి- ఆ అభాగ్యుల ఆరోగ్యాలను కబళిస్తోంది. వాతావరణ కాలుష్యానికీ కారణభూతమవుతోంది. దాదాపు 14 లక్షల టన్నుల వార్షిక ఈ-వ్యర్థాల శుద్ధి సామర్థ్యం కలిగిన 468 అధీకృత రీసైక్లర్లు 22 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లుగా కేంద్రం చెబుతున్నా- వాస్తవంలో చెత్త అత్యధిక మొత్తంలో అసంఘటిత రంగానికే పోటెత్తుతోంది.  హానికారక వ్యర్థాల దిగుమతులపై ఏనాడో నిషేధం విధించినా, అక్రమ తరలింపులూ వెలుగుచూస్తున్నాయి. వాటిని అరికట్టడం అత్యావశ్యకం. కాలం చెల్లిన ఉపకరణాలను పునర్వినియోగ కేంద్రాలకు పంపడంలో నార్వే, స్వీడన్‌ తదితరాలు అనుసరిస్తున్న మేలిమి పద్ధతులను అందిపుచ్చుకోవాలి. చెత్త శుద్ధి శాస్త్రీయంగా పూర్తిస్థాయిలో సాగేలా ప్రభుత్వాలు పూనిక వహించాలి. వస్తు వినియోగంలో విచ్చలవిడితనాన్ని విడనాడేలా ప్రజాచైతన్యాన్ని పెంపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లుగా పోనుపోను సునామీలా పోటెత్తుతున్న ఈ-వ్యర్థాల్లోంచి అప్పుడే దేశం బయటపడగలుగుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.