‘ప్రాథమిక’ సంక్షోభం

నాణ్యమైన బడి చదువే బంగరు భవితకు నారుమడి. ప్రాథమిక దశలో మేలిమి బోధన పటిష్ఠ విద్యాసౌధానికి గట్టి పునాది వేస్తుంది. వ్యక్తి వికాసానికి బాటలు పరచి, భావి జీవిత గమనానికి స్ఫూర్తి రగిలించే బడి చదువులకు సంబంధించి దేశీయంగా నాణ్యతా ప్రమాణాల పతనం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది.

Published : 28 May 2022 00:42 IST

నాణ్యమైన బడి చదువే బంగరు భవితకు నారుమడి. ప్రాథమిక దశలో మేలిమి బోధన పటిష్ఠ విద్యాసౌధానికి గట్టి పునాది వేస్తుంది. వ్యక్తి వికాసానికి బాటలు పరచి, భావి జీవిత గమనానికి స్ఫూర్తి రగిలించే బడి చదువులకు సంబంధించి దేశీయంగా నాణ్యతా ప్రమాణాల పతనం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది. 720 జిల్లాల్లోని 1.18 లక్షల పాఠశాలల్లో సుమారు 34 లక్షల మంది విద్యార్థుల నుంచి 2021 నవంబరులో సమాచారం సేకరించి జాతీయ సాధన సర్వే(న్యాస్‌) క్రోడీకరించిన వివరాలు- ప్రస్తుత దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. మూడో తరగతి విద్యార్థులు చిన్నచిన్న పదాలు, గేయాలు సైతం చెప్పలేకపోతున్నారు. త్రిభుజం, చతురస్రం వైశాల్యాలను గణించడంలో, సంఖ్యలు గుర్తించి చదవడంలోనూ అయిదో తరగతి పిల్లలు విఫలమవుతున్నారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటుపై ప్రశ్నలకు ఎనిమిదో తరగతి విద్యార్థులు బదులివ్వలేకపోయారు. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి వారూ మాతృభాషలో ఆంగ్లంలో పదాలు వాక్యాలను చదవలేకపోతున్నారు. వివిధ రాష్ట్రాల్లో 3, 5 తరగతి పిల్లలతో పోలిస్తే 8, 10 విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పతనం విస్తుగొలుపుతోంది. వేర్వేరు తరగతుల వారు భాషల్లో కన్నా గణితం, సైన్స్‌ వంటి సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారు. సర్వే నిర్వహించిన వాటిలో నాలుగో వంతు పాఠశాలల విద్యార్థులకు ఇంట్లో సరైన తోడ్పాటు కొరవడిందంటున్న అధ్యయనం- ఆన్‌లైన్‌ విద్యాబోధనకు ఎదురవుతున్న ప్రతిబంధకాల్నీ వెల్లడించింది. జాతీయ స్థాయిలో 24 శాతం, అస్సామ్‌ మణిపూర్‌ లాంటిచోట్ల 48 శాతం విద్యార్థులకు ఇంటివద్ద డిజిటల్‌ ఉపకరణాల కొరత- పెద్ద సమస్య. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేనిదే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే వీల్లేకపోవడం- కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో విద్యాప్రమాణాలు తెగ్గోసుకుపోవడానికి కారణమైంది. జాతీయ సాధన సర్వేను 2017లోనూ చేపట్టారు. అప్పటితో పోలిస్తే పంజాబ్‌, రాజస్థాన్‌ మినహా తక్కినచోట్ల అభ్యసన సామర్థ్యాలు, స్థాయీప్రమాణాల్లో నేడు క్షీణత ప్రస్ఫుటం కావడం- నిస్సంశయంగా పెనుప్రమాద సంకేతం.

తరగతి గదుల చదువులు అటకెక్కడం పిల్లల మనోవికాసాన్ని దెబ్బ తీసిందంటూ పార్లమెంటరీ స్థాయీసంఘం నిరుడు వెలిబుచ్చిన ఆవేదన అక్షరసత్యం. 17 రాష్ట్రాల్లో 3, 5, 8 తరగతి విద్యార్థుల సామర్థ్యాలను మదింపు వేసిన ‘నిసా’ (నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అలయన్స్‌) ఇటీవలి అధ్యయనాంశాలూ- కొవిడ్‌ కారణంగా అభ్యసన నష్టాలు సంభవించినట్లు ధ్రువీకరించాయి. ఇప్పుడు జాతీయ సాధన సర్వే సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దృష్ట్యా, దీటైన దిద్దుబాటు చర్యలు చురుకందుకోవడం తక్షణావసరం. బోధన సిబ్బందికి శాస్త్రీయ పద్ధతిలో డిజిటల్‌ శిక్షణ ఆవశ్యకతను ‘అసర్‌’ (వార్షిక విద్యాస్థాయి నివేదిక) గతంలోనే తెలియజెప్పింది. జాతీయస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్‌ వేగం పెంపుదల, గ్రామాలన్నింటా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణతోపాటు విద్యార్థుల ఇళ్లవద్ద డిజిటల్‌ ఉపకరణాల కోసం విధివిధానాల రూపకల్పన... వడివడిగా పట్టాలకు ఎక్కాలి. ఆన్‌లైన్‌ అనేముంది- దేశంలో ప్రత్యక్ష బోధనా గాడితప్పింది. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన దశాబ్దం తరవాతా ప్రామాణిక అర్హతలు, శిక్షణ కొరవడ్డ బోధన సిబ్బంది ఆరు లక్షల దాకా పోగుపడటం ఏమిటి? దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకొంటుందన్న స్పృహ, వివేచన కలిగిన దేశాలెన్నో ఎప్పటికప్పుడు బోధన సిబ్బంది నైపుణ్యాలకు పదునుపెట్టడంలో పోటీపడుతున్నాయి. దక్షిణ కొరియా, ఫిన్లాండ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ ప్రభృత దేశాలు అపార ప్రజ్ఞావంతుల్ని బోధనరంగంలోకి ఆహ్వానించి బాలల్లో సృజన వికాసం పురివిప్పడానికి దోహదపడుతున్నాయి. అత్యుత్తమ స్థాయి ప్రాథమిక చదువులు అందించడంలో స్విట్జర్లాండ్‌, బెల్జియం, ఎస్తోనియా తదితరాల ప్రణాళికాబద్ధ కృషి- సమర్థ మానవ వనరుల ఆవిష్కరణకు ఒరవడి దిద్దుతోంది. అటువంటి నిబద్ధత, విస్తృత కార్యాచరణ ప్రణాళిక ఎండమావుల్ని తలపించడంవల్లే... ఇక్కడి చదువులకు చెదలు పడుతున్నాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.