ప్రకృతితోనా పరాచకాలు?

‘రుతువుల్లో నేను వసంతాన్ని’ అన్నాడు గీతాచార్యుడు. వసంతరుతువుకు ‘మధుమాసం’ అని పేరు (మాధవుడంటే మన్మథుడు... వసంతం మన్మథ భావోద్దీపకం). మనిషికి మధుమాసం బహూకరించే మధురఫలం మామిడిపండు. ప్రకృతి ప్రసాదించే సమస్త పండ్లజాతుల్లో

Published : 29 May 2022 00:59 IST

‘రుతువుల్లో నేను వసంతాన్ని’ అన్నాడు గీతాచార్యుడు. వసంతరుతువుకు ‘మధుమాసం’ అని పేరు (మాధవుడంటే మన్మథుడు... వసంతం మన్మథ భావోద్దీపకం). మనిషికి మధుమాసం బహూకరించే మధురఫలం మామిడిపండు. ప్రకృతి ప్రసాదించే సమస్త పండ్లజాతుల్లో మామిడిపండు రారాజు. దానికి ‘ఫలరాజం’ అని పేరు. వేసవి తాపానికి తల్లడిల్లే మనిషికి వసంతం- మామిడిపళ్లను, మల్లెపూలను చేతికందించి ఓదారుస్తుంది. ఫలం అనే మాటకు కాయ, పండు అనే రెండర్థాలూ ఉన్నాయి. కాయగాను, పండుగాను... రెండింటా మామిడిది రాజస మాధుర్యమే. ‘పచ్చిదైన గాని పక్వమొందిన గాని చూత ఫలము చూడ జాతి ఘనము’ అని లోకోక్తి. ‘మాకంద(మామిడి) నవఫల ఆమంద తుందిల రసాత్తానంద భావుడౌ అమృత భోగి’ అని తెలుగువాణ్ని అభినందించారు విశ్వనాథ. పచ్చిగా ఉన్నప్పుడు వెర్రి పులుపుతో సర్రున నోటిని చెమరింపజేసే మామిడికాయ- పక్వానికి వచ్చేసరికి పంచదారను తలపింపజేస్తూ నోరూరించడం ప్రకృతి వరం. దానికో కారణం ఊహించారు కవి కాటూరి. ఎలానూ వేసవిలో కాస్తుంది కాబట్టి మామిడి ‘చండ భానుని కరసహస్రము నుండి అమృతమ్ము గ్రహించి...’ తనలో తీపిదనాన్ని పెంచుకుంటుందని ఆయన చమత్కరించారు. వసుచరిత్రలో సుప్రసిద్ధ పద్యం ‘లలనా జనాపాంగ...’ తీయని మామిడి ఫల రసాస్వాదనకై తోటి నేస్తాలను పిలుస్తూ సందడి చేసే చిలుకలను అద్భుతంగా చిత్రిస్తే- భాగవతంలోని ‘లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు’ వంటివి లేతమామిడి చిగుళ్లను మేసి పరవశించే కోయిలలను వర్ణించాయి. పక్షులు సైతం మెచ్చిన ఫలమిది.

‘ఈ సృష్టి మనిషి ఒక్కడి సొత్తు కాదు, ఇది ఈశ్వర కల్పిత మహజగత్తు’ అన్నారు విద్యారణ్య మహర్షి. ఆ వాస్తవాన్ని మనిషి విస్మరించాడు. ప్రకృతిపై పెత్తనం చలాయించాడు. ‘చిరు నివాసమునకై చెట్టు చేమల చంపు... ఐశ్వర్యమును కోరి అడవి చంపు...’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాడు. ప్రకృతి అసమ్మతికి కారకుడయ్యాడు. సమతౌల్యాన్ని దెబ్బతీశాడు. ప్రకృతి చేతకానిది కాదు- ‘చెట్లు చేలకున్‌ చేటు ఒనరించుచో- పుడమి చేదు విషమ్ములు చిమ్మి జీవులన్‌ మాటుగ కాటు వేయు’ అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఘాటుగా హెచ్చరించినా మనిషి పెడచెవిన పెట్టాడు. ప్రకృతి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ ప్రభావం ఈసారి మామిడి కాపుపై ప్రసరించిందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. బాల రసాల సాలమని పోతన మురిసిపోయిన మామిడి పడతి ఈ ఏడాది వంధ్యత్వానికి గురవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న భూతాపం, మారుతున్న రుతువుల క్రమం- మామిడిపూత ఫలదీకరణ స్వభావాన్ని ప్రభావితం చేసిందన్నది వారి ఆందోళనకు కారణం. సహకార ఫలమంటే మామిడిపండు. దానికి ఈ తడవ ప్రకృతి సహకారం లోపించింది. హెక్టారుకు అయిదు టన్నుల సహజ ఉత్పత్తి ఈ దఫా రెండున్నర టన్నులకు పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించాలంటే- లోకం కూడా కోకిల కోసం చెవులు రిక్కించాలి’ అని చినవీరభద్రుడు చెప్పినట్లు... ప్రకృతి మనకు అనుకూలించాలంటే, ముందు మనం దానికి సహకరించాలి. దాని ముందు తలవంచాలి. లేకుంటే మనిషికి భస్మాసురుడి కథను గుర్తుచేస్తుంది, త్వరలో- ఈ ప్రకృతి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.