విలువలకు సమాధి!

బాల్‌ఠాక్రే సిద్ధాంతాలు, విలువలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ రాజీపడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరుడు దుమ్మెత్తిపోశారు. మూడు రోజుల నాడు తిరుగుబాటు జెండా ఎగరేసిన శివసైనికులు నేరుగా భాజపా ఏలుబడిలోని గుజరాత్‌కు, అటునుంచి అస్సామ్‌కు వెళ్ళిపోయి-

Published : 25 Jun 2022 00:12 IST

బాల్‌ఠాక్రే సిద్ధాంతాలు, విలువలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ రాజీపడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరుడు దుమ్మెత్తిపోశారు. మూడు రోజుల నాడు తిరుగుబాటు జెండా ఎగరేసిన శివసైనికులు నేరుగా భాజపా ఏలుబడిలోని గుజరాత్‌కు, అటునుంచి అస్సామ్‌కు వెళ్ళిపోయి- దాదాపుగా అదే అంశంపై తమ ‘ఆందోళన’ వ్యక్తంచేశారు! శివసేన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా మంత్రి ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలో ఏకం కావడంతో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సర్కారు అంపశయ్యపైకి చేరింది. అధికారమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌, ఎన్సీపీలతో రెండున్నరేళ్ల క్రితం శివసేన విచిత్రమైన జోడీ కట్టింది. సంవత్సరాలుగా నిప్పూ నీళ్లుగా మెలిగిన పార్టీల మధ్య సయోధ్య అసాధ్యం కావడంతో- ఆది నుంచీ అది కలహాల కాపురంగానే కొనసాగుతోంది. సైద్ధాంతిక శత్రువులతో సంకీర్ణ రాజకీయాలను ఆత్మహత్యా సదృశంగా తలపోస్తున్న శివసేన శాసనసభ్యులకు కొన్నాళ్లుగా సొంత నాయకత్వ వైఖరి మింగుడు పడటం లేదు. ఉద్ధవ్‌, ఆయన కుమారుడు ఆదిత్యల ఒంటెత్తు పోకడలతో క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు కదిలిపోతున్నాయన్న భావన సైతం వారిలో నెలకొంది. మరోవైపు, ‘ఎంవీఏలోని అశాంతిని సొమ్ము చేసుకోవడమే మా వ్యూహం... ఆయా పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలకు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని అందించబోతున్నాం’ అంటూ ఇటీవల రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భాజపా మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు చకచకా పావులు కదపడంలో ఆయన విజయవంతమయ్యారు. ప్రజాప్రయోజనకర విధానాలతో నిమిత్తం లేకుండా పూర్తిగా పదవీ లాలసలోంచి పురుడు పోసుకునే కూటములు కుప్పకూలడం ఖాయమన్నది చారిత్రక సత్యం. అటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయ పరమపద సోపానంలో పైమెట్టుకు చేరడంలో భాజపా పండిపోయిందన్నదీ యథార్థం!

గువాహటీలో ఏక్‌నాథ్‌ క్యాంపు రాజకీయాలు ఒకపక్క యావద్దేశం దృష్టినీ ఆకర్షిస్తుంటే - మహారాష్ట్ర శాసనసభ్యులు తమ రాష్ట్రంలో ఉన్నారో లేదో తనకు తెలియదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అమాయకత్వం ఒలకబోయడమే విడ్డూరం! ‘మహాశక్తి వంటి ఒక జాతీయ పార్టీ అండగా ఉంటానంది’ అంటూ శిందే అసలు గుట్టు రట్టు చేసిన దరిమిలా - నేటి రాజకీయ పక్షాల్లో అంతటి బలశాలి భాజపా మినహా మరొకటి లేదన్నదీ సుస్పష్టం. ప్రత్యర్థి పక్షాల్లో చీలికలతో అధికారం దఖలు పడుతుందంటే, అది తనకు అవసరం లేదని రెండు దశాబ్దాల క్రితం వాజ్‌పేయీ తేల్చిచెప్పారు. అటువంటివి కాసుకు కొరగాని సత్తెకాలపు ప్రమాణాలుగా మిగిలిపోతున్న సమకాలీన వాతావరణంలో- మార్గమేదైనా సరే, విజయం సాధించి తీరాలన్న అవకాశవాద రాజకీయాలు వెర్రితలలు వేస్తున్నాయి. ‘మా మిత్రపక్షం జేఎంఎంను దువ్వుతూ, సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోంది’ అంటూ దశాబ్దం క్రితం ఝార్ఖండ్‌ శాసనసభ సాక్షిగా ఆనాటి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, భాజపా నేత రఘువర్‌ దాస్‌ గళమెత్తారు. కేంద్రంలో అధికారం సాధించాక బిహార్‌, కర్ణాటకల్లో కమల దళం చేసిందేమిటి? జ్యోతిరాదిత్య సింధియా తోడ్పాటుతో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ సర్కారుకు అది ఏ గతి పట్టించింది? అరుణాచల్‌, గోవా, మణిపుర్‌లలోనూ భాజపా రాజకీయాలు అదే స్థాయిలో పెనువిమర్శలను మూటగట్టుకున్నాయి. కుర్చీల కోసం నాయకుల కుమ్ములాటల్లో ప్రజాతీర్పులు సైతం అపహాస్యం పాలవుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు విలువలపై మాట్లాడుతూ, తమవంతు రాగానే వాటికి పాతరేసే దుర్రాజకీయాలతో తాత్కాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయేమో కానీ - ఆయా పార్టీల పరువుప్రతిష్ఠలకు అవే తూట్లు పొడుస్తాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.