Published : 26 Jun 2022 00:22 IST

నవ్వుతో నవయోగం

నవ్వు చక్కని అలంకారం- మొహానికి. నవ్వు బలమైన ఆయుధం- విజయానికి. అన్నింటినీ మించి నవ్వు గొప్ప అవసరం- ఆరోగ్యానికి. ‘ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి వదనాన్ని ఆకర్షణీయంగా చూపించేది- అందమైన చిరునవ్వే’ అన్నారొక ఆంగ్ల రచయిత. ‘ఆమనిరాగా దుర్గ కొలనులో కలకల నవ్వెను తామరలు’ అని గురజాడ చెప్పినట్లు- మనం వీలైన చోటల్లా సందర్భాన్ని కల్పించుకొని... హాయిగా కడుపుబ్బా నవ్వినప్పుడల్లా దేహంలో ‘ఇంటర్‌ ఫెరాన్‌ గామా’ ఉత్పత్తి పెరుగుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది. మనిషిలో రోగనిరోధక శక్తిని పెంపొందించే విలువైన రసాయనమది. వాస్తవానికి ‘లాఫింగ్‌ థెరపీ’ పేరుతో నవ్వు- ఏనాడో చికిత్స స్థాయికి చేరుకొంది. కాబట్టే ‘రోజుకు ఒక్కసారైనా బిగ్గరగా నవ్వకపోతే- అది జీవితంలో వృథా అయినరోజు’ అన్నారొక రచయిత. ఆ మాటకొస్తే, నవ్వు మనిషి ఒక్కడి సొత్తు... ‘నవ్వవు జంతువుల్‌, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్‌ దివ్వెలు’ అన్నారు కవికోకిల జాషువా. ‘మీరజాలగలడా నా యానతి’ పాటలో సత్యభామలా, కన్యాశుల్కంలో మధురవాణిలా పడతులు పడిపడి పకపక నవ్వుతుంటే ఆ శోభే వేరు. పడుచుదనానికి పట్టాభిషేకం చేస్తుందది. సత్యభామది ఆత్మవిశ్వాసంలోంచి ఆవిర్భవించిన నవ్వు. మధురవాణిది హాస్యప్రవృత్తిలోంచి ఉబికి వచ్చిన నవ్వు. రెండూ విలువైనవే. అలా ‘సహజాతంబును, సర్వమానవ మనస్సంతాప నిర్వాపకంబు’ అనిపించేట్లుగా నవ్వాలన్నా నవ్వించాలన్నా- మనిషిలో హాస్యప్రవృత్తిని మొలకెత్తించే విత్తనాలు ఉండాలి. నవ్వే గుణం, నవ్వించే గుణం రెండూ మనిషికి అలవడాలి.

పురుషుడి హాస్యప్రవృత్తి, సమయస్ఫూర్తి ఆడవాళ్లను బాగా ఆకట్టుకొంటాయి. అలిగిన ప్రియురాలు ఎప్పటికీ దిగిరాకపోయేసరికి గడుసు చెలికాడు అన్నాడట... ‘కోపము నా పయిం కలిగె కోమలి, నేనిక ఏమి సేయుదున్‌... నేనిడినట్టి ముద్దులున్‌, కోపము లేని వేళ ఒనగూర్చిన నాదు కవుంగిలింతలున్‌ నా పయి పారవేయుము’ అని. ప్రియురాలు ఫక్కున నవ్వింది! మంత్రిగారి సుపుత్రుడొకడు సహజంగానే కళాశాలలో బాగా అల్లరి చేస్తూ ఉపాధ్యాయులను తెగ ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక పాత తరం తెలుగు మాష్టారు ‘ఒరే ఇరవై అయిదూ, ఇరవై ఆరు... నోర్మూసుకు కూర్చో’ అనేవారు. అది తిట్టో ఏమిటో అర్థమయ్యేది కాదు. చివరికోరోజు, ఆ ప్రహేళికను ఆయనే విప్పారు. ‘పోయి తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి’ అంటూ. తీరా చూస్తే ఇరవై అయిదు- ఖర, ఇరవై ఆరు- నందన. అంటే ‘గాడిదకొడకా’ అని కసితీరా తిట్టి తేలికపడేవారన్నమాట! హాస్య ప్రవృత్తి చట్టసభల్లోని ఉద్రిక్తతలను సైతం చల్లారుస్తుంది. కేంద్రమంత్రులు సంప్రదాయ అంబాసడర్‌ కార్లు వదిలేసి ఖరీదైన విదేశీ వాహనాలపై మోజు చూపడం పట్ల విపక్షాలు విరుచుకుపడ్డాయి. గొంతులు పెరిగాయి. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి లేచి ‘అవును నాకూ ఇష్టం లేదు... అలాంటి పెద్దకార్లలో నావంటి పొట్టివాడు కూర్చుంటే బయటకు కనపడడు’ అన్నారు. ఒక్కసారిగా సభ గొల్లుమంది. వేడి చల్లారింది. హాస్య చతురత, చమత్కార ధోరణి పెద్దపెద్ద సంస్థల్లోనూ రాణించడానికి బాగా పనికొస్తుందని స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ ఆకర్‌ అంటున్నారు. వృత్తిలో ఆకట్టుకోవాలంటే హాస్యప్రవృత్తి అవసరమని, పని సంస్కృతిని అది బాగా మెరుగుపరుస్తుందని ఆయన పరిశోధనలో తేలింది. ‘ఈ సంసారము దుఃఖ ఆవాస ఆనందంబు’ అన్నాడు ధూర్జటి. హాస్యప్రవృత్తి దానికి విరుగుడు. అది మనిషికి ఆరోగ్యాన్ని పంచుతుంది. ఆయుర్దాయాన్ని పెంచుతుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని