సహకారానికి తూట్లు

‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే సదవగాహనను విస్తృతంగా పెంచిపోషిస్తుందనుకున్న సహకార భావనకు దేశంలో పలుచోట్ల చీడపట్టింది. సహకారంలో స్వాహాకారం పెచ్చరిల్లిన తీరు

Published : 27 Jun 2022 00:17 IST

‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే సదవగాహనను విస్తృతంగా పెంచిపోషిస్తుందనుకున్న సహకార భావనకు దేశంలో పలుచోట్ల చీడపట్టింది. సహకారంలో స్వాహాకారం పెచ్చరిల్లిన తీరు దిగ్భ్రాంతపరుస్తోంది. కంతలు పూడ్చి దేశీయ సహకారోద్యమ పటిష్ఠీకరణకు దోహదపడే లక్ష్యంతో నిరుడు కేంద్రంలో ఏర్పాటైన నూతన మంత్రిత్వ శాఖకు సారథిగా అమిత్‌ షా- దిద్దుబాటు చర్యలపై తాజాగా స్పందించారు. సహకార సంఘాలకు ఆధునికీకరణ హంగులు అద్దడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. భారత్‌లో 1534 పట్టణ సహకార బ్యాంకులు, 54 షెడ్యూల్డ్‌ అర్బన్‌ బ్యాంకులు ఏర్పాటైనా- సమతులాభివృద్ధి కొరవడిందన్నది అమాత్యుల ఫిర్యాదు. సహకారోద్యమ ప్రాధాన్యం పట్ల ఎవరికీ చులకనభావం తగదంటూ అమిత్‌ షా మూడు ఉదాహరణల్ని ప్రస్తావించారు. అమూల్‌, లిజ్జత్‌ పాపడ్‌, ఇఫ్కో (భారతీయ రైతుల ఎరువుల సహకార సంఘం)... విస్తృత జనబాహుళ్యానికి కోపరేటివ్‌ ఉద్యమ సుఫలాల అందజేతకు మేలిమి ఉదాహరణలనడం నిర్వివాదం. బ్రెజిల్‌, నార్వే, ఉరుగ్వే, కెనడా ప్రభృత దేశాల్లోనూ పొరుగున బంగ్లాదేశ్‌లోనూ సహకార ఉద్యమం సాకారం చేయగల అద్భుతాలెన్నో కళ్లకు కడుతున్నాయి. అసంఖ్యాక చిరువ్యాపారులకు సూక్ష్మ రుణాలందించి ఎన్నో జీవితాల్ని చక్కదిద్దిన మహమ్మద్‌ యూనస్‌ గ్రామీణ బ్యాంకు విజయ గాథ జగద్విఖ్యాతమైంది. అంతటి ఉద్యమ స్ఫూర్తికి ఇక్కడెందుకు తరచుగా తూట్లు పడుతున్నాయి? సర్కారీ పెత్తనం జోరెత్తి, ఎన్నికైన బోర్డుల్ని అటకెక్కించి, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నామినీలను నెత్తిన రుద్దిన పర్యవసానంగా సహకార సంస్థలు చతికిలపడుతున్నాయని ప్రధానిగా వాజ్‌పేయీ సూటిగా ఆక్షేపించారు. వివిధ కమిటీలూ పారదర్శక వ్యవహార శైలికి ఓటేశాయి. దిద్దుబాటు చర్యల పేరిట పాత పొరపాట్లు పునరావృతం కాకుండా కాచుకుంటేనే- కేంద్రమంత్రి చెబుతున్న ‘గుణాత్మక పరివర్తన’ సాక్షాత్కరించేది!

అర్బన్‌ సహకార బ్యాంకుల్ని నెలకొల్పిందే- నగరాలూ పట్టణ ప్రాంతాల్లోని చిల్లర వర్తకులు, చిరు పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా పరిశ్రమలు, స్థిరాదాయ వర్గాలు తదితరులకు ఆర్థిక సేవలు సమకూర్చడానికి. ఆ భరోసాకు, వ్యవస్థ పట్ల నమ్మకానికి నాలుగేళ్ల నాటి పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) కుంభకోణం తూట్లు పొడిచింది. అప్పట్లో ఆ బ్యాంకు ఆస్తుల్లో 70శాతానికి పైగా ఒక్క గృహ నిర్మాణ సంస్థకే దోచిపెట్టిన ఘనులు అందుకోసం సుమారు 21వేల నకిలీ ఖాతాలు సృష్టించారు. 2011-21 మధ్య గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభృత రాష్ట్రాల్లోని వివిధ పట్టణ సహకార బ్యాంకుల్లో అక్రమాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చార్మినార్‌, కృషి, వాసవి, ప్రుడెన్షియల్‌ వంటి యూసీబీలు ఎందరో ఖాతాదారుల పుట్టి ముంచాయి. పట్టణ సహకార బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లు, రుణ అడ్వాన్సులు మొత్తం బ్యాంకింగ్‌ రంగ గణాంకాలతో పోలిస్తే పరిమితమేనంటున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా- వాటి విస్తరణకు పిలుపిస్తున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకోని పక్షంలో, ఇంతలంతలయ్యే పారుబాకీల మాటేమిటి? రుణ వితరణ వేగం పెంచడానికన్నా ముందే- నిర్ణీత కాలావధిలో సహకార బ్యాంకుల ఆడిటింగ్‌ చేపట్టాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతిపాదన చురుగ్గా పట్టాలకు ఎక్కాలి. పాలక వర్గంలో ఉన్నవారి బంధుగణానికి వ్యవసాయేతర రుణాలిచ్చే వీల్లేదన్న నిబంధనను తు.చ. తప్పక అమలుపరచాలి. గ్రామీణ, పట్టణ సహకార సంఘాల మధ్య సమన్వయం సాధించడం ద్వారా రుణ వితరణ, వసూళ్లలో నష్టప్రమాదాలను సమర్థంగా నివారించగల వీలుందంటున్న నిపుణుల సూచనలకు చెవొగ్గాలి. మహేశ్‌ సహకార బ్యాంకు సర్వర్‌లో చొరబడిన సైబర్‌ చోరులు కోట్ల రూపాయలు కొట్టేసిన ఇటీవలి బాగోతం నేపథ్యంలో- భద్రతాపరమైన సంస్కరణలూ అత్యవసరం. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఆడిట్‌ రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో సహకార బ్యాంకుల నిర్వహణ బోర్డులు పరిపుష్టం కావాలన్న సిఫార్సులు ఏళ్ల తరబడి దస్త్రాల్లో మూలుగుతున్నాయి. వాటి దుమ్ము దులిపి, నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, పటిష్ఠ విధివిధానాలను అమలుపరిస్తేనే- స్వాహాకారానికి కళ్లెం వెయ్యగలిగేది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు