Updated : 28 Jun 2022 07:20 IST

కయ్యానికి కాలుదువ్వుతున్న బీజింగ్‌

భారత సరిహద్దుల వెంబడి చైనా కార్యకలాపాలు, అది అభివృద్ధి పరుస్తున్న మౌలిక వసతులపై ఇటీవల ఇండియాలో పర్యటించిన అమెరికా సైనిక ఉన్నతాధికారి ఛార్లెస్‌ ఎన్‌.ప్లిన్‌ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. వివాదాల పరిష్కారానికి ఇరుపక్షాల నడుమ చర్చలు సాగుతున్న సమయంలో పెద్దయెత్తున నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఆ వెంటనే భుజాలు తడుముకున్న డ్రాగన్‌ విదేశాంగ శాఖ- అగ్నిలో ఆజ్యం పోస్తున్నారని, తమను వేలెత్తిచూపడం హేయమని తమకు అలవాటైన పాచిపాటే పాడింది. కానీ, వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసీ)కు సమీపంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని బీజింగ్‌ భారీగా మోహరిస్తున్నట్లు తాజాగా వెలుగుచూసింది. అధిక సంఖ్యలో సైనిక మోహరింపులకు అవసరమైన సదుపాయాలతో పాటు హెలీపోర్టులు, ఎయిర్‌బేసులు వంటివాటిని అది విస్తరిస్తోంది. తూర్పు లద్ధాఖ్‌లో తాను ఆక్రమించిన ప్రాంతంలో ప్యాంగ్యాంగ్‌ సరస్సుపై ఇప్పటికే ఒక వంతెనను నిర్మించిన చైనా- దాని పక్కనే మరో వారధిని మరింత వెడల్పుగా నిర్మిస్తోంది. సరిహద్దుల్లో స్వయంసమృద్ధ గ్రామాలు, మొబైల్‌ టవర్లను ఇబ్బడిముబ్బడిగా కొలువు తీరుస్తూ ఇండియాకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదకరమైన పరిణామాలపై భారత్‌ నిరంతరం నిశితంగా గమనిస్తుండాలి. స్వీయ సామర్థ్యాల పెంపు ప్రణాళికలపై దృష్టి సారించాలి. మనవైపు సరిహద్దుల్లోనూ వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు నిరుడు పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. రహదారులు, వంతెనల నిర్మాణాలకు కేటాయింపులను పెంచినట్లు పేర్కొంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి (బీఏడీపీ) ప్రత్యేకించిన నిధుల వినియోగం క్షేత్రస్థాయిలో మరీ తీసికట్టుగా ఉండటంపై పార్లమెంటరీ స్థాయీసంఘం మూడు నెలల క్రితం అసంతృప్తి వ్యక్తంచేసింది. పరిస్థితిని సమీక్షించి, పనితీరును మెరుగుపరచాలని హోంశాఖకు సూచించింది. దేశీయ వ్యూహాత్మక, భద్రతా అవసరాల రీత్యా ఆయా ప్రాంతాల్లో భౌతిక వసతులతో సామాజిక సదుపాయాల సృష్టి సైతం కీలకమే. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు చేటుచేసేలా డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో- లేశమాత్రం అశ్రద్ధ వహించినా అనర్థదాయకమే అవుతుంది!

ఎల్‌ఓసీని అతిక్రమించేలా ఇరువర్గాలు ప్రవర్తించకూడదని 1993 ద్వైపాక్షిక ఒప్పందం నిర్దేశిస్తోంది. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు తలెత్తితే ఉభయులూ స్వీయనిగ్రహం పాటిస్తూ, వాతావరణాన్ని చల్లబరిచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని 1996 ఒడంబడిక చాటుతోంది. వీటితో పాటు 2013లో కుదుర్చుకున్న మరో సరిహద్దు ఒప్పందాన్నీ ఏకపక్షంగా తోసిరాజంటూ రెండేళ్ల క్రితం గాల్వాన్‌లో చైనా కయ్యానికి కాలుదువ్వింది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రతిష్టంభన తొలగింపునకు ఇప్పటికీ అది మోకాలడ్డుతోంది. భారత సైన్యాధిపతి మనోజ్‌ పాండే ఇటీవల వ్యాఖ్యానించినట్లుగా- సరిహద్దు జగడాలను నిత్యం సజీవంగా ఉంచేందుకే బీజింగ్‌ ప్రయత్నిస్తోంది. పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు తేలికపాటి యుద్ధ ట్యాంకుల కోసం భారత సైన్యం ఎదురుచూపులు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో సులభంగా కదులుతూ, శత్రువులను నిలువరించేందుకు అవి బాగా అక్కరకొస్తాయి. దేశీయంగానే వాటిని రూపొందించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. ఆ క్రతువును వేగవంతం చేయడంతో పాటు మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీ) సేననూ పటిష్ఠపరచుకోవాలి. ఎల్‌ఓసీ సమీపంలో గూఢచర్యం తదితరాలకు యూఏవీలను చైనా విస్తృతంగా వినియోగిస్తుండటం కలవరపరుస్తోంది. మందుగుండు సామగ్రి, ఆయుధ విడిభాగాల సరఫరాలు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రభావితమైన దరిమిలా... రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం అత్యావశ్యకం. ఆ మేరకు కొనసాగుతున్న కృషిని ఇతోధికం చేస్తూ, బీజింగ్‌ కపటోపాయాలను అంతర్జాతీయంగా ఎండగట్టాలి. అందుకు కలిసివచ్చే మిత్రులతో బంధాలను భారత్‌ బలోపేతం చేసుకోవాలి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని