దేశ హితమే పరమావధిగా...

సప్త సంపన్న రాజ్యాల కూటమి (జీ7) సదస్సుకు చైనా విస్తరణ వాదం నిరుడు కీలక అజెండా కాగా; తాజా భేటీకి రష్యా యుద్ధోన్మాదమే ప్రధాన చర్చనీయాంశమైంది. సమరం సాగినంత కాలం ఉక్రెయిన్‌కు అన్ని

Published : 29 Jun 2022 00:09 IST

సప్త సంపన్న రాజ్యాల కూటమి (జీ7) సదస్సుకు చైనా విస్తరణ వాదం నిరుడు కీలక అజెండా కాగా; తాజా భేటీకి రష్యా యుద్ధోన్మాదమే ప్రధాన చర్చనీయాంశమైంది. సమరం సాగినంత కాలం ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా నిలబడతామన్న ఆయా దేశాధినేతల ఉమ్మడి ప్రకటన- మాస్కోపై ఆంక్షల విధింపులో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పింది. బంగారంతో పాటు క్రెమ్లిన్‌ ఆదాయ వనరులు అన్నింటినీ దిగ్బంధిస్తూ, ప్రపంచ విపణిలో రష్యాను ఏకాకిని చేసే వ్యూహాలను అది ప్రస్తావించింది. జర్మనీలోని ఎల్‌మావ్‌లో సాగిన సమావేశానికి జీ7 దేశాల భాగస్వామ్య పక్షంగా హాజరైన ఇండియా- విదేశాంగ విధానంలో స్వతంత్రతను నిలబెట్టుకుంటూ రష్యా పట్ల తన తటస్థ వైఖరికే కట్టుబడింది. శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలుకుతూ చర్చలు, దౌత్య యత్నాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనే భారతదేశ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తతలతో నింగిని తాకుతున్న చమురు ధరలపై ఆందోళన వ్యక్తంచేసిన ఆయన- అవకాశాల గనిగా అవతరిస్తున్న దేశీయ స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని సంపన్న రాజ్యాలను ఆహ్వానించారు. భావప్రకటన, మీడియా, మత స్వేచ్ఛలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య విలువలకు గొడుగుపట్టే తీర్మానానికి జీ7 దేశాలతో పాటు ఇండియా కూడా కట్టుబాటు చాటడం హర్షణీయం. ప్రపంచ భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల కట్టడికి సమష్టి కృషి కొనసాగింపుపై వెలువడిన సంయుక్త ప్రకటన సైతం కీలకమే. మరోవైపు, రష్యా దమననీతి కారణంగా సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై పలు దేశాల్లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ఆకలి మహమ్మారి నుంచి అభాగ్యులను రక్షించేందుకు 1400 కోట్ల డాలర్ల మేరకు సాయంచేస్తామని జీ7 కూటమి ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు రాబోయే అయిదేళ్లలో అరవై వేల కోట్ల డాలర్లను సమీకరించేందుకూ అది సిద్ధపడుతోంది. ఆ ఆలోచనల వెనక అసలు లక్ష్యం- ‘బీఆర్‌ఐ’ పథకంతో ఆయా ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెక్‌ చెప్పడమేనన్నది సుస్పష్టం. మాస్కో, బీజింగ్‌ల మధ్య సంబంధాలు బలంగా పెనవేసుకుంటున్న సమయంలో- ఆ రెండింటిపై జీ7 ప్రయోగిస్తున్న అస్త్రశస్త్రాలు ఏమేరకు సఫలీకృతం అవుతాయన్నదే ఆసక్తికరం!

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు గల్ఫ్‌లో ఆందోళనలకు దారితీశాయి. వివిధ దేశాలు భారత ప్రభుత్వానికి అధికారికంగానే తమ నిరసనలను తెలియజేశాయి. ఇబ్బందికరమైన ఆ పరిణామాల దరిమిలా- ఇటీవల దివంగతులైన యూఏఈ పూర్వ అధ్యక్షులు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌కు నివాళి తెలిపేందుకు ప్రధాని మోదీ తాజాగా అక్కడికి వెళ్ళడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యూఏఈతో కొద్ది నెలల క్రితమే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ముడివడింది. ప్రస్తుతం అయిదు నుంచి ఆరువేల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం దాంతో రెట్టింపు కానుందనే విశ్లేషణలు లోగడే వెలుగుచూశాయి. పశ్చిమాసియా క్వాడ్‌ ‘ఐ2యూ2’ (ఇండియా, ఇజ్రాయెల్‌, యూఎస్‌ఏ, యూఏఈ) తొలి సమావేశం వచ్చే నెలలో జరగనున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. సాంకేతిక సమాచార రంగాలు, ఆరోగ్య సేవలు వంటివాటిలో సమష్టి ప్రగతికి ఊతమివ్వడంతో పాటు భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో కొత్త కూటమి భారత్‌కు బలిమి కానుంది. విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వ్యాఖ్యానించినట్లుగా- ఇండియా, యూఏఈ స్నేహబంధం క్రియాశీలంగా సాగుతూ నేడు భిన్న రంగాల్లోకి విస్తరించింది. ఉభయతారకమైన ఆ చెలిమిని మరింత పటిష్ఠపరచేందుకు ప్రధాని పర్యటన ఎంతగా దోహదపడుతుందో చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.