సంస్కరణ మాటున పన్నుపోటు

రాష్ట్రానికో తీరుగా ఊడలు దిగిన పన్నుల అవ్యవస్థే ఇండియా పురోగతికి ప్రతిబంధకమైందన్న విమర్శలూ విశ్లేషణల నేపథ్యంలో ‘ఏక్‌ భారత్‌’ నినాదంతో ఎన్డీయే ప్రభుత్వం అయిదేళ్ల క్రితం చేపట్టిన చరిత్రాత్మక

Published : 30 Jun 2022 00:10 IST

రాష్ట్రానికో తీరుగా ఊడలు దిగిన పన్నుల అవ్యవస్థే ఇండియా పురోగతికి ప్రతిబంధకమైందన్న విమర్శలూ విశ్లేషణల నేపథ్యంలో ‘ఏక్‌ భారత్‌’ నినాదంతో ఎన్డీయే ప్రభుత్వం అయిదేళ్ల క్రితం చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణ- జీఎస్‌టీ. వస్తు సేవా సుంకం దేశార్థిక వ్యవస్థలో అవినీతిని పరిమార్చి వసూళ్లలో పారదర్శకత నెలకొల్పుతుందన్న అంచనాలు అప్పట్లో మోతెక్కిపోయాయి. ఆకాంక్ష వేరు, అనుభవం వేరని ఈ అయిదేళ్ల ప్రస్థానం నిరూపిస్తోంది. ఇన్ని సంవత్సరాల నడకను సాకల్యంగా సమీక్షించి, రాష్ట్రాల గోడు ఆలకించి రేట్లు హేతుబద్ధీకరించేందుకంటూ చండీగఢ్‌లో నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక సమావేశం- స్థూలంగా మరింత బాదుడుకే ఓటేసింది. జీఎస్‌టీ పరిహార నిధి పేరిట అయిదేళ్లపాటు అదనపు సెస్సుల వసూలు కోసం కేంద్రం 2017లోనే చట్టం తెచ్చింది. చండీగఢ్‌ సదస్సుకు ముందే, పరిహార సెస్సు విధింపును 2026 వరకు పొడిగించిన కేంద్రం- తనవంతుగా రాష్ట్రాలకు చెల్లింపులపై నిర్ణయాన్ని ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది! దేశంలో జీఎస్‌టీ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ‘గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. వస్తుసేవా సుంకం అమలుపరుస్తున్న దేశాల్లో అత్యధికం ఒకే పన్ను శ్లాబ్‌ విధానం పాటిస్తున్నాయి. బంగారం, విలువైన రాళ్లకు వేర్వేరు వడ్డనలూ కలిపి ఇక్కడ ఆరు శ్లాబులు- పన్ను మదింపు, వసూళ్లలో సంక్లిష్టతల్ని నిక్షేపంగా కొనసాగిస్తున్నాయి. ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ, మున్ముందు వస్తుసేవల సుంకాల తగ్గుదలే తప్ప పెంపుదల ఉండబోదని గతంలో జాతికి అభయమిచ్చారు. ఆ హామీకి తూట్లు పొడుస్తూ హేతుబద్ధీకరణ అంటే పన్నుల పరిధి, రేట్ల విస్తరణేనన్న అర్థాన్ని స్థిరీకరించే ఆనవాయితీని జీఎస్‌టీ మండలి ఈసారీ ‘నిష్ఠ’గా కొనసాగించింది. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుమునూ జీఎస్‌టీ పరిధిలోకి చేర్చిన విధాన మండలి, రాయితీల తెగ్గోతలో భాగంగా ఆతిథ్య రంగానికీ షాకులిచ్చింది. ఇప్పటికి నాలుగు వందల సార్లకు పైగా రేట్ల సవరణ చేపట్టిన అత్యున్నత నిర్ణాయక సంస్థ ఎప్పటికప్పుడు పన్నుపోటు భారాన్ని విస్తరించుకుంటూ పోవడం, సంస్కరణ స్ఫూర్తినే ఖర్చు రాసేస్తోంది!

దేశవ్యాప్తంగా 17 రకాల భిన్న పన్నుల స్థానంలో అమలులోకి వచ్చిన వస్తుసేవా సుంకం సహకార సమాఖ్య భావనకు ప్రతీకగా నిలిచిందన్న భాష్యాలు తొలినాళ్లలో హోరెత్తించాయి. సొంత పన్నుల్ని త్యాగం చేసిన తమకు సరైన పరిహారం దక్కడంలేదన్న కొన్ని రాష్ట్రాల అసంతృప్తి నేడా సుహృద్భావాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. జీఎస్‌టీ రాబడుల వృద్ధి 14శాతం కన్నా తక్కువైన రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత చట్టం నిర్దేశిస్తోంది. వస్తు సేవాసుంకం ప్రవేశపెట్టడానికి మునుపు మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లోనే 14శాతానికి మించి పన్నుల్లో వార్షిక వృద్ధి నమోదయ్యేదంటోన్న గణాంకాలు- కేంద్ర అనాలోచిత నిర్ణయాన్ని ప్రశ్నించేవే. సరైన మదింపు లేకుండా ఖరారు చేసిన 15.5శాతం ఆదాయ సమతుల పన్నురేటు సాధించేందుకంటూ కేంద్రం కొన్నాళ్లుగా చేస్తున్నదేమిటి? జనం మీద పన్నులు పెంచుతోంది, సుంకాల మినహాయింపు జాబితా నుంచి మరిన్ని వస్తు సేవల్ని తగ్గిస్తోంది. జీఎస్‌టీ ప్రవేశపెట్టాక ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, పండ్లు తదితరాల ధరవరలు తగ్గుతాయన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హామీ ఆచరణలో కొల్లబోయి- పౌరుల వీపులపై వాతలు తేలుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లకు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖే ఇటీవల సగర్వంగా వెల్లడించింది. పన్ను వసూళ్లు పెరుగుతున్నా రేట్లు పెంచుకుంటూ పోవడం ఏమిటి? నకిలీ ఇన్‌వాయిస్‌ల దన్నుతో కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వాళ్ల భరతం పట్టేలా వ్యవస్థాగత సంస్కరణలు చురుకందుకోవాలి. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలన్న సూచనల్నీ తక్షణం పరిశీలించాలి. వసూళ్లు ఇనుమడించాలన్నా, ప్రజాశ్రేయాన్ని పరిరక్షించాలన్నా సహేతుక పన్నులే సమంజసమన్న స్పృహతో కేంద్రం ముందడుగు వేయాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.