మహా రాజకీయంలో మలుపులెన్నో...

‘నావల్ల, నా కుటుంబంవల్ల బాధపడ్డామని శివసైనికుల్లో ఏ ఒక్కరు మమ్మల్ని వేలెత్తిచూపినా... ఆ మరుక్షణమే అధ్యక్షుడిగా తప్పుకొంటా’- మూడు దశాబ్దాల క్రితం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న

Published : 02 Jul 2022 00:15 IST

‘నావల్ల, నా కుటుంబంవల్ల బాధపడ్డామని శివసైనికుల్లో ఏ ఒక్కరు మమ్మల్ని వేలెత్తిచూపినా... ఆ మరుక్షణమే అధ్యక్షుడిగా తప్పుకొంటా’- మూడు దశాబ్దాల క్రితం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో బాల్‌ ఠాక్రే ప్రయోగించిన భావోద్వేగ అస్త్రమది. ఆనాడు అది విజయవంతమై, శివసేనపై ‘మాతోశ్రీ’ పట్టును పటిష్ఠం చేసింది. కొన్నాళ్లుగా అంతే ఉద్వేగంగా సాగిన ఉద్ధవ్‌ ఠాక్రే ఉపన్యాసాలు, విజ్ఞప్తులు మాత్రం తనపై తిరగబడిన ఏక్‌నాథ్‌ శిందే శిబిరాన్ని మెప్పించలేకపోయాయి. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌-దేవేంద్ర ప్రభుత్వ ఏర్పాటును అవి అడ్డుకోలేకపోయాయి. శివసేనను ఠాక్రేలకు పూర్తిగా దూరంచేసి, దాని భవిష్యత్తును బలహీనపరచడం; పశ్చిమ మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీల పునాదులను పెళ్లగించేందుకు అక్కరకొస్తారనే స్థానిక మరాఠా నేత శిందేను భాజపా అనూహ్యంగా ముఖ్యమంత్రిగా కొలువుతీర్చిందనే విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. అసలైన శివసేన తమదేనని ఏక్‌నాథ్‌ వర్గం వాదిస్తుండటంతో- పార్టీ భవనం, ఎన్నికల చిహ్నమూ ‘మాతోశ్రీ’ చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బాల్‌ఠాక్రే వారసత్వంతో పాటు వాటినీ కాపాడుకోవాలంటే- సుదీర్ఘ రాజకీయ, న్యాయపోరాటాలకు ఉద్ధవ్‌ సిద్ధం కావాల్సిందే. మరాఠీ ప్రాంతీయవాదం, హిందుత్వ భూమికగా బాల్‌ఠాక్రే నిర్మించిన శివసేన... అయిదున్నర దశాబ్దాల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్య విలువలకు దాదాపు దూరంగానే ఉంది. 1993 ముంబయి మతఘర్షణల్లో దాని పాత్రను జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ సైతం తప్పుపట్టింది. భాజపాతో దశాబ్దాల దోస్తీకి తిలోదకాలిచ్చి, పదవులకోసమే అది 2019లో కాంగ్రెస్‌, ఎన్సీపీల పంచన చేరింది. స్వపక్షీయులను పట్టించుకోని ఉద్ధవ్‌ వైఖరి, ఆయన తనయుడు ఆదిత్య అపరిపక్వత, సంజయ్‌ రౌత్‌ శల్యసారథ్యాలకు- అదను చూసి ప్రత్యర్థులను చావుదెబ్బ తీయడంలో పండిపోయిన కమలదళ వ్యూహాలు తోడై నేడు శివసేన పుట్టి మునిగింది. అధికారం యావలో సిద్ధాంతాలు, జనస్వామ్య ప్రమాణాలను ఖాతరుచేయని పార్టీలు ఏవైనా సరే- ఎల్లకాలం మనుగడ సాగించలేవు. వాటి దుర్రాజకీయాలు దేశాభివృద్ధికి ఎంతమాత్రం దోహదపడవు సరికదా- అంతిమంగా అవి ప్రజలను నట్టేట ముంచుతాయి!

రెండున్నరేళ్ల క్రితం ఎన్నికలకు ముందు దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతూ- ‘మీ పునః యేయీల్‌’ (ముఖ్యమంత్రిగా నేను తిరిగొస్తాను) అని ఢంకా బజాయించారు. ఫలితాల ప్రకటన అనంతరం సీఎం పదవికోసం  మిత్రపక్షం శివసేన మొండికేయడంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఆపై పలు నాటకీయ పరిణామాలు సంభవించి, చివరకు ‘మహావికాస్‌ అఘాడి’ పేరిట ఉద్ధవ్‌ నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేనల సంకీర్ణ సర్కారు రాజ్యానికొచ్చింది. అప్పటి నుంచి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఫడణవీస్‌- ప్రత్యర్థి పక్షాల్లోని అసంతృప్తులను ఆకర్షించి ఇటీవల రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో తమ సొంతబలానికి మించిన ఫలితాలనే రాబట్టారు. ‘రాజ్యసభ ట్రైలర్‌ మాత్రమే... చూస్తూ ఉండండి తరవాత మేమేమి చేస్తామో’ అంటూ అప్పుడాయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు- శివసేనలో ముసలానికి ముందస్తు సంకేతాలుగా ఈమధ్య చర్చల్లోకి వచ్చాయి. రాజకీయ ఎత్తుగడలు ఫలించి అధికారం అందినప్పటికీ- అధిష్ఠానం నిర్ణయంతో సీఎం పదవి దూరమై దేవేంద్రుడి కలలు ఒక్కసారిగా భగ్నమయ్యాయి. మరోవైపు- మహారాష్ట్రలో మాదిరిగానే ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఆ తరవాత పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ ప్రతిపక్ష ప్రభుత్వాలు కూలిపోతాయని భాజపా బెంగాలీ సీనియర్‌ నేత సువేందు అధికారి ఘంటాపథంగా చెబుతున్నారు! ఏ మందలో తిన్నా మన మందలో ఈనితే చాలన్నట్లుగా వెర్రితలలు వేస్తున్న సమకాలీన రాజకీయాలు కలవరపరుస్తున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో గెలుపోటములు సహజమే. సామాన్యులతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ, కాలానుగుణంగా తమ పద్ధతులను సంస్కరించుకునే పార్టీలు ఒకసారి కాకపోయినా మరోసారి జనాభిమానాన్ని చూరగొంటాయి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.