Published : 03 Jul 2022 00:09 IST

ధర్మ యశస్సు

గర్వంగా అరవడం కాదు... వర్షంగా కురవడమే మేఘానికి ఘనత. పిడకలో దాగి ఉన్నప్పుడు కాదు... పైరుగా వికసించినప్పుడే విత్తనానికి ధన్యత. పరమశివుడి శిరసున చేరినందుకు కాదు... భూమిపై పారినందుకే గంగానదికి పూజ్యత. ఇదే సూత్రం మనిషి మనుగడకు సైతం వర్తిస్తుంది. నలుగురికీ ఉపయోగపడటమే జన్మకు సార్థకత! పెంచుకొంటూ పోయేదాన్ని ఆస్తి అంటారు. పంచుకొంటూ పోయేదాన్ని సంపద అంటారు. సంపద వల్ల సమాజానికి సంతృప్తి దక్కుతుంది. ‘కారే రాజులు! రాజ్యముల్‌ గలుగవే, గర్వోన్నతిం పొందరే వారేరీ? భూమిపై పేరైనం గలదే?’ అని భాగవతం అడిగిన ప్రశ్నకు- ఆస్తిని సంపదగా మార్చడమే జవాబు. మరణానంతర జీవితం పట్ల నమ్మకం, ఆసక్తి గలవారికి ‘త్యాగే నైకే అమృతత్వ మానశుః అమృతత్వం సిద్ధించాలంటే త్యాగం ఒక్కటే దారి’ అన్న వేదోక్తి పట్ల గురి ఏర్పడుతుంది. భౌతికంగా కీర్తిప్రతిష్ఠలు... మానసికంగా గొప్ప ఆనందం... ఆధ్యాత్మికంగా చక్కని సత్కర్మ చేకూరడమే నిజమైన సంపద. ‘ఐశ్వర్య చైతన్యం’ అనే మాటకు తాత్పర్యం అదే. వెలిగినప్పుడు హారతిగా, మలిగినప్పుడు పరిమళంగా సురభిళించే కర్పూరం లాంటి మనుగడే మనిషికి ఆదర్శం. ‘ఆనందం అనేది- ఏమేమి పొందామన్న దానికన్నా, ఏమేమి వదులుకొన్నామనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది’ అన్న గాంధీజీ మాటల్లోని అంతరార్థం అదే. శిబిచక్రవర్తిని ఈ లోకం స్మరించేది ఆయన దాన విలక్షణత కోసమే గాని, పాలనాదక్షత గురించి కాదు. ‘శిబి ప్రముఖులన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!’ అని బలిచక్రవర్తి శుక్రాచార్యుణ్ని ఎందుకు అడిగాడంటే- ఈ లోకం దాతను గుర్తు పెట్టుకొంటుంది తప్ప ధనవంతుణ్ని కాదు. దానధర్మాదుల కారణంగా మరణానంతరం మనిషి పేరు నాలుగు కాలాలపాటు నిలిచి ఉండటాన్నే ‘యశస్సు’ అంటారు.

‘కలనాటి ధనములు అక్కరగల నాటికి దాచ కమల గర్భుని వశమా’ అంటూ ప్రశ్నిస్తుందో చాటుపద్యం. అది సాధ్యమేనని నిరూపిస్తుంది యశస్సు. యశస్సు అంటే అమవస నిసిలోని వికసిత కౌముది. పరలోకంలో ఆదుకొనే గుప్తనిధి. ఇహలోకంలో సంతృప్తికి కారణం కీర్తి. కీర్తి యశస్సు సాధించినవారి విషయంలో మరణం ఒక మార్పు... ఒక మలుపు. సక్రమ మార్గంలో సంపాదించడం, ఆ సంపాదనను సద్వినియోగం చేయడం... రెండూ ‘అర్థశౌచం’లోకి వస్తాయన్నాడు మనువు. జూదం నెపంతో పాండవుల నుంచి హరించిన సిరిసంపదలకు అర్థశౌచం లేకనే, విదురుడు కౌరవులను మందలించాడు. ‘నీ ఉపేక్ష కతన నీ ఊర్ధ్వగతు లెల్ల భగ్నమయ్యె, కలి నిమగ్నమయ్యె’ అని ధృతరాష్ట్రుణ్ని హెచ్చరించాడు. పరలోకంలో అతడి పలుకుబడి, యశస్సు మసకబారాయని దాని అర్థం. భారతీయమైన ఒకానొక మౌలిక ఆలోచనా స్రవంతిని ఆకళించుకోవాలంటే- ఆర్థికపరమైన ఈ అంతస్సూత్రాన్ని గ్రహించాలి. అప్పుడు గాని, బిహార్‌లోని మధుబని జిల్లావాసి- మహదేవ్‌ ఝా తన మరణానంతరం దశదిన కర్మలకై వెచ్చించే సొమ్మును వంతెన నిర్మాణానికి ఎందుకు వాడమన్నారో తెలిసిరాదు. ఆ ఖర్చుతో చుట్టూ నది, మధ్యలో దీవి లాంటి నారార్‌ గ్రామాన్ని తక్కిన ప్రపంచంతో అనుసంధానించే వంతెన నిర్మాణం పూర్తయింది. విద్య వైద్య పంటల రవాణా వంటి ఆ ఊరి అవసరాలన్నీ తీరుతున్నాయి. వంతెనపై నడిచేవారంతా నిత్యం మహదేవ్‌ ఝాను గుర్తుచేసుకొంటున్నారు. పూర్ణమ్మ కవితలో గురజాడకవి చెప్పిన ‘నలుగురు కూచుని నవ్వే వేళల...’ ఆయన పేరు తలపుల్లోకి వస్తోంది. అంతకన్నా బతుక్కి ధన్యత ఏముంటుంది? మరణించీ జీవించడమంటే అదే కదా!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts