Published : 05 Jul 2022 00:53 IST

లఘు పరిశ్రమలకు చేయూత

దేశార్థిక ప్రగతి ప్రస్థానంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లది ఎంతో కీలక భూమిక అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు అక్షరసత్యాలు. భారతీయ ఎగుమతులు గణనీయంగా పెంపొందాలన్నా, దేశీయ ఉత్పత్తులు నూతన విపణుల్ని కొల్లగొట్టాలన్నా లఘు పరిశ్రమల అభ్యున్నతి అత్యంత ఆవశ్యకమనడంపై భిన్నాభిప్రాయానికి తావే లేదు. సూక్ష్మ సంస్థల ఎగుమతులకు ఇండియాను ప్రధాన కేంద్రంగా అవతరింపజేసేందుకంటూ విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ నిరుడు ఆగస్టులో ‘ఉభర్‌తే సితారే’ నిధిని ఆరంభించారు. ఆ చొరవకు కొనసాగింపుగా ప్రధాని మోదీ రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రాల్లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల విస్తరణ సామర్థ్యం పెంచడానికి, విశ్వవిపణిలో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తులను సేవలను అందించేలా లఘు పరిశ్రమల్ని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన రెండు పథకాలను పట్టాలకు ఎక్కించారు! పెద్దనోట్ల రద్దు,  వస్తుసేవా సుంకం అమలువల్ల తలెత్తిన ఇబ్బందుల్లో లఘు పరిశ్రమలు కూరుకుపోయాయని నాలుగేళ్లక్రితం ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, సిడ్బీ నివేదిక ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆ ఇక్కట్ల నుంచి కోలుకోకుండానే ఆర్థికమాంద్యం, దాన్ని వెన్నంటి కొవిడ్‌ సంక్షోభం చిన్న పరిశ్రమల్ని పెద్దదెబ్బ తీశాయి. దేశంలో సగానికిపైగా లఘుపరిశ్రమలు పూర్తిగా మూతపడే ముప్పును ఎదుర్కొంటున్నాయి. చతికిలపడిన చిరు సంస్థలకు కొత్త ఊపిరులూదే క్రమంలో ప్రభుత్వమిప్పుడు చేయూత అందిస్తామంటోంది. రూ.200కోట్లదాకా ఆర్డర్లకు ఇకమీదట గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించేది లేదంటున్న ప్రధాని ప్రకటన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నెత్తిన పాలు పోసేదే. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే ‘దేశీయోత్పత్తుల ప్రోత్సాహక కోటా’ పరిధిని రూ.500కోట్ల వరకు పెంచుతామన్న సవాలును లఘు పరిశ్రమలు చురుగ్గా అందిపుచ్చుకోవాలి!

రెండు వందల యాభై కన్నా తక్కువ మందికి ఉపాధి కల్పించే సంస్థల్ని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలుగా చిరువ్యాపార అంతర్జాతీయ మండలి (ఐసీఎస్‌బీ) వ్యవహరిస్తోంది. అటువంటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అనేక మధ్యాదాయ దేశాల్లో 50 శాతందాకా జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)ని, ఉపాధి కల్పనలో 70శాతం వాటాను స్వీయ ఘనతలుగా చాటుకుంటున్నాయి. ఇక్కడ ఆరుకోట్ల 30లక్షల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు దేశీయ పారిశ్రామికోత్పత్తిలో మూడోవంతుకు, జీడీపీలో 29శాతానికి పరిమితమవుతున్నాయి. 2030నాటికి జీడీపీలో 40శాతం వాటా సాధించేలా లఘు పరిశ్రమలు పరిపుష్టం కావాలంటున్న ప్రభుత్వం, తనవంతు బాధ్యతా నిర్వహణను ఇక ఎంతమాత్రం విస్మరించజాలదు. పొరుగున చైనాలో దాదాపు నాలుగు లక్షల లఘు పరిశ్రమలు ఇప్పటికే అక్కడి జీడీపీలో 60శాతం వాటాతో, 80శాతందాకా ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి. ఆటబొమ్మలనుంచి జౌళి ఉత్పత్తుల వరకు, బల్క్‌డ్రగ్స్‌ మొదలు సైకిళ్ల వరకు భారీయెత్తున విదేశాలకు ఎగుమతులు చేస్తున్న చైనా సంస్థలకు దీటుగా దేశీయ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు నిలదొక్కుకోవడం కోసం- కేంద్రం చేయాల్సింది ఎంతో ఉంది. ఇక్కడి లఘు సంస్థలు రూ.18 లక్షలకోట్ల మేర రుణ వసతి కొరతతో సతమతమవుతున్నాయని ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్ల సంఘం (ఏసీసీఏ) ఏడాదిక్రితమే మదింపువేసింది. చిన్నసంస్థలకు  ఇదమిత్థంగా లక్ష్యాలు నిర్దేశించి ఉదారంగా రుణవితరణ చేపట్టడం తక్షణావసరం. వ్యవస్థాగత పరపతిని మెరుగుపరచడంతోపాటు- జర్మనీ, సింగపూర్‌, జపాన్‌, న్యూజిలాండ్‌ ప్రభృత దేశాల తరహాలో సృజనాత్మక డిజిటల్‌ సాంకేతికతనూ చేరువ చేయాలి. జీఎస్‌టీ వసూళ్లలో 30శాతం దాకా లఘు పరిశ్రమల నుంచే జమపడుతోందని గణాంక విశ్లేషణ చాటుతోంది. ఆ పన్ను పోటును, బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును సహేతుక స్థాయికి పరిమితం చేస్తూ ప్రభుత్వం పెద్దమనసు చాటుకుంటేనే- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు నిజంగా తెరిపిన పడతాయి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని