విలువలకు తిలోదకాలు

లౌకికవాదం... భారత సంవిధాన ప్రాథమిక లక్షణం. బాధ్యతల నిర్వహణలో మతాతీతంగా ప్రవర్తిస్తూ, దానికి గొడుగుపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. ఆ మేరకు రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగేలా

Published : 06 Jul 2022 00:15 IST

లౌకికవాదం... భారత సంవిధాన ప్రాథమిక లక్షణం. బాధ్యతల నిర్వహణలో మతాతీతంగా ప్రవర్తిస్తూ, దానికి గొడుగుపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. ఆ మేరకు రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగేలా చూడాల్సిన గవర్నరే లౌకికవాదాన్ని వెక్కిరిస్తే ఏమనుకోవాలి? కొవిడ్‌ సమయంలో అనివార్యంగా మూసేసిన ప్రార్థనాస్థలాల తలుపులను తిరిగి తెరిపించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం జాగు చేస్తోందని మండిపడుతూ అప్పట్లో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆ రాష్ట్ర ప్రథమ పౌరులు భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఒక లేఖ రాశారు. రాజ్యాంగ విలువలకు నీళ్లొదిలేసి మరీ హిందుత్వ పట్ల ఉద్ధవ్‌ నిబద్ధతను అందులో ఆయన ప్రశ్నించారు. ‘మీరు లౌకికవాదిగా మారిపోయారా ఏమిటి’ అని ముఖ్యమంత్రిని కోశ్యారీ ఎద్దేవా చేశారు! అంతకు ముందు, ఆ తరవాతా మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంతో గవర్నర్‌ ఘర్షణాత్మక వైఖరినే అనుసరించారు. ముఖ్యంగా శాసనసభాపతి ఎన్నికకు కోశ్యారీ ఇన్నాళ్లుగా మోకాలడ్డిన తీరు పెనువిమర్శల పాలయ్యింది. ఎంవీఏ ఏలుబడి ముగిసి ఏక్‌నాథ్‌-దేవేంద్ర సర్కారు కొలువుతీరిన రెండు రోజుల్లోనే స్పీకర్‌ ఎన్నిక సజావుగా సాగిపోయింది! అన్ని రాజకీయ పక్షాలకు సమదూరం పాటించాల్సిన గవర్నర్లు- రాష్ట్రాలకు అతీతంగా అలా అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డిస్తున్నారు. మంత్రిమండళ్ల సలహాల మేరకు నడచుకోవాల్సిన వారు... విచక్షణాధికారాల పేరిట తరచూ కట్టుదాటుతున్నారు. రాజీవ్‌ గాంధీ హత్యకేసులో దోషి పేరారివాళన్‌కు క్షమాభిక్ష అంశంలో అలాగే అహేతుకంగా వ్యవహరించిన తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు ఇటీవలే దుమ్మెత్తిపోసింది. పశ్చిమ్‌ బెంగాల్‌, కేరళ, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల ప్రథమ పౌరులు సైతం తమ మాటలూ చేతలతో కొన్నాళ్లుగా అంతే వివాదాస్పదులవుతున్నారు. నిజానికి గవర్నర్లు సంవిధాన సంరక్షకులే కానీ, కేంద్ర ప్రభుత్వోద్యోగులు కారు. ఆ కీలకాంశాన్ని న్యాయపాలిక ఏనాడో స్పష్టీకరించినా- దశాబ్దాలుగా వారు హస్తినాపుర ప్రభువుల కనుసన్నల్లో మెలగుతూ, విపక్ష రాష్ట్ర సర్కార్ల కళ్లల్లో నలుసులుగా మారుతున్నారు. స్వతంత్ర వ్యవస్థలను కుప్పకూల్చే దుర్రాజకీయాలతో కేంద్రంలోని అధికార పక్షాలు తమ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చు. కానీ, సమైక్య రాజ్య స్ఫూర్తిని బలితీసుకునే ఆ పెడపోకడలు దీర్ఘకాలంలో దేశానికి తీవ్ర నష్టమే చేస్తాయి!

రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు తలదూర్చకూడదని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. సంవిధాన సూత్రాలకు అనుగుణంగా ప్రథమ పౌరులు విజ్ఞతతో హుందాగా విధులు నిర్వర్తించాలని వారు కోరుకున్నారు. తమ పార్టీల్లోని కురువృద్ధులు, విశ్వసనీయ విశ్రాంత అధికారులను గవర్నర్లుగా ఏరికోరి ఎంపిక చేస్తున్న హస్తిన పాలకుల ధోరణులు- రాజ్‌భవన్లను రాజకీయ తలారుల కార్యస్థలాలుగా మార్చేశాయి. ఇందిరాగాంధీ హయాములో ఏపీలో రామ్‌లాల్‌ నుంచి ఆ తరవాత యూపీలో రమేశ్‌ భండారీ వరకు- కేంద్రం చేతి పనిముట్లుగా పరిణమించిన గవర్నర్ల దుర్విధానాలు ప్రజాస్వామ్య ప్రమాణాలకు పాతరేశాయి. ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, బిహార్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో గడచిన కొన్నేళ్లలో అక్కడి ప్రథమ పౌరుల నిర్ణయాలు జనతంత్ర హితైషులను కలవరపరిచాయి. లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి పరమోన్నత లక్షణాల కలబోతగా గవర్నర్లు పనిచేయాలి. ఆ స్వప్నం సాకారం కావాలంటే- వారి నియామక విధానాలు పూర్తిగా మారాలి. అందుకుగానూ గతంలో భాజపాయే గళమెత్తినట్లుగా గవర్నర్ల ఎంపికలో కేంద్రం గుత్తాధిపత్యాన్ని నివారించాలి. స్వతంత్ర నిపుణుల సంఘం ద్వారా నైతిక నిష్ఠ కలిగిన కార్యదక్షులను గుర్తించి; రాష్ట్రాలు, విపక్షాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని నియామకాలు జరపాలి. అటువంటి ఉన్నత వ్యక్తులు పదవుల్లోకి వస్తేనే- కేంద్రం, రాష్ట్రాల నడుమ సత్సంబంధాలకు వారధిగా గవర్నర్ల వ్యవస్థ సార్థకమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.