సమగ్ర కార్యాచరణతోనే స్వావలంబన

సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు అహర్నిశలూ నిబద్ధమయ్యే అత్యంత కీలక వ్యవస్థ- సైన్యం. అటువంటి సేనను శత్రుభయంకరంగా నిలిపేవి- వైరిపక్షాన్ని చిత్తుచేసే పటిష్ఠ వ్యూహం, అందుకు సైదోడుగా పటుతర ఆయుధ బలగం.

Updated : 26 Jul 2022 01:51 IST

రిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు అహర్నిశలూ నిబద్ధమయ్యే అత్యంత కీలక వ్యవస్థ- సైన్యం. అటువంటి సేనను శత్రుభయంకరంగా నిలిపేవి- వైరిపక్షాన్ని చిత్తుచేసే పటిష్ఠ వ్యూహం, అందుకు సైదోడుగా పటుతర ఆయుధ బలగం. భారత్‌పై ఏ దుష్ట నేత్రం చూపు ప్రసరించినా, ఎవరు ఎంతటి కర్కశ దాడికి తెగబడినా... అంతిమ విజయం మనదేనన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజా వ్యాఖ్యల్లో మునుపెన్నడూ ఎరుగని ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతోంది. కార్గిల్‌ అమరవీరులకు స్మృత్యంజలి ఘటిస్తూ ఆయన వెల్లడించిన అంశం, భారతీయుల గుండెల్ని ఉప్పొంగించేదే! ఇటీవలి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఇండియా పేరే మార్మోగేది. అటువంటిదిప్పుడు పాతిక అతిపెద్ద రక్షణ పరికరాల ఎగుమతిదారుల జాబితాలో భారత్‌ చోటు చేసుకోవడం అబ్బురపరచే పరిణామమే. ఇటలీ, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, ఈజిఫ్ట్‌, స్పెయిన్‌, చిలీ సహా 84 దేశాలకు నేడు ఇండియా రక్షణ సామగ్రిని ఎగుమతి చేస్తోంది. 2017-2021 సంవత్సరాల మధ్య భారత రక్షణ ఎగుమతుల్లో  50 శాతం వరకు మయన్మార్‌, 25 శాతం దాకా శ్రీలంక, 11 శాతం మేర ఆర్మీనియా చేరినట్లు ‘సిప్రి’ (స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ) నివేదిక ధ్రువీకరిస్తోంది. రక్షణ రంగాన స్వావలంబన, మిలిటరీ సామగ్రి ఎగుమతులకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వ జంట లక్ష్యాలంటున్న రాజ్‌నాథ్‌సింగ్‌ ఆత్మనిర్భరత యోజన గమ్యాన్నీ నిర్దేశిస్తున్నారు. 2025 సంవత్సరం నాటికి 500 కోట్ల డాలర్ల (సుమారు రూ.40వేల కోట్ల) విలువైన రక్షణ ఎగుమతుల్ని సాధించదలచినట్లు కేంద్ర అమాత్యులు ధీమాగా చెబుతున్నారు. రక్షణ సామగ్రికి సంబంధించి దశాబ్దాల తరబడి పరాధీనతను తుడిచిపెట్టే క్రమంలో దేశం అధిగమించాల్సిన సవాళ్లెన్నో ఉన్నాయి!

‘భారత్‌ తాత్కాలికంగా ఆయుధాలను సైనిక సామగ్రిని విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నా, భవిష్యత్తులో వాటిని సొంతంగానే రూపొందించుకోవా’లన్నది ప్రథమ ప్రధానిగా నెహ్రూ నిర్దేశం. కొన్ని దశాబ్దాలపాటు అది సరైన మన్ననకు నోచుకోనేలేదన్నది చేదునిజం. పర్యవసానంగా, ఇండియాకు రక్షణ ఎగుమతుల రూపేణా అమెరికా, రష్యాలతోపాటు ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ వంటివీ దండిగా ఆర్జించాయి. నిరుడు వెలుగు చూసిన విశ్లేషణ ప్రకారం, ఒకటిన్నర దశాబ్దాల వ్యవధిలో ఆయుధాలు, సైనిక సామగ్రి కొనుగోళ్ల నిమిత్తం భారత్‌ ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా వెచ్చించింది. మునుపటితో పోలిస్తే మన రక్షణ దిగుమతుల పరిమాణం 33 శాతం మేర తగ్గినా సైనిక అవసరాల కోసం ఇంకా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. రక్షణమంత్రి చెబుతున్నట్లు మిలిటరీ పరికరాల ఎగుమతిదారుల జాబితాలోకి చేరడం గర్వకారణమే అయినా- అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ ప్రభృత దేశాల ఎగుమతుల పద్దుతో పోలిస్తే... మనది చిన్న గీతే. 2017-2021 మధ్య అంతర్జాతీయ ఆయుధ ఎగుమతుల్లో ఇండియా వాటా    0.1 శాతం నుంచి 0.2 శాతానికి పెరిగింది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలను, ఆయుధ కర్మాగారాలను పూర్తిగా ఆధునికీకరించి సమధికంగా నిధులు కేటాయిస్తేనే- భారత ఎగుమతుల పద్దు విస్తరిస్తుందన్న నిపుణుల సిఫార్సులు సహేతుకమైనవి. పొరుగున చైనా ఇక్కడికన్నా మూడింతల బడ్జెట్‌తో రక్షణరంగాన్ని రాటుతేలుస్తోంది. దేశీయంగా అరకొర కేటాయింపులు ఒక్కటే కాదు సమస్య. 77శాతందాకా సైన్యం విజ్ఞప్తుల్ని ఆర్డ్‌నెన్స్‌ డిపోలు గాలికొదిలేస్తున్నాయని కాగ్‌ సరికొత్త నివేదిక సూటిగా ఆక్షేపించింది. అందుకు దీటుగా కార్యాచరణ పదునుతేలాలి. కుయుక్తులకు కయ్యాలమారితనానికి మారుపేర్లుగా చెలరేగుతున్న చైనా పాకిస్థాన్‌లను నిలువరించడానికి- రక్షణలో స్వయం సమృద్ధ సాధన అనుసరణీయమైనది. అభివృద్ధి-పరిశోధనపై భారీ వ్యయీకరణ ఊపందుకుంటేనే, దేశానికి దీర్ఘకాలిక రక్షణ ఒనగూడుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.