Family Relations: నెచ్చెలికి ఖరీదైన కానుక

తనది గుర్తున్నా లేకున్నా- తెలివైన మగాడు భార్య పుట్టినరోజును తప్పకుండా గుర్తు పెట్టుకొంటాడు. కూర సరిగ్గా కుదరని రోజున భార్యను కసురుకోవడం కన్నా- ‘ఇది నీ చేతి వంటలా లేదే’ అనడంవల్ల మెరుగైన ఫలితం ఉంటుందని అనుభవం మీద గ్రహిస్తాడు.

Updated : 07 Aug 2022 02:14 IST

నది గుర్తున్నా లేకున్నా- తెలివైన మగాడు భార్య పుట్టినరోజును తప్పకుండా గుర్తు పెట్టుకొంటాడు. కూర సరిగ్గా కుదరని రోజున భార్యను కసురుకోవడం కన్నా- ‘ఇది నీ చేతి వంటలా లేదే’ అనడంవల్ల మెరుగైన ఫలితం ఉంటుందని అనుభవం మీద గ్రహిస్తాడు. కాపురం అన్నాకా కోపతాపాలు, మూతివిరుపులు అందరి ఇళ్లలోనూ సహజమే. ఇల్లాలు అలిగినప్పుడు- రాజశేఖర చరిత్రలో మాదయగారి మల్లన చెప్పినట్లు ‘కనుంగవ దోయిలించి...’ కనుదోయినే దోసిలి చేసి, కళ్లతోనే మౌనంగా ప్రాధేయపడుతూ మెల్లగా దారికి తెచ్చుకోవడం ఒక పద్ధతి. నంది తిమ్మన పారిజాతాపహరణంలోని కృష్ణుడిలా ‘మనంబున నెయ్యపు కిన్కపూనావు... నీది అనురాగపుటలుక... నాకు తెలుసులే’ అంటూ గడుసుదనం ప్రదర్శించడం మరో పద్ధతి. లేదూ, కవి చెరువు శాస్త్రిలా ‘ఊల్లో ఎవ్వుతిగాని కట్టనసుమంటి ఉప్పాడ చమ్కీబుటా మల్లీమొగ్గల తెల్లకోక ఇదిగో ఈ మారెల్లి పట్కొస్తనే’ అంటూ గోముగా లాలించడం చాలామంది ఆచరించే వ్రతవిధానం. ఇలా ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. అమాయకంగా మొహం పెట్టి మగడు అలా బుజ్జగిస్తుంటే ఆడవారికి బలే లబ్జుగా ఉంటుంది. మరి కాసేపు బతిమాలించుకోవాలి అనిపిస్తుంది. చివరకు దశకుమార చరిత్రలో కేతనకవి తరహాలో ‘చవిచూడనీయవే చంద్రబింబాస్య- నీ కండ చక్కెర మోవి(తీయని పెదవి) కరిగిపోదు’ అనేసరికి మనసు కరుగుతుంది. కలత తీరుతుంది. కలవరపాటుకు గురిచేసిన ప్రణయ కలహం క్రమంగా కాపురంలో కమ్మని వరమై అనుబంధానికి ఇంధనమై దాంపత్యం కుదుటపడుతుంది. ప్రేమ రెట్టింపు అవుతుంది. ఇవి అందరి ఇళ్లలో జరిగే తతంగాలే. నిజానికి ప్రతిరోజూ ఒకేలా సజావుగా సాగిపోతే కాపురం రంజుగా ఉండదు.

అదే, అలిగిన మగాణ్ని ఆకట్టుకోవాలనుకొంటే మాత్రం, ఆడవారికది చిటికెలో పని. చిత్రం ఏమంటే- ఎవరూ పనికట్టుకొని నేర్పించకపోయినా, తాళి కట్టించుకొన్న మర్నాటినుంచే ఆడవారికి అత్యంత సహజంగా పట్టువడుతుందా విద్య. బెట్టు చేస్తున్న మగాణ్ని మెట్టు దింపాలన్నా, కోరుకొన్నవి అవలీలగా రాబట్టుకోవాలన్నా ఆడవారు అవలీలగా అమలు చేసే ఆ అమోఘ శృంగార తంత్రం పేరే- తలగడ మంత్రం! వాస్తవానికి అదొక బ్రహ్మాస్త్రం. ‘ఈప్సితలేశం’ కవితలో నాయని సుబ్బారావు చెప్పినట్లు ‘ప్రణయినీ ప్రసూనాంగ సంస్పర్శ తగిలీ తగులని విధాన కలిగినంతనె- అనంత దివ్యరాగ స్రవంతిలో...’ ముంచి తేలుస్తుందది. బుసకొడుతున్న నాగుపాము పడగను దించే అనురాగ స్వరమది. అదీ చెల్లుబాటు కాకుంటే కన్నీరు ఎలానూ ఉండనే ఉంది. సత్యభామ తన ‘శ్రీసఖమైన మోము పయి చేల చెరంగిడి బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వని’తో ఏడుపు ఆరంభించగానే కృష్ణుడు దారికొచ్చాడు. పారిజాత వృక్షాన్ని ‘పెరటి చెట్టుగ నాటింతు! పెంపు గనుము’ అని మాట ఇచ్చాడు. స్వర్గానికి పోయి, దేవేంద్రుడితో తగాదా పెట్టుకొని మరీ దాన్ని సాధించి తెచ్చాడు. అదేదో పుక్కిటి పురాణగాథ అనో, అతిశయోక్తి అనో కొట్టి పారేసేవారికి హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్‌ మహాజన్‌ ఉదంతం చక్కని సమాధానం. ఆయన తన భార్యకు ఒక ఎకరం స్థలాన్ని పుట్టినరోజు బహుమతిగా కొనిచ్చాడు. అదేం పెద్ద విశేషమా... అనకండి! ఆయన కొన్న స్థలం భూమండలంలోది కాదు- చంద్రమండలంలోది! ఎవరు అమ్మారన్నది వేరే విషయం. కష్టసుఖాలను పంచుకోవడంలో జీవన సహచరిని మించిన నేస్తం ఎవరుంటారు! ఆ నెచ్చెలిని లాలించడంలో- ‘ఒక పరికి ఒక పరికి ఒయ్యారమై...’ (ఒకోసారి ఒకో సొగసు) అన్నట్లుగా ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.