Projects: నత్తనడకన ప్రాజెక్టులు

సుదృఢ మౌలిక సదుపాయాలే మూలాధారంగా అమెరికా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు అద్భుత సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించాయి. రాబోయే కొన్నేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక

Updated : 08 Aug 2022 03:42 IST

సుదృఢ మౌలిక సదుపాయాలే మూలాధారంగా అమెరికా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు అద్భుత సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించాయి. రాబోయే కొన్నేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెబుతున్న ఇండియాలో మాత్రం- ప్రగతి రథచక్ర గమనానికి కీలకమైన ప్రాథమిక వసతులు కరవవుతున్నాయి. గడచిన జూన్‌ ఒకటో తేదీ నాటికి దేశవ్యాప్తంగా చేపట్టిన 1568 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సకాలంలో పూర్తికాలేనివి 46శాతం(721) వరకు ఉన్నట్లు కేంద్రం రాజ్యసభాముఖంగా ప్రకటించింది. రూ.21.59 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి రూ.26.54 లక్షల కోట్లు ఖర్చు కావచ్చునని కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ(ఎంఓఎస్‌పీఐ) లెక్కేస్తోంది. ఆ మొత్తంలో మొన్న మే నెలాఖరు నాటికి కేంద్రం రూ.13.42 లక్షల కోట్లను వెచ్చించింది. విభాగాల వారీగా సమీక్షిస్తే- రహదారి రవాణా రంగంలో అత్యధికంగా 843 ప్రాజెక్టుల్లో 301 దీర్ఘకాలంగా దేకుతున్నాయి. రైల్వేలో 211గాను 127, పెట్రోలియం శాఖ పరిధిలో నూట ముప్ఫైతొమ్మిదికి 91 ప్రాజెక్టులు అలాగే నత్తనడకన సాగుతున్నాయి. సగటున 43.34 నెలలు ఆలస్యంగా నడుస్తున్న 721 ప్రాజెక్టుల పనులు కచ్చితంగా ఎప్పటికి తెములుతాయో ఎవరికీ తెలియదు! భూ సేకరణ, అటవీ పర్యావరణ అనుమతుల్లో జాగు, శాంతిభద్రతల సమస్యలు, నిధుల అందుబాటులో అగచాట్లు, మానవ వనరుల లేమి తదితరాలకు అధికార యంత్రాంగం నిష్ప్రయోజకత్వం జతకలిసి- మౌలిక సదుపాయాల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. దాన్ని నివారించాలంటే- ప్రాజెక్టుల పర్యవేక్షణ, వివాదాల పరిష్కార వ్యవస్థలను పటిష్ఠపరచాలని ఎంఓఎస్‌పీఐ భాగస్వామ్యంతో లోగడ వెలువడిన పరిశోధనాత్మక నివేదిక సిఫార్సు చేసింది. ఆ మేలిమి సూచనలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకుంటేనే- అభివృద్ధికి ఆలంబనలుగా ప్రాజెక్టులు సత్వరం వాస్తవ రూపం దాలుస్తాయి!

‘జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక’(ఎన్‌ఐపీ)తో ప్రపంచస్థాయి వసతులను కల్పించి దేశీయంగా ప్రజల జీవన నాణ్యతను ఇనుమడింపజేస్తామన్న వినసొంపైన మాటలను కేంద్రం కొన్నాళ్లుగా వల్లెవేస్తోంది. వంద లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయ అంచనాలతో కూడిన ఎన్‌ఐపీ విజయవంతం కావాలంటే- అనుమతుల మంజూరులో ఏకీకృత విధానం, పనుల కేటాయింపులూ నిధుల వినియోగంలో జవాబుదారీతనం అత్యావశ్యకం. భూసేకరణ సమస్యాత్మకం కాకూడదంటే- బాధితులకు చెల్లించే పరిహారం న్యాయబద్ధంగా, వారి జీవితాలకు ఆదరువు అయ్యేలా ఉండాలి. పునరావాస ప్యాకేజీల ప్రకటనలో ఆ మానవీయ స్పందన ప్రతిఫలించాలి. పర్యావరణ మార్పులతో మానవాళి భవిత అగమ్యగోచరమవుతున్న పరిస్థితుల్లో- ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే ప్రాజెక్టులకు ప్రత్నామ్నాయాలు అన్వేషించాలి. సమస్యల పరిష్కారాన్ని వాయిదా వేసే ధోరణులను విడనాడి, విచక్షణాయుతంగా శీఘ్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే- నిర్దేశిత గడువులోగా పనులు పూర్తవుతాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు రూపాయి వెచ్చిస్తే- జీడీపీకి అదనంగా రెండున్నర నుంచి మూడు రూపాయలు జమవుతాయని రిజర్వ్‌ బ్యాంకు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ అధ్యయనాలు చాటుతున్నాయి. ఐరాస నివేదిక ప్రకారం- 2050నాటికి పట్టణ భారత జనాభా సుమారు 88కోట్లకు ఎగబాకుతుంది. అందుకు అనుగుణంగా ప్రాథమిక వసతులను తీర్చిదిద్దడంపైనా పాలకులు దృష్టి సారించాలి. పరిమిత వనరులను గరిష్ఠ ప్రయోజనకరంగా వినియోగించుకుంటూ, కాలంచెల్లిన నిబంధనల మాటున నిర్లిప్తంగా పనిచేసే అధికార గణాన్ని అదిలిస్తూ, వివిధ శాఖలను సమన్వయపరుస్తూ- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా చురుగ్గా పనిచేయాలి. అప్పుడే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఆవిష్కారానికి దారులు విస్తారమవుతాయి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని