నీరసించిన పోషక ప్రణాళిక

ఏ జాతికైనా జనారోగ్యమే మహా సౌభాగ్యం. ఆ కలను సాకారం చేయగలిగేదే సమర్థ పౌష్టిక వ్యూహం! ఈ గడ్డమీద కన్ను తెరిచిన ప్రతి బిడ్డా సంపూర్ణ వ్యక్తిగా ఎదగడం కోసం సమస్త సేవలూ సమకూర్చాలన్న ఉదాత్త ఆశయంతో భారతావని ఏనాడో ప్రత్యేక జాతీయ విధానం రూపొందించుకుంది.

Published : 13 Aug 2022 00:58 IST

ఏ జాతికైనా జనారోగ్యమే మహా సౌభాగ్యం. ఆ కలను సాకారం చేయగలిగేదే సమర్థ పౌష్టిక వ్యూహం! ఈ గడ్డమీద కన్ను తెరిచిన ప్రతి బిడ్డా సంపూర్ణ వ్యక్తిగా ఎదగడం కోసం సమస్త సేవలూ సమకూర్చాలన్న ఉదాత్త ఆశయంతో భారతావని ఏనాడో ప్రత్యేక జాతీయ విధానం రూపొందించుకుంది. ఆ స్ఫూర్తికి గొడుగు పడుతూ- గుక్కపెడుతున్న బాల్యాన్ని, తల్లడిల్లుతున్న మాతృత్వాన్ని సాంత్వన పరచేందుకంటూ ఐసీడీఎస్‌ (సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం) 1975 గాంధీ జయంతినాడు ఘనంగా ప్రారంభమైంది. నాలుగున్నర దశాబ్దాల తరవాతా దేశంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ ప్రవచిత లక్ష్య సాధనకు యోజనాల దూరాన నిలిచి నీరోడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మాతాశిశు పోషక ప్రణాళిక చతికిలపడరాదన్న ఉద్దేశంతో దాదాపు మూడు దశాబ్దాల నాడు సర్వోన్నత న్యాయస్థానం తనవంతుగా మార్గనిర్దేశం చేసింది. ఆరేళ్లలోపు పిల్లలతోపాటు కిశోర బాలికలకు బాలింతలకు గర్భిణులకు ఏడాదిలో 300 రోజులదాకా పౌష్టికాహారం సమకూర్చాలని ఉద్బోధించింది. రాష్ట్రాలవారీగా అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులు, ప్రతిష్ఠాత్మక పథకం అమలు తీరుతెన్నులు- రేపటి పౌరుల స్వస్థత, భవితలపై ప్రభుత్వాల దశాబ్దాల అలసత్వానికి చెరగని ఆనవాళ్లుగా దిగ్భ్రాంతపరుస్తున్నాయి. తెలంగాణలోని 35700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 12 వేలకుపైగా అద్దెభవనాల్లోనే నెట్టుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 55వేల కేంద్రాల్లో సగం వరకు సొంత ప్రాంగణాలు కొరవడినవే. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల రాజ్యసభాముఖంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా 13.89 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో 3.5లక్షల దాకా అద్దె ఇళ్లలో కొనసాగుతున్నవే. సొంత భవనాల్లో ఉన్నవీ అనేకం శిథిలావస్థకు చేరి బెంబేలెత్తిస్తున్నాయి. కోట్ల రూపాయల మేర అద్దె బకాయిలు పోగుపడ్డాయన్న కథనాలూ నిశ్చేష్టపరుస్తున్నాయి. అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, బిల్లుల పెండింగ్‌, పోషకాహార పంపిణీలో అవకతవకలది అంతులేని కథ!

బాలబాలికల శారీరక మానసిక ఎదుగుదల కోసం ప్రస్తుతం వెచ్చించే ప్రతి రూపాయీ మున్ముందు 35 రూపాయల మేర లబ్ధి చేకూరుస్తుందన్న అధ్యయనాలు లోగడ వెలుగు చూశాయి. నలభై ఏడేళ్లుగా పదుల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నట్లు గణాంకాలు చాటుతున్నా- నికరంగా ఒరిగిందేమిటి? ఐసీడీఎస్‌ పటుతర నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పకడ్బందీగా ప్రణాళిక రచన, దీటుగా కార్యాచరణ... రెండూ లేవు. మండల గ్రామ స్థాయిలో సరైన పర్యవేక్షణా కరిమింగిన వెలగపండు చందమే. పర్యవసానంగా- దేశంలో పౌష్టికాహార సంక్షోభం ఎంతగా చిలవలు పలవలు వేసుకుపోతున్నదో, అంతగా బాలభారతం రోదిస్తోంది. ఐసీడీఎస్‌ నిర్వహణను చక్కదిద్దేందుకంటూ ఆ మధ్య నీతి ఆయోగ్‌ ఉచిత సలహా ఒకటి దయచేసింది. గ్రామం, నివాస సముదాయాల స్థాయిలో మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహార బాధ్యతల్ని పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకే కట్టబెట్టాలన్న నీతి ఆయోగ్‌- మేట వేసిన ఇతరత్రా సమస్యల్ని గాలికొదిలేసింది. నిధుల లేమి, సిబ్బంది అవినీతి బాగోతాలు, వేతన సమస్యలు, అనుచిత రాజకీయ పెత్తనం... తదితర సమస్యల్ని పరిష్కరించకుండా కేంద్రాలకు తగరపు కిరీటాలు తొడిగి ఉద్ధరించేదేమిటి? నిత్యావసరాలు, గ్యాస్‌ ధరలు ఇంతలంతలైనా అరకొర మెనూ ఛార్జీలే చెల్లిస్తున్న బాగోతాలకు దేశంలో కొదవలేదు. కొవిడ్‌ సంక్షోభవేళ ఏపీ, అస్సాం, బిహార్‌, తమిళనాడు, యూపీ సహా 11 రాష్ట్రాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ అస్తవ్యస్తమై పిల్లల ఎదుగుదల దెబ్బతిన్నదని, ఎందరో గర్భవతులు, బాలింతలు అల్లాడిపోయారని మూడు నెలల క్రితం నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఆ దురవస్థ కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు. అది దేశవ్యాప్త సమస్య. ఇప్పటికీ లక్షలాది అంగన్‌వాడీ కేంద్రాలు కొరతల కొలిమిలో గిడసబారిపోతున్నాయి. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరవాతా గాడిన పడని శిశు సంక్షేమం నేడు జాతి ఎదుట పెనుసవాలుగా నిలిచింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.