Published : 14 Aug 2022 01:10 IST

మానవత్వానికే మాయని మచ్చ

‘నలుసు అనేది ప్రయోగాన్ని బట్టి అర్థం మారిపోయే విశేష పదం...’ నలుసు- కంట్లో పడితే మంట, కడుపులో పడితే పంట’ అనే వాక్యంలో మొదటిది- దుమ్ముకణం. రెండోది పసికందు. ‘పదేళ్లయింది పెళ్లయి, కడుపులో నలుసు పడనే లేదమ్మా’ అని వాపోతారు అమ్మలక్కలు. అపత్యమంటే సంతానం. సంతానం లేని స్థితికి ‘అనపత్యత’ అని పేరు. అనపత్యత ఆవేదనకు దారితీస్తుంది. స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలైతే, ఇల్లాలికి గౌరవ వాచకం తల్లి! ‘తడియొత్తు చీరతో దాది కౌగిట చేర్చి చూపంగ, కన్నార చూడనైతి’ అని కన్నీరు మున్నీరైన కన్నపేగును ఉత్తర హరివంశం కరుణ రసాత్మకంగా చిత్రించింది. కృష్ణుడు సైతం సంతానం కోరి, శివుడి కోసం తపస్సు చేశాడంది. పిల్లల కోసం పరితపించిన దశరథుడు పుత్రకామేష్టి నిర్వహించాడని రామాయణం చెబుతోంది. సంతానం యాదృచ్ఛికం కాదని, అది యజ్ఞఫలమని ఈ జాతి భావించింది. కాబట్టే ‘గర్భాధానాఖ్యం కర్మ కరిష్యే’ అంటూ కలయికను నిర్ణీత శుభవేళ ఒక క్రతువు మాదిరి మంత్రపురస్సరంగా నిర్వహించాలని పెద్దలు నిర్దేశించారు. దాన్ని ‘సంతానయజ్ఞం’ అని నిర్వచించారు. దీపాన్ని మరో దీపంతో వెలిగించే ప్రక్రియగా సంభావించారు. పసికందులతో ఆటపాటలు- ‘అనుదిన సంతోషణములు...’ అనునిత్యం సంతోషదాయకాలు. ‘జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు... శ్రమను అలసటను దుఃఖాన్ని దూరం చేసే ఔషధాలు’ అంది పోతన భాగవతం. ‘జగతి సంతతి లేనట్టి జనుల కలిమి...’ ఎలాంటిదంటే- ‘పాడి పోడిమి లేని వ్యవసాయ గరిమంబు...’ పాడిపంటలు చేతికి అందని రైతు కృషి వంటిదన్నాడు- నయనోల్లాసకర్త. ఇవి పరిహసించడానికి చెప్పిన మాటలు కావు- సంతానం లేనివారి తీవ్ర సంతాపానికి అద్దం పట్టే మాటలు. పెళ్ళిళ్లు నిజానికి పిల్లల కోసమే!

సంతానం కోసం ఇంతగా ఆరాటపడే జాతి... ఆలస్యం అయ్యేసరికి ఆవేదనకు లోనై, కనపడే దేవుడికల్లా మొక్కులు చెల్లించే జాతి... తాయెత్తులు, ఇతర చిట్కాలను ఆశ్రయించే జాతి- తీరా ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం తీరని కలవరపాటుకు గురవుతుంది. అదొక దురదృష్టకర పరిణామం, సాంఘిక దురాచారం. వాస్తవానికి స్త్రీశక్తి అమోఘం. కౌరవపత్నులు అసూయపడేంత అసమాన సుకుమారి ద్రౌపది, ‘దుర్వారోద్యమ బాహు విక్రమ...’ దృఢచిత్తంతో కీచకుణ్ని నిశ్చేష్టుణ్ని చేసిందని భారతం చెప్పింది. ఓరిమికి ప్రతిరూపమైన సీతమ్మ ఆగ్రహాన్ని ఆవాహన చేసుకొనేసరికి- దశకంఠ రావణుడు ఆమె ముందు గడ్డిపరకలా తేలిపోయాడంది రామాయణం. ‘బొమ్మ పెండిండ్లకు పోనొల్లనను...’ కోమలి సత్యభామ జుట్టు ముడిపెట్టి, చీర బిగించి కట్టి, విల్లు చేపట్టి ‘వలయాకార ధనుర్విముక్త విశిఖ వ్రాతా హతారాతియై...’ భీకర పరాక్రమంతో నరకుణ్ని బెంబేలెత్తించిందని భాగవతం వర్ణించింది. ఈనాటి ఆధునిక మహిళలదీ అదే ఆభిజాత్యం, అదే ఆత్మప్రత్యయం, అదే దృఢచిత్తం. ‘ఎన్నో ఏళ్లుగా నిద్రించిన మా వ్యక్తిత్వం తుళ్ళిపడి లేచింది. ఆవులించి జూలు విదిల్చింది...’ అన్న శీలా సుభద్రాదేవి మాటలకు అదే అర్థం. ‘ముదితల్‌ నేర్వగ రాని విద్యగలదే...’ అంటూ చిలకమర్తి చెప్పింది పాత మాట. ‘ముదితల్‌ నేర్పగ లేని విద్యగలదే ముద్దార అర్థించినన్‌’ అనేది నేటి మాట. ఈ నేపథ్యంలో పుట్టింది ఆడపిల్ల అని తెలిసి, ఇంకా బొడ్డు ఊడని పసికందును గోతిలో పాతిపెట్టిన తాజా అమానుష ఆటవిక చర్య లోకాన్ని నివ్వెరపరచింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన మంజు, శైలేష్‌ దంపతులు స్వయంగా నిర్వహించిన అకృత్యమిది. అది మానవత్వానికే మాయని మచ్చ తెచ్చింది. వారు నిలువునా పాతిపెట్టింది దేన్ని? పసికందునేనా...!

 

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని