Published : 15 Aug 2022 00:16 IST

నా దేశం సంస్కార గంగ...

‘పునర్జన్మ అంటూ ఉంటే, ప్రభువును ఏం కోరుకుంటావు’ అని అడిగారు జర్మనీకి చెందిన మాక్స్‌ముల్లర్‌ని ఎవరో. ‘భారతదేశంలో గంగ ఒడ్డున పుట్టించమని ప్రార్థిస్తాను’ అన్నాడాయన. మన మధునాపంతులవారిదీ అదే వరస. ‘ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ పుట్టను! ఈ భారత క్షితిపై వేద పురాణ శాస్త్ర కృతిరాశి స్థానము, ఈ మంగళ క్షితిపై...’ పునర్జన్మను అభ్యర్థించారాయన. కవులు కళాకారులు పాశ్చాత్యులు భారతీయులు... ఎవరిని అడిగినా ఇదే ధోరణి. ఏమిటిదంతా? ఈ గాలిలోంచి, ఈ మట్టిలోంచి, ఈ జలాల్లోంచి- మన శరీరాల్లోని జీవాణువులు ఏమి పీల్చుకొంటున్నాయి? అమోఘమైన ఏ విశ్వచైతన్యపు సూక్ష్మాతి సూక్ష్మమైన అణురజం మన రక్తంలోకి ఇంకిపోతోంది? మానవత్వపు మహా ఇతిహాసాల సారం లాగా- ఉత్ప్రేరకమై మనల్ని మహోన్నత శిఖరాల దిశగా ప్రయాణానికి పురిగొల్పుతున్నదేమిటి? మహాపురుషుల ఉనికిలోని ఏ వైశిష్ట్యం మన దేశానికి విశ్వంలో పూజార్హతను ఆపాదించింది? ఆయా దేశాలు మన భారత్‌ వైపు చూపు సారించడానికి దోహదం చేసిన అంశం ఏమిటి? జాతి గుండెల్లో జాతీయ వాదాన్ని నింపి, స్వరాజ్య సమరోద్యమ చైతన్యాన్ని అద్దే మన అందరి పండగ- జెండా పండగ రోజున మనం ఆలోచించవలసిన అంశాలివి! జాతీయ పతాకం కంటపడితే చాలు- మన వెన్నెముక నిటారుగా నిలవడానికి కారణం ఏమిటి? రోమరోమం పులకరించడానికి, స్వాభిమానం ఉరకలెత్తడానికి హేతువు ఏది? జెండాను చేతపూనితే చాలు- మన నడకే మారిపోతోందే... ఎందుకు? అమృతోత్సవాల వేళ, శత వసంత మహోత్సవాలకు పునరంకితం కావలసిన శుభవేళలో మనం నిశ్చయంగా తేల్చుకోవలసిన అంశాలివి!

ఈసారి జెండా పండగకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాబోయే స్వరాజ్య శత వసంతోత్సవాలకు నాంది. ‘వజ్ర’ సంకల్పానికి పునాది. ‘వీరగంధము తెచ్చినారము, వీరులెవ్వరొ తెలుపుడీ- పూసిపోతము’ అంటూ దేశ మాత ఎదురు చూస్తోంది. అలనాటి సమరోద్యమ దీప్తిని, ఆ ఆశయాల జ్యోతిని అందిపుచ్చుకొని, ముందుకు సాగేందుకు సరైన తరుణమిది. ఇది దేశ రుణ విముక్తికై రణం. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేది అలనాటి బృహన్నినాదం. ‘సురాజ్యం నా జన్మహక్కు’- ఈ తరానికి పరమపథం. ఈ తరహా అమృత భావన- భావి పౌరుల ఆభిజాత్యంగా, ఆత్మ ప్రత్యయంగా ఆవిష్కారం కావడమే మనం నిర్వహించిన అమృతోత్సవాల పరమావధి. సాంస్కృతిక యాగాల ఫలశ్రుతి. అందుకు తగిన విత్తులను యువతరం హృదయ క్షేత్రాల్లో సక్రమంగా మొలకెత్తించేందుకై విశేష కృషి చేసింది- ఏడాదిగా అమృతోత్సవ గారాబు మబ్బు తునక! శత వసంతోత్సవాల నాటికి ఈ దీక్ష ఫలించి, ఈ బీజాంకురాలు అమృత ఫలాలను దేశానికి అందించాలి. కాబట్టే ఈసారి జెండా పండగ దేశ చరిత్రలో కీలకమైన మలుపు. ఇది దేశం పిలుపు. గెలుపుకోసం పడుచు రక్తం ఉరకలెత్తాలి. సురాజ్య స్థాపన దిశగా దేశం సరికొత్త ప్రణాళికలు రచించాలి. సమరయోధుల త్యాగఫలాలు గడపగడపకూ అంది తీరాలన్నది- నేటి జెండా పండగనాటి శపథం కావాలి. స్వేచ్ఛా భారతం- ఈ 75 ఏళ్లలో అగ్రరాజ్యాలకు సైతం తమ బుద్ధికుశలతను పంచి ఇవ్వగల మహా మేధావులను రూపొందించింది. అమృతోత్సవ భారతం- సురాజ్య స్థాపనకు అంకితమయ్యే దేశభక్తులను, త్యాగమూర్తులను రూపొందించే కృషిలో నిమగ్నం కావాలి. రాబోయే పాతికేళ్లలో దేశాన్ని మరింత సమున్నత శిఖరాలకు చేర్చడమే మన ధ్యేయం. అదే మన గమ్యం. మేరా భారత్‌ మహాన్‌!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని