Published : 17 Aug 2022 00:19 IST

డిజిటల్‌ దొంగల అభయారణ్యం

సుమారు నూట పదిహేను కోట్ల మొబైల్‌ కనెక్షన్లు, ఎనభై కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులకు ఆవాసమైన ఇండియా... సైబర్‌ నేరగాళ్ల క్రీడాంగణంగా ఏనాడో పరువుమాసింది. ప్రజల అమాయకత్వం, వ్యవస్థాగత లోపాల దన్నుతో కొన్నేళ్లుగా చెలరేగిపోతున్న డిజిటల్‌ దొంగలు- పోలీసులపై ప్రాణాంతక దాడులకూ తెగబడుతుండటం తీవ్రంగా కలవరపరుస్తోంది. బిహార్‌లోని నవాదా జిల్లాలో భారీగా తిష్ఠవేసిన సైబర్‌ చోరులు- వాహనాల విక్రయం, డీలర్‌షిప్పుల పేరిట తెలుగు రాష్ట్రాల్లో అనేకులను లూఠీ చేశారు. అటువంటి ఒక కేసులో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నవాదా జిల్లాలోని భవానీబిఘా గ్రామానికి తెలంగాణ, స్థానిక పోలీసులు మూడు రోజుల క్రితం వెళ్ళారు. అక్కడ వారిపై దుండగులు ఏకంగా కాల్పులకు దిగడం- అడ్డూఆపూ లేని నేర తండాల బరితెగింపునకు అద్దంపడుతోంది. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లోనూ లెక్కికుమిక్కిలిగా పోగుపడిన సైబరాసుర సంతతి- ఎప్పటికప్పుడు సరికొత్త వంచనా వ్యూహాలతో జనం సొమ్మును భారీయెత్తున కొల్లగొడుతోంది. సామాజిక మాధ్యమాల మాటున మాయవలలు విసురుతున్న అక్రమార్కుల సంఖ్య సైతం కొన్నాళ్లుగా అధికమవుతోంది. ఆ మిన్నాగుల పన్నాగాలపై అవగాహన కల్పించి, నేరాల నియంత్రణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం ఒక వినూత్న కృషికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వంద మంది చొప్పున 1650 ఉన్నత పాఠశాలలకు చెందిన 3300 పిల్లలను ‘సైబర్‌ అంబాసిడర్లు’గా ఎంపిక చేసి, మేలిమి శిక్షణను అందించింది. డిజిటల్‌ ప్రపంచంలో ఎంతటి అప్రమత్తతతో మెలగాలో నవతరానికి నేర్పించే ఆ ప్రశంసనీయ కార్యక్రమ స్ఫూర్తిని మిగిలిన రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాలి. ‘సైబర్‌ జాగరూక్తా దివస్‌’ పేరిట ప్రతి నెలా మొదటి బుధవారం ఉన్నత విద్యాసంస్థల్లో అంతర్జాల భద్రతా పాఠాల బోధనకు కేంద్ర విద్యాశాఖ ఇటీవల వార్షిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. సైబర్‌ బందిపోట్ల బారినుంచి ప్రజల కష్టార్జితానికి రక్షణ సమకూరాలంటే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా జనచేతనకు ప్రోదిచేయాలి. అత్యాధునిక సాధన సంపత్తితో నేరస్తులను సత్వరం గుర్తిస్తూ, వారిపై ఉక్కుపాదం మోపాలి!

గతేడాది ప్రపంచవ్యాప్త డిజిటల్‌ చెల్లింపుల్లో నలభై శాతం ఇండియాలోనే చోటుచేసుకున్నాయి. 2021లో 30 వేల కోట్ల డాలర్లుగా ఉన్న ఆ చెల్లింపుల విలువ- 2026 నాటికి అంతకు మూడు రెట్లకు పైగా ఎగబాకవచ్చునని వివిధ అధ్యయనాలు చాటుతున్నాయి. డిజిటలీకరణ వైపు భారత పురోభివృద్ధికి సైబర్‌ నేరాలు ప్రతిబంధకాలవుతున్నాయి. పన్నెండు నెలల వ్యవధిలో దేశీయంగా ప్రతి పది మంది వినియోగదారుల్లో ఏడుగురిని సాంకేతిక మాయగాళ్లు లక్ష్యాలుగా చేసుకున్నారని మైక్రోసాఫ్ట్‌ సర్వే నిరుడు నిగ్గుతేల్చింది. ఆసియా మొత్తమ్మీద సైబర్‌ దాడులకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో ఇండియా ఒకటి అని ఐబీఎం ఎక్స్‌-ఫోర్స్‌ అధ్యయనం ఇటీవల వెల్లడించింది. మరోవైపు... 2019, 2020లలో సైబర్‌ నేరాలపై దేశవ్యాప్తంగా 94,770 కేసులు నమోదైతే- అందులో నాలుగో వంతు వాటిలోనూ ఛార్జిషీట్లు నమోదు కాలేదు. శిక్షలు పడినవి కేవలం 1477! ఖాకీల నిష్క్రియాపరత్వంతో పలు ప్రాంతాల్లో నేరగాళ్ల దోపిడి పర్వాలు అధికారిక గణాంకాల్లోకి ఎక్కడం లేదు. అదే సమయంలో విదేశాల నుంచి స్థానిక వెబ్‌సైట్లు, వ్యవస్థలపై లక్షిత దాడులూ విచ్చలవిడిగా సంభవిస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే- నైపుణ్యవంతులైన సైబర్‌ సైనికులను విరివిగా తీర్చిదిద్దుకోవాలి. తీవ్రవాదంపై పోరుకు గతంలో ప్రత్యేక మౌలిక వసతుల పథకాన్ని కేంద్రం పట్టాలకెక్కించింది. జాతీయ భద్రతకు సవాలు విసురుతున్న సైబర్‌ ఉగ్రవాదంపై యుద్ధంలో విజయం సాధించాలంటే- అటువంటి పథకం అత్యావశ్యకం అంటున్న నిపుణుల సూచనలకు ఇకనైనా మన్నన దక్కాలి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts