భారత భద్రతకు చైనా పెనుసవాలు

ఇండియా, చైనాల నడుమ ఘర్షణలకు హిందూ మహాసముద్రం మరో కూడలి కానుందా? భారత విదేశాంగ శాఖామాత్యులు ఎస్‌.జైశంకర్‌ను తాజాగా అదే ప్రశ్న అడిగితే- అలా అనుకోవడం సరికాదు అంటూనే, ఆ ప్రాంత ప్రాధాన్యం దృష్ట్యా సంక్షోభాలు తలెత్తవచ్చునని బదులిచ్చారు.

Published : 18 Aug 2022 01:38 IST

ఇండియా, చైనాల నడుమ ఘర్షణలకు హిందూ మహాసముద్రం మరో కూడలి కానుందా? భారత విదేశాంగ శాఖామాత్యులు ఎస్‌.జైశంకర్‌ను తాజాగా అదే ప్రశ్న అడిగితే- అలా అనుకోవడం సరికాదు అంటూనే, ఆ ప్రాంత ప్రాధాన్యం దృష్ట్యా సంక్షోభాలు తలెత్తవచ్చునని బదులిచ్చారు. ‘ఇండియన్‌ ఓషన్‌ అంటే ఇండియా కడలి కాదు’ అని కొన్నాళ్లుగా హుంకరిస్తున్న డ్రాగన్‌- సామ దానాది ఉపాయాల ద్వారా ఇప్పటికే ఆ ప్రాంతంపై తన భల్లూకం పట్టును బిగిస్తోంది. భారత దేశ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అత్యాధునికమైన తన నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’కు శ్రీలంకలోని హంబన్‌టొట రేవులో చైనా మొన్న లంగరు వేసింది. భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో, భారత్‌కు అతి సమీపంలో ఉన్న హంబన్‌టొట నౌకాశ్రయం- రాజపక్స కుటుంబ ఏలుబడిలో ప్రధానంగా డ్రాగన్‌ రుణాలతోనే నిర్మితమైంది. ఆ అప్పులను లంక సర్కారు తిరిగి చెల్లించలేక... 99 ఏళ్ల లీజుకు గతంలోనే ఆ రేవును బీజింగ్‌కు ధారాదత్తం చేసింది. నేడు అక్కడ పాదంమోపిన ‘యువాన్‌ వాంగ్‌ 5’కు అంతరిక్షం, ఉపగ్రహాలు, క్షిపణులపై మూడో కన్ను వేయగలిగిన సత్తాతో పాటు 750 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను తన చారచక్షువులతో జల్లెడపట్టే సామర్థ్యం ఉన్నట్లుగా చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కీలక రేవులు, అణు పరిశోధనా కేంద్రాలు, నౌకాదళ స్థావరాలన్నీ ప్రస్తుతం దాని పరిధిలోకి వచ్చినట్లుగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తామేమీ నిఘాకు పాల్పడటం లేదంటున్న డ్రాగన్‌ వర్గాలు- భద్రతాపరమైన భారతదేశ భయాందోళనలను అభూతకల్పనలుగా కొట్టిపారేస్తున్నాయి. గడచిన పన్నెండేళ్లలో ఇండియా, అమెరికాతో పాటు బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ తదితర దేశాలకు చెందిన రెండొందలకు పైగా యుద్ధనౌకలు తమ తీరానికి వచ్చాయని సన్నాయినొక్కులు నొక్కుతూ- ‘యువాన్‌ వాంగ్‌ 5’ రాకను సాధారణీకరించేందుకు కొలంబోలోని చైనీస్‌ అనుకూల వర్గాలు ఆపసోపాలు పడుతున్నాయి. హంబన్‌టొట లీజు మాటున ఆ రేవులో సైనిక కార్యక్రమాలను చైనా విస్తృతం చేయగల వీలుంది. దాని అండదండలతో పాకిస్థాన్‌ నౌకాదళానికి భవిష్యత్తులో ఆ నౌకాశ్రయం విడిది అయ్యే ప్రమాదాన్నీ కొట్టిపారేయలేం. శత్రువులు అలా మన ముంగిట్లో శాశ్వతంగా తిష్ఠవేయకుండా- ‘క్వాడ్‌’ మిత్రులతో కలిసి బీజింగ్‌ దూకుడును ఇండియా అడ్డుకోవాలి. చైనా సరిహద్దుల్లోని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ... ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి!

ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో చైనా ముఖం చాటేసినా, లంకకు సుమారు నాలుగు వందల కోట్ల డాలర్ల వరకు ఇండియా సాయం చేసింది. అయినప్పటికీ డ్రాగన్‌ రుణవలలో చిక్కిన ఆ దేశానికి చైనా మాటను జవదాటే పరిస్థితి లేదు. శ్రీలంక నెత్తిన ఉరుముతున్న 5100 కోట్ల డాలర్ల విదేశీ రుణభారంలో దాదాపు పదిశాతం చైనా దగ్గర చెయ్యిచాచి పొందినదే! ఆర్థికంగా దివాలా తీసిన దుస్థితిలో ఆ బకాయిలను పునర్‌ వ్యవస్థీకరించేందుకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం అందుకునేందుకు కొలంబోకు బీజింగ్‌ తోడ్పాటు అనివార్యంగా మారింది. ఈ వాతావరణంలో లంక నాయకత్వంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆ దేశం వేదిక కాకుండా కాచుకోవాలి. డ్రాగన్‌ పన్నాగాలకు పూర్తిస్థాయిలో విరుగుడు సాధించాలంటే- దానికి దీటుగా సొంత నౌకాదళాన్ని ఇండియా బలోపేతం చేసుకోవాల్సిందే. భారత దేశంతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా 355 యుద్ధనౌకలను తన అమ్ములపొదిలో చేర్చుకున్న  చైనాను నిలువరించేలా- రక్షణ రంగ బడ్జెట్‌లోంచి కేటాయింపులను ఇతోధికం చేసి, నౌకదళాన్ని ఆధునికీకరించాలి. కృత్రిమ దీవుల నిర్మాణం, విస్తరణ వ్యూహాలతో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ ఏనాడో కుంపట్లు రాజేసింది. హిందూ సంద్రంలో దాని కపట వ్యూహాలను ఛేదించాలంటే- తిరుగులేని సాగరశక్తిగా ఇండియా తనను తాను సత్వరం తీర్చిదిద్దుకోవాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.