బూజుపట్టిన చదువులు

‘నవ భారతానికి నూతన పాఠ్యప్రణాళిక’ను అందించేందుకు అంటూ పిల్లల పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులకు తెరతీసిన కేంద్రం- ఆ క్రతువుపై తాజాగా జనాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ సర్వేలోని పది ప్రశ్నల్లో ఒకటి... పాఠశాల విద్యనుంచి మన సమాజం ఆశిస్తున్నదేమిటి? నేటి చిన్నారులు రేపటికి బాధ్యతాయుత పౌరులుగా

Published : 19 Aug 2022 00:53 IST

‘నవ భారతానికి నూతన పాఠ్యప్రణాళిక’ను అందించేందుకు అంటూ పిల్లల పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులకు తెరతీసిన కేంద్రం- ఆ క్రతువుపై తాజాగా జనాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ సర్వేలోని పది ప్రశ్నల్లో ఒకటి... పాఠశాల విద్యనుంచి మన సమాజం ఆశిస్తున్నదేమిటి? నేటి చిన్నారులు రేపటికి బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేందుకు నైతిక విలువల ఉగ్గుపాలు పట్టించడం; విద్యార్థుల ఆసక్తులు, అంతర్గత నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం; పుటల కొద్దీ సమాచారాన్ని పిల్లల బుర్రల్లో వట్టిగా కూరకుండా... సమకాలీన పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలో నేర్పడం; విమర్శనాత్మక ఆలోచన- సమస్యా పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేలా పిల్లల భావోద్వేగ, బుద్ధి కుశలతలకు సానపట్టడం; క్రమంతప్పని వ్యాయామమూ క్రీడాసాధనలతో ఆరోగ్య స్పృహను కలిగించడం వంటి వాటికే కదా వాస్తవంగా బడులు వేదికలు కావాలి! కానీ, ఏడున్నర దశాబ్దాలుగా దేశీయంగా జరుగుతున్నదేమిటి? పాలకపక్షాల ఆలోచనలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలను తయారు చేయడం, ఉపాధ్యాయుల చేతుల్లో కొన్ని పుస్తకాలు పెట్టి వాటినే బోధించమనడం, ఆయా పాఠాలను పిల్లలు బట్టీ పట్టడం, అంతిమంగా ర్యాంకులతో వారి తెలివితేటలను నిర్ధారించడం- బూజుపట్టిన ఈ విధానమే ఆసేతుహిమాచలం అమలవుతోంది. నిర్వచనాలూ సిద్ధాంతాలను వల్లెవేసే రొడ్డకొట్టుడు పద్ధతి కాకుండా- అనువర్తిత ఆధారిత అభ్యాస ప్రక్రియకు చైనా పట్టంకడుతోంది. చిన్నారుల సృజనాత్మకతను వెలికితీసే కార్యస్థలాలుగా తన పాఠశాలలను దక్షిణకొరియా రూపుదిద్దింది. ప్రతి విషయాన్నీ పిల్లలు తమంతట తాము తెలుసుకునేలా ఆచరణాత్మక విద్యకు ఫిన్‌లాండ్‌ ప్రాధాన్యమిస్తోంది. సింగపుర్‌, జపాన్‌, కెనడా, డెన్మార్క్‌, పోలండ్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఎస్తోనియా తదితరాలూ ఆ మేరకు చక్కటి చదువులతో చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు బాటలు పరుస్తున్నాయి. పిల్లల పాఠాలకు రాజకీయ భావజాల రంగులు అద్దకుండా- అనుసరణీయమైన ఆయా దేశాల విధానాలను మనం అందిపుచ్చుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వం, ఉపాధి వేటలో గెలుపొందగలిగే తెలివిడిని భావితరానికి అందించగలిగేలా... పాఠ్యపుస్తకాల్లోని ప్రతి పుటనూ స్పష్టమైన సహేతుకమైన లక్ష్యంతో తీర్చిదిద్దాలి. అప్పుడే పదిహేడేళ్ల విరామానంతరం జాతీయ పాఠ్యప్రణాళిక చట్రంపై కేంద్రం చేపట్టిన కసరత్తు మేలిమి ఫలితాలను అందించగలుగుతుంది!

చీకటి కొట్టాల్లో నాటిన మొక్కలు... చెట్లుగా ఎదగలేవు. ఆహ్లాదాన్ని ఆమడ దూరంలో ఉంచే చదువులు- చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి చుక్కానులు కాలేవు. ఇండియాలోని ప్రతి అయిదుగురు కిశోర బాలబాలికల్లో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని బెంగళూరు ‘నిమ్‌హాన్స్‌’ అధ్యయనం తేల్చింది. శారీరక శ్రమ, మంచి ఆహార అలవాట్లు కొరవడటం వంటి వాటితో దేశీయంగా 1.44 కోట్ల చిన్నారులు స్థూలకాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... పన్నెండేళ్ల వయసులోనే టైప్‌2 మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోందనే కథనాలూ కలవరపరుస్తున్నాయి. పరీక్షల్లో మార్కుల పేరిట పొద్దస్తమానం పుస్తకాలతో కుస్తీ పట్టించే దుర్విధానాలే- పిల్లలపై ఒత్తిడి పెంచుతూ, వారి ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. భావిభారతం శ్రేయస్సుకు ఏమాత్రం దోహదపడని అటువంటి మొరటు విద్యావిధానాన్ని వదిలించుకోవాలన్న నిపుణుల సూచనలు కొన్నేళ్లుగా బుట్టదాఖలవుతున్నాయి. బోధనా సిబ్బంది వృత్తి నైపుణ్యాలకు కాలానుగుణంగా మెరుగులు దిద్దే సరైన వ్యవస్థ కరవై- అత్యధిక విద్యాలయాల్లో మూస బోధనా పద్ధతులే కొనసాగుతున్నాయి. పునాది స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన- చిన్నారుల మేధావికసనానికి చోదకశక్తి అవుతుందనే శాస్త్రీయ పరిశోధనలకూ మన్నన దక్కడం లేదు. జీవితాంతం గుర్తుండేలా ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన కల్పించే పాఠ్యప్రణాళిక, సొంత కాళ్లపై నిలబడగలిగే శక్తిని సమకూర్చే వృత్తివిద్యల మేళవింపుతో చదువులను పునర్‌ నిర్వచించాలి. ఆత్మనిర్భర భారతావని నిర్మాణంలో కీలక సాధనాలుగా పాఠశాలలు కొత్త రూపు దాల్చాలంటే- ప్రభుత్వపరంగా విశేష కృషి తప్పనిసరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.