దురాశ దుఃఖానికి చేటు

మనిషికి ఆశ ఉండటంలో తప్పు లేదు. ఆశ కాదు- అత్యాశ చెడ్డది. ‘ఆశ వలయు కూడదు అత్యాశ మాత్రమే’ అన్న నార్ల మాటలోని ఆంతర్యం అదే. ‘తన నుదిటిపై విధాత ఎంత రాశాడో- అంత మాత్రమే తనది’

Published : 28 Aug 2022 00:55 IST

మనిషికి ఆశ ఉండటంలో తప్పు లేదు. ఆశ కాదు- అత్యాశ చెడ్డది. ‘ఆశ వలయు కూడదు అత్యాశ మాత్రమే’ అన్న నార్ల మాటలోని ఆంతర్యం అదే. ‘తన నుదిటిపై విధాత ఎంత రాశాడో- అంత మాత్రమే తనది’ అనుకోవడం సత్పురుష లక్షణం. అందుకే ‘వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ, కొంచెమో- మరుభూమికి ఏగిన లభించును... మేరువు చేరబోయినన్‌ ధనము అధికంబు రాదు... దైన్యము మానుము’ అంటూ భర్తృహరి హితవు పలికాడు. ‘శృంగార ప్రకాశం’లో భోజుడు మరో మనోజ్ఞమైన కవితాభివ్యక్తిని పరిచయం చేశాడు. గడుసుపిల్ల తొలిసారి గర్భం దాల్చింది. వరసైన పడుచు పిల్లలు ఆమెను చుట్టుముట్టి ఆటపట్టిస్తున్నారు. ‘మొదటిసారి గర్భిణియైన ముగ్ధ గాంచి, ఇంతి! ఏమి వస్తువులు నీకు ఇష్టమనగ...’ ఆమె పన్నెత్తి పలుకనే లేదు. ‘నాతి చూపులు ప్రసరించె నాథు దిశగ!’ భర్తవైపు తన చూపులు ప్రసరించిందట. అది ఎనలేని సంతృప్తికి సంకేతం. కోరడానికి ఏమీ మిగల్లేదన్న ఒకానొక సాఫల్యతా స్ఫూర్తిని ప్రకటించిన సొగసైన ఉదంతం. యజ్ఞపురుషుడి నుంచి పాయస పాత్రను అందుకొన్నప్పటి దశరథుడి సంతృప్తి వంటిదది. భర్తృహరి పై సుభాషితాన్ని తమ మనుగడకు అన్వయించుకొన్న మనుషులకు జీవితమే ఒక పాయస పాత్ర. తమకు దక్కిందేదో- అదే యజ్ఞ ప్రసాదం! అలాంటివారు ‘లేనివారు’ కారు- ‘అక్కర లేని’వారు, అత్యాశను జయించినవారు. మాటల్లో చెప్పినంత తేలిక కాదది. జీవితంలో చక్కని పరిణతిని సాధించినవారికి మాత్రమే దక్కే అనిర్వచనీయమైన సంతృప్తి అది. ‘మనమా! వద్దిక, నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా’ అంటూ తిరుపతి వేంకటకవులు మనసును అనునయించింది- అత్యాశ విషయంలోనే!

అత్యాశ ఎంతటి అనర్థానికి దారితీస్తుందో భారతం శాంతిపర్వంలో భీష్ముడు వివరించాడు. ‘ఇంద్రియ జయము వినాశము పొందించు’ అన్నాడాయన ధర్మరాజుతో. ‘విత్తజాడ్య హత బుద్ధులకు(ధన మద అంధులకు) కులాభిమానమున్‌ పస చెడ సేవ చేసితి...’ వంశ, జాతి, ఆత్మగౌరవాలన్నీ అంతరించిపోయేంతగా ఎవడికి పడితే వాడికి సేవ చేశాను, మానం అభిమానం వదులుకొన్నాను... అయినా ఓ ఆశా! నన్ను నీవు విడిచిపెట్టడమే లేదు... ‘ముదమందగదే దురాశరో...’ ఇక నన్ను విముక్తుణ్ని చేయి’ అంటూ హృదయవిదారకంగా ప్రాధేయపడ్డాడు వైరాగ్య శతకంలో ఏనుగు లక్ష్మణకవి. ‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న ఆర్యోక్తిలోని అంతరార్థం అదే. అత్యాశ కొన్ని సందర్భాల్లో అంధవిశ్వాసాలకు సైతం ఆజ్యం పోస్తుంది. ‘నిధియను శంక భూతలము నిచ్చలు త్రవ్వితి...’ లంకెబిందెలు లభిస్తాయని, నిధులు దక్కుతాయని ఇల్లూ వాకిలీ తవ్వి పోయిస్తుంది. నియమనిష్ఠలతో... ‘ఘోరమంత్ర జపము అర్థిన్‌ ఒనర్చితి...’ అర్ధరాత్రి అపరాత్రి శ్మశానాల్లో శ్రద్ధగా క్షుద్రపూజలు చేయిస్తుంది. ఇవన్నీ ఏ కాలానివో అనుకోకండి- ఈ మధ్యనే మహారాష్ట్రలోని పుణెలో డబ్బుమీద దురాశతో ఓ భర్త అందరూ చూస్తుండగా తన భార్యను నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. తనకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించాలని ఓ మాంత్రికుడు చెప్పాడట. దానిలో భాగంగా ఆ భర్త ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ఎవరూ అడ్డుకోలేదు సరికదా, అతడి తల్లిదండ్రులు ఎంతో సహకరించారట కూడా! ‘తలకక(వెనకాడకుండా) ఇంక ఏ పనికి తార్చెదు నన్ను దురాశ! నీవు’ అంటూ ఏనాడో భర్తృహరి మొత్తుకొన్న దురంతం ఈ కాలంలోనూ జరగడమే హేయం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.