నగుబాట్ల నగర భారతం!

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ వ్యవస్థ మనది. విశ్వవ్యాప్త నగర ప్రజానీకంలో సుమారు 11శాతానికి ఇండియాయే ఆవాసం. భారత భూభాగంలో కేవలం మూడు శాతాన్ని ఆక్రమిస్తున్న నగరాలే- సుమారు అరవై శాతం జీడీపీని సమకూరుస్తున్నాయి.

Updated : 23 Sep 2022 06:03 IST

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ వ్యవస్థ మనది. విశ్వవ్యాప్త నగర ప్రజానీకంలో సుమారు 11శాతానికి ఇండియాయే ఆవాసం. భారత భూభాగంలో కేవలం మూడు శాతాన్ని ఆక్రమిస్తున్న నగరాలే- సుమారు అరవై శాతం జీడీపీని సమకూరుస్తున్నాయి. కానీ, ఆనందదాయకమైన ఆరోగ్యకర ప్రజాజీవనానికి పట్టుగొమ్మలుగా నిలవడంలో మాత్రం అవి ఘోరంగా  విఫలమవుతున్నాయి. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యాభై అత్యుత్తమ నగరాల జాబితాలో మనవి ఏవీ లేవని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆ మధ్య ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏదో తూతూమంత్రం పనులతో సరిపుచ్చకుండా- తీరైన పట్టణ ప్రణాళికలకు పురపాలకులు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపిచ్చారు. రహదారులు, వీధి దీపాలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల వంటి ప్రాథమిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అభివృద్ధి కార్యకలాపాలకు కాసుల కొరత, అంతులేని అక్రమాలతో చెదలుపట్టిన చరిత, అక్రమార్కులను ముందుండి నడిపించే సిబ్బంది ఘనతలకు వాసికెక్కిన స్థానిక సంస్థలు- పట్టణ భారతానికి భాగ్యవిధాతలు కాగలుగుతాయా? పోనుపోను పెచ్చరిల్లుతున్న గ్రామీణ ఆర్థిక సంక్షోభం మూలంగా వలసవస్తున్న జనసామాన్యానికి నగరాల్లో కనీస మౌలిక సదుపాయాలను కొలువు తీర్చేందుకు పురపాలక సంఘాల శక్తియుక్తులు సరిపోతాయా? సమధికంగా ఆర్థిక సాయం చేస్తూ, సమగ్ర జాతీయ విధానంతో కేంద్రమే అందుకు మార్గదర్శకత్వం వహించాలి. నిధుల అందుబాటులో తమవంతు తోడ్పాటును అందిస్తూ- పురపాలనలో అవినీతి చెత్తను ఊడ్చివేసేందుకు రాష్ట్రాలు నడుంబిగించాలి. ప్రభుత్వాల స్థాయిలో ఆ సమన్వయం, నిర్దేశిత గడువులతో కూడిన లక్ష్యాలు, వాటిని చేరుకోవడంలో చిత్తశుద్ధి... ఇవే- పట్టణాల తలరాతలను మార్చి, సుస్థిరాభివృద్ధి కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దగలుగుతాయి!

నగర రాజ్యమైన సింగపుర్‌-  తన పరిమిత భూ వనరులను వర్తమాన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తగా వినియోగించుకుంటోంది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రణాళికల నడుమ సమతౌల్యం పాటిస్తూ- ప్రగతి చోదకశక్తిగా తన పరపతిని పెంచుకుంటోంది. సుమారు కోటి జనాభా కలిగిన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌- పట్టణ నిర్వహణ, నివాస ప్రాంత ప్రణాళికలతో జనజీవనాన్ని సుఖమయం చేస్తోంది. మేలిమి ప్రజారవాణా వసతులు ఆ నగర ఖ్యాతిని ద్విగుణీకృతం చేస్తున్నాయి. జపాన్‌ వంటి ఎన్నో దేశాలూ ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణతో అభివృద్ధి పథంలో అద్భుతంగా పురోగమిస్తున్నాయి. తద్భిన్నంగా భారతదేశంలోని 7933 పట్టణ ఆవాస ప్రాంతాల్లో 65శాతానికి బృహత్‌ ప్రణాళికలే కొరవడ్డాయి.  దేశవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా టౌన్‌ ప్లానర్లు అత్యావశ్యకమైతే- వివిధ అంచెల్లో మంజూరైన పోస్టులు నాలుగు వేల లోపేనని, వాటిలోనూ దాదాపు సగం ఖాళీగా పడిఉన్నాయని నీతి ఆయోగ్‌ నిరుడు లెక్కతేల్చింది. ఉత్తమ పట్టణ ప్రణాళికలకు ప్రాణంపోసే నిపుణ మానవ వనరులను తీర్చిదిద్దుకోవడంలో దేశ దౌర్భాగ్యంపైనా ఆ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. పట్టించుకునే నాథుడు లేక జలవనరులు ఆక్రమణల పాలవుతున్న దుస్థితిలో- భారతీయ నగరాలు తరచూ భారీ వరదలు మోసుకొచ్చే పెనువిషాదాల్లో చిక్కుకుంటున్నాయి. కాలుష్య కాసారాలుగా కునారిల్లుతూ జనారోగ్యాన్ని అవి పలు జబ్బుల పాల్జేస్తున్నాయి. నాణ్యమైన జనజీవనానికి నెలవులుగా పట్టణాలు పరిఢవిల్లాలంటే- పురపాలనా చట్టాలను నవీకరిస్తూ, రాబోయే వందేళ్ల కాలానికి తగినట్లుగా బృహత్‌ ప్రణాళికలను తీర్చిదిద్దుకోవాలి. పేదరిక నిర్మూలన, జీవన భద్రత, పర్యావరణ పరిరక్షణలకు పట్టణాభివృద్ది విధానాల్లో పెద్దపీట దక్కాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.