తెలుగువారికి తలవంపులు

మూడేళ్ల విరామానంతరం అంతర్జాతీయ క్రికెట్‌ పోటీకి ఆతిథ్యమిచ్చే అవకాశం భాగ్యనగరానికి దక్కిందని ఉప్పొంగిపోయిన అశేష క్రీడాభిమానులకు మింగుడుపడని పరిణామమిది. ఆస్ట్రేలియా ఇండియా జట్లమధ్య టీ20 హోరాహోరీ, అందునా ఆదివారంనాడు అనేసరికి

Published : 24 Sep 2022 01:56 IST

మూడేళ్ల విరామానంతరం అంతర్జాతీయ క్రికెట్‌ పోటీకి ఆతిథ్యమిచ్చే అవకాశం భాగ్యనగరానికి దక్కిందని ఉప్పొంగిపోయిన అశేష క్రీడాభిమానులకు మింగుడుపడని పరిణామమిది. ఆస్ట్రేలియా ఇండియా జట్లమధ్య టీ20 హోరాహోరీ, అందునా ఆదివారంనాడు అనేసరికి టికెట్లకోసం ఉరకలెత్తిన జనం వీపులపై పోలీస్‌ లాఠీలు తాండవమాడాయి. తొక్కిసలాటలో గాయపడి కొంతమంది ఆస్పత్రిపాలయ్యారు. లేకలేక మ్యాచ్‌ నిర్వహణకు అవకాశం వచ్చిన దృష్ట్యా, విపరీతమైన జనాదరణను పరిగణనలోకి తీసుకుని సకల జాగ్రత్తలూ పాటించాల్సిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) స్వీయబాధ్యతను దులపరించేసుకుంటోంది. టికెట్‌ విక్రయాల బాధ్యతను పేటీఎం సంస్థకు అప్పగించామన్న హెచ్‌సీఏ సారథి అజారుద్దీన్‌, ఆ సంస్థ అద్భుతంగా పనిచేసిందని కితాబివ్వడం విడ్డూరంగా ఉంది. అంతా సవ్యంగానే జరిగితే- టికెట్ల విక్రయాల్లో పారదర్శకత కొరవడిందని, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వెల్లువెత్తిన ఆరోపణల మాటేమిటి? ఆన్‌లైన్‌లో విక్రయాలను పేటీఎం ఆరంభించాక నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ అయిపోయాయన్న సందేశాన్ని ప్రదర్శించారు. గుండె మండి సికింద్రాబాద్‌ జింఖానా మైదానాన్ని అభిమాన జనసంద్రం ముట్టడించేసరికి ప్లేటు ఫిరాయించిన హెచ్‌సీఏ మళ్ళీ పరిమిత విక్రయాలు మొదలుపెట్టింది. అక్కడా గందరగోళమే రాజ్యమేలింది. ఉప్పల్‌ స్టేడియంలో దిగ్గజ క్రికెటర్లను ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం కోసం ఉవ్విళ్లూరుతూ టికెట్లు కావాలని బారులు తీరినవారిపై లాఠీఛార్జి చేసేదాకా పరిస్థితి దిగజారిందంటే, అది కచ్చితంగా హెచ్‌సీఏ వైఫల్యమే. చీటింగ్‌, టికెట్ల బ్లాక్‌మార్కెట్‌, తొక్కిసలాటకు దారితీసిన నేరపూరిత నిర్లక్ష్యం, జింఖానా మైదానంలో కనీస ఏర్పాట్లూ లేకుండా పోయాయన్న ఆరోపణలతో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగినా ఏ కోశానా పశ్చాత్తాపం కనిపించని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తీరు తీవ్ర అభ్యంతరకరం.
వివాదాలకు, అవకతవకలకు నెలవుగా హెచ్‌సీఏ తరచూ అప్రతిష్ఠపాలు కావడం దురదృష్టకరం. ‘ఇక్కడ రాజకీయాలు పెచ్చరిల్లి క్రికెట్‌ కొల్లబోతోంది’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టే ఆమధ్య మొట్టికాయలు వేసినా, నేటికీ బండి గాడిన పడకపోవడం దౌర్భాగ్యం.

హైదరాబాద్‌ జట్టు ఏనాడో 1986-87 సీజన్‌లో రంజీట్రోఫీ గెలిచింది. ఇప్పటిదాకా మళ్ళీ ఆ ఘనత సాధించలేకపోయింది. ఆటగాళ్ల ఎంపికలో జవాబుదారీతనం కరవై, సెలెక్టర్లు ఇష్టారాజ్యంగా చలాయించుకోవడమే అందుకు ప్రధాన కారణమన్న మాజీ క్రీడాకారుడు విజయ్‌ మోహన్‌రాజ్‌ సూటి ఆరోపణ మూడేళ్లక్రితం గగ్గోలు పుట్టించింది. ఆ సమయంలోనే విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నమెంట్లకు ఆటగాళ్ల ఎంపిక గాడి తప్పిందని; ప్రబల అవినీతి అడ్డగోలు రాజకీయాలే అందుకు నేరుగా పుణ్యం కట్టుకున్నాయన్న అంబటి రాయుడి విమర్శలు- హెచ్‌సీఏ బాగోతాల్ని రచ్చకీడ్చాయి. వర్గవిభేదాలు, పరస్పర ఆరోపణలు ఇంకా కొనసాగుతూ ఎందరో వర్ధమాన క్రీడాకారుల భవితను, ఆశల్ని చిదిమేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అంతా బాగానే ఉందంటూ ఆరోపణల్ని దులపరించేసుకోవడం అలవాటైన క్రికెట్‌ సంఘం- ఈసారీ ఆనవాయితీ తప్పలేదు. టికెట్‌ విక్రయాల్లో తాము ఎటువంటి పొరపాట్లకూ తావివ్వలేదన్న అధికారిక ఖండన, హెచ్‌సీఏ అపభ్రంశ వ్యవహారశైలికి మచ్చతునక. విక్రయాల బాధ్యతను ఇతరులకు అప్పగించామంటూ, రద్దీవేళ ఎవరూ ఎక్కడా ఎటువంటి అసౌకర్యానికీ గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పూర్తిగా గాలికొదిలేసిన హెచ్‌సీఏ- విధ్యుక్తధర్మ  నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి గంటల తరబడి ఓపిగ్గా నిరీక్షించిన ఎందరో అభిమానులకు ఎన్నటికీ మరపురాని చేదుజ్ఞాపకాల్ని మిగిల్చింది. టికెట్ల విక్రయానికి సంబంధించి జాతీయ స్థాయిలో అభాసుపాలై తెలుగువారికి తీరని అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. గతమెంతో ఘనమైన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘ ప్రతిష్ఠను పునరుద్ధరించే కృషిలో భాగంగా- అవినీతి, దుర్రాజకీయాల భల్లూకం పట్టు నుంచి ఆ సంస్థను బీసీసీఐ విముక్తం చేయాలి. హెచ్‌సీఏను సాకల్యంగా ప్రక్షాళించాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.