వాడిన పూలే వికసించులే...

సృష్టిలో పూలలాగే స్త్రీలు పరమ సుకుమారులు. పూలను ఇష్టపడని స్త్రీలు లోకంలో అరుదు. కొప్పునిండా పూలను ధరించిన స్త్రీలను చూస్తుంటే- ఒక్కోసారి రెండుకళ్లూ చాలవనిపిస్తుంది. ఒత్తుగా పూలు ధరించిన స్త్రీలు తమతో పొత్తు కలిపి కిసుక్కున నవ్వితే- ఆ వికాసం నవ్వులదో

Published : 25 Sep 2022 00:52 IST

సృష్టిలో పూలలాగే స్త్రీలు పరమ సుకుమారులు. పూలను ఇష్టపడని స్త్రీలు లోకంలో అరుదు. కొప్పునిండా పూలను ధరించిన స్త్రీలను చూస్తుంటే- ఒక్కోసారి రెండుకళ్లూ చాలవనిపిస్తుంది. ఒత్తుగా పూలు ధరించిన స్త్రీలు తమతో పొత్తు కలిపి కిసుక్కున నవ్వితే- ఆ వికాసం నవ్వులదో పువ్వులదో తెలియక ‘తలనిండ పూదండ దాల్చిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించబోకె...!’ అంటూ కవి దాశరథి బాణీలో పురుషులు సతమతమవుతారు. నిత్యం పూలు ధరించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, కంటికి చలవ చేస్తుంది... ‘పరిమళము కలుగు పువ్వులు ధరియింపగ... నరులకు మతి తెలియు, అనువు నయనములకు అగున్‌’ అంది చారుచర్య గ్రంథం. మండు వేసవిలో జడ నిండుగా తాజా మల్లెలు మొల్లలు జాజులు తురుముకొనే యువతులకు అది అనుభవమే! ‘చల్లదనంబు కోరి సహజంబగు గొజ్జగి నీరు కొంత పైజల్లి ధరింతురు అర్థిమెయిన్‌ (ఇష్టంగా) జాణలు- వేసవి రాత్రులెప్పుడున్‌’ అన్నారు అందుకే కవులు. ఇప్పుడంటే ఆధునిక శిరోజాలంకరణలో సొగసుగా పూలు తురుముకొనేందుకు బొత్తిగా జాగా లేకుండా పోయిందిగాని- అప్పట్లో స్త్రీలకు పూల విలాసాలు, పరిమళాలు కరతలామలకం. దేనికి దేన్ని జత చేస్తే సోకు ఇనుమడిస్తుందో, సుగంధం మరింత సురభిళిస్తుందో వారికి బాగా తెలుసు. మల్లెపూలకు మరువం, దవనం చేర్చి మత్తెక్కించేవారు కదా! ‘గోరింటపువ్వు మరువము చేరిచి, విరజాజి విరులు చెంగలువలు కర్పూరమున గూర్చి ముడుతురు నారీమణులు’ అని ఊరికే అన్నాడా- కవి అప్పనమంత్రి? ఇలా రకరకాల జోడింపులతో ఆ రోజుల్లో పురవీధుల్లో పూలరథాల్లా పురంధ్రులు ఒయ్యారంగా నడచిపోతుంటే ‘సొగసు చూడతరమా...’ అనిపించేది. వీధి వీధంతా గుబాళించిపోయేది.

‘గాలిని గౌరవింతుము- సుగంధము పూసి, సమాశ్రయించు భృంగాలకు(తుమ్మెదలకు) విందు సేసెదము- కమ్మని తేనెలు, మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము’ అని పూలబాలలు కరుణశ్రీతో చెప్పిన మాటలు అక్షరసత్యాలు. అయితే అంతటితో ఊరుకోలేదు పూలు- ‘ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి, గుండెలోనుండి సూదులు గ్రుచ్చి, కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట! దయలేనివారు మీ ఆడువారు’ అని దెప్పి పొడిచాయి. పూర్వకాలంలో పురుషులు సైతం పూలు ధరించేవారు. కాబట్టి ఆ నింద అందరికీ వర్తిస్తుంది. కృష్ణదేవరాయలు కేతక పుష్పాలు (మొగలిపొత్తులు) ధరించి రాజసభకు విచ్చేసేవాడట. దాని ఘాటు పరిమళం మనకు గుర్తుంటే- రాయల రాజస ప్రవృత్తితో పరిచయం ఏర్పడుతుంది. ప్రవృత్తిని బట్టే పురుషులు పూల పరిమళాలను ఇష్టపడతారు. మన పెద్దలు ఆయా రుతువుల్లో వాటి పూతను బట్టి- శుభ అశుభ ఫలితాలను సైతం గ్రహించేవారు. ‘అడవి తంగేడు రేలయు అనుము కుసుమ పూచెనేనియు ముదమగు భూమి ప్రజకు... పంటలు బాగా పండుతాయి’ అంటూ రెట్టమత శాస్త్రం మరెన్నో విశేషాలు చెప్పింది. అలాగే సువాసనలు ఎంతసేపు నిలుస్తాయో కూడా మన పెద్దలు చెప్పారు. జాజుల పరిమళం అరజాము, మల్లెలు రెండు జాములు, ‘ఒక పగల్‌, రేయును నుండు సంపెంగ’ అని చారుచర్య పేర్కొంది. వాడిపోయిన పూల నుంచీ పరిమళాలు రాబట్టే విధంగా- తిరుమలలో మాదిరే, యాదాద్రి నరసింహస్వామి పూజకు వాడిన పూలను- అంటే నిర్మాల్యాన్ని సేకరించి, జాతులవారీగా వేరు చేసి, నీడలో ఆరబెట్టి, అగరుబత్తులుగా రూపొందించే ప్రక్రియను యాదాద్రి అధికార యంత్రాంగం తాజాగా చేపట్టింది. ‘మా యౌవనమెల్ల కొల్లగొని, ఆపయి చీపురితోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా!’ అని చింతించే పూలబాలలకు ఇది కొంత ఓదార్పు కలిగిస్తుందేమో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.