నేరగాళ్లే నాయకులా?

ప్రజాస్వామ్యం ముసుగులో దేశీయంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఎన్నో హేయ నేరాభియోగాలను వీపున మోస్తున్న నేతాగణాలు నిర్లజ్జగా పదవుల్లోకి చొరబడుతున్నాయి. ‘చట్టాలను అతిక్రమించే వారు శాసననిర్మాతలు కాకూడదు... నేర నేపథ్యం కలిగిన వ్యక్తులు ఎన్నికల

Published : 30 Sep 2022 00:41 IST

ప్రజాస్వామ్యం ముసుగులో దేశీయంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఎన్నో హేయ నేరాభియోగాలను వీపున మోస్తున్న నేతాగణాలు నిర్లజ్జగా పదవుల్లోకి చొరబడుతున్నాయి. ‘చట్టాలను అతిక్రమించే వారు శాసననిర్మాతలు కాకూడదు... నేర నేపథ్యం కలిగిన వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తారు’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించి పదిహేడేళ్లయ్యింది. సూది బెజ్జాన్ని జల్లెడ వెక్కిరించినట్లు- పరస్పర నిందారోపణల్లో మునిగితేలే రాజకీయ పక్షాల్లో న్యాయపాలిక మహితోక్తిని గౌరవిస్తున్నవి ఎన్ని? 2009లో 162 మంది నేరచరితులు లోక్‌సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో అటువంటివారు 233 మంది ఎంపీలుగా గెలిచారు. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) నిరుటి అధ్యయనం ప్రకారం- 42శాతం కేంద్ర మంత్రులు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. నేరమూ రాజకీయమూ కలగలిసిపోయి జనతంత్ర విలువలు నీరుగారిపోతున్న తరుణంలో- తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ పడనివ్వకూడదంటూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. జనహితకరమైన ఆ అంశాన్ని లోతుగా పరిశీలించిన న్యాయసంఘం (లా కమిషన్‌)- ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రానికి తన నివేదిక సమర్పించింది. అయిదేళ్లకు మించి శిక్ష పడే కేసుల్లో నేరాభియోగాల నమోదు దశలోనే సునిశిత న్యాయసమీక్ష అనంతరం సంబంధిత నేతలపై అనర్హత వేటు వేయాలని అది సిఫార్సు చేసింది. ఆ మేరకు కొత్త చట్టం అమలులోకి వచ్చే నాటికి హేయ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ దాన్ని వర్తింపజేయాలని సూచించింది. ‘అనర్హత’ నిబంధన దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ ఆ నివేదిక గుదిగుచ్చింది. న్యాయసంఘం మేలిమి సిఫార్సులు కార్యరూపం దాలిస్తేనే- ధూర్త రాజకీయాల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి దేశం బయటపడగలుగుతుంది!

సమాజాన్ని చెయ్యిపట్టి నడిపించే నాయకులు కచ్చితంగా వ్యక్తిత్వ సంపన్నులు కావాలని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అభిలషించారు. కానీ, నేటితరం నేతల జాతకాలు తిరగేస్తే- హత్యలూ అత్యాచారాల నుంచి జాతి వనరులను కబళించే ఆర్థిక అక్రమాల దాకా పలు నేరాలకు పాల్పడినట్లుగా ‘గుర్తింపు’ పొందినవారే గణనీయంగా కనిపిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాజా, మాజీ చట్టసభ సభ్యులపై 263 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రెండేళ్ల నాడు సుప్రీంకోర్టుకు అందిన ఒక ప్రమాణపత్రం స్పష్టీకరించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అయిదేళ్ల క్రితం 143 మంది నేరచరితులు ఎమ్మెల్యేలు అయితే- ఇటీవలి ఆ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన కళంకితుల సంఖ్య 205కు ఎగబాకింది. పంజాబ్‌ నూతన శాసనసభ్యుల్లో దాదాపు యాభై శాతం క్రిమినల్‌ నేరారోపితులే. కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌ బెంగాల్‌... ఇలా రాష్ట్రాలకు అతీతంగా అన్ని చోట్లా నేరచరిత నాయకత్వమే ఎక్కువగా ప్రజల తలరాతలను నిర్దేశిస్తోంది. జనతంత్ర రథానికి ఇరుసుల వంటి రాజకీయ పార్టీలు- నేరగ్రస్త నేతలనే గెలుపు గుర్రాలుగా భావిస్తున్నాయి. అలా టికెట్లు చేజిక్కించుకునే పెద్దమనుషులు- ఓటర్లకు ప్రలోభాల ఎర వేస్తున్నారు. మాట వినని వారిని భయభ్రాంతులకు గురిచేయడానికీ తెగబడుతున్నారు. ఏళ్లూపూళ్లు సాగుతున్న విచారణలూ నేరమయ రాజకీయాల్లో ఆజ్యంపోస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కేసుల నుంచి ‘విముక్తి’ ప్రసాదించే రాష్ట్ర ప్రభుత్వాల పెడపోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంట చేలో కలుపు మొక్కలను పీకిపారేసినట్లు రాజకీయాల్లోంచి నేరగాళ్లను ఏరేయాలంటే- విచారణలు వేగవంతం కావాలి. నేరచరితులను చంకనెక్కించుకునే రాజకీయ పక్షాల ధోరణులు మారాలి. రాష్ట్రపతిగా నారాయణన్‌ గతంలో ఆకాంక్షించినట్లు- దేశహితం కోసం పార్టీలు ఆ మాత్రం చేయలేవా?

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts