జాతిపితకు సరైన నివాళి

భీష్మ ద్రోణ కర్ణాది భీకర యోధులను కురుక్షేత్రంలో గడగడలాడించిన అర్జునుడి ‘మహిమాన్విత’ ధనుస్సు- గాండీవం! కృష్ణుడి నిర్యాణం దరిమిలా స్త్రీ జనాన్ని, గో సంపదను అర్జునుడి సంరక్షణలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటే- మామూలు దోపిడి దొంగల ముందు అంతటి మహా ధనుస్సూ బోసిపోయింది, దాని మహిమ మాసిపోయింది.

Published : 02 Oct 2022 00:49 IST

భీష్మ ద్రోణ కర్ణాది భీకర యోధులను కురుక్షేత్రంలో గడగడలాడించిన అర్జునుడి ‘మహిమాన్విత’ ధనుస్సు- గాండీవం! కృష్ణుడి నిర్యాణం దరిమిలా స్త్రీ జనాన్ని, గో సంపదను అర్జునుడి సంరక్షణలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటే- మామూలు దోపిడి దొంగల ముందు అంతటి మహా ధనుస్సూ బోసిపోయింది, దాని మహిమ మాసిపోయింది. కారణం... కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు లేడు- అదొక్కటే తేడా! అహింసా మార్గంలో స్వరాజ్యం సిద్ధించిన తరవాత కూడా- మన దేశంలోనే భాగమైన చిన్న భూభాగం గోవా స్వాధీనానికి మనకు 14 ఏళ్లు పట్టింది. 1961 డిసెంబర్‌ 19న గోవా విలీనమైంది. అదీ- 70 మంది సైనికులు బలయ్యాక, ఏరులై పారిన రక్తంతో గోవా నేల తడిసి ముద్దయ్యాక! స్వరాజ్యం సాధించడం వెనక గాంధీ మహాత్ముడు ఉన్నాడు. 1961 నాటికి ఆయన లేడు. అదొక్కటే తేడా! బులుసుకవి చెప్పినట్లు ‘చేతికర్ర తోడ సింహాలను అదిలించె, ఉప్పు తోడరిపులను ఊదివేసె, అర్ధనగ్న తపసి ఆ మహాత్ముడికి...’ ధర్మమే ఆయుధం, ధర్మమే ఆశయం. నిజానికి కృష్ణుడు, గాంధీజీ... అనేవి పేర్లు కావు- అవి ధర్మానికి ప్రతీకలు. ‘యతో ధర్మ స్తతో జయః’ అని భారతంలో గాంధారి చెప్పిన మాటనే గాంధీజీ నిజం చేశారు. సమూహాలను నడిపించడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఒక బక్క ప్రాణికి అంతటి మహత్తర సామర్థ్యం, ఆత్మశక్తి ఎలా పట్టుబడ్డాయో కవి రసరాజు చెబుతూ ‘పరదేశంబులకు ఏగియున్నను, దురభ్యాసంబులు ఏనాడు నీ దరికిన్‌ వచ్చిన జాడ లేదు... శమమున్‌ ధర్మంబు సత్యంబు అహింస రఘూత్తంసుని సేవ- నీకు ఇవియే శ్రేష్ఠత్వంబు కల్పించె’ అన్నారు. అంటే, రవీంద్రుడు గాంధీజీని మహాత్ముడన్నది- అభిమానంతో కాదు, బాపూ అంతర్గత శక్తుల పట్ల పూర్తి అవగాహనతో! ఐన్‌స్టీన్‌ చెప్పినట్లు ఆ అన్ని గొప్ప లక్షణాలున్న మనిషి- ఈ భూమ్మీదే సంచరించాడు.

‘గాంధీమార్గం’ అనేది నాలుగక్షరాల పదం కాదు- అక్షరాలా అగ్నిపథం. సత్యసంధత, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత- ఆయనను మహాత్ముణ్ని చేశాయి. ఆచరణ విషయంలో ఆయనది అనుష్ఠాన వేదాంతం. ప్రజలు అసంఖ్యాకంగా ఆయనను అనుసరించడానికి కారణం- ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు కావు, పాటించిన విలువలు. ‘అతడు అహింసకు అక్షరాభ్యాసశాల, అతడు సత్యసంధతకు వ్యాఖ్యాన శైలి, అందుకే మహాత్ముడై రహించెను...’ అన్నది ప్రత్యక్షర సత్యం. ప్రతి దేశానికీ ఒక సంఘటిత ఆత్మ(గ్రూప్‌ సోల్‌) ఉంటుందన్నారు అరవిందులు. ఆ దేశ సంస్కృతిలో సారస్వతంలో అది ప్రతిబింబిస్తుంది. భారతీయ ఆత్మను సర్వసమగ్రంగా అవగాహన చేసుకొన్నవాడు, ఆవాహన చేసుకొన్నవాడు- మహాత్ముడు. జాతీయ సంస్కృతికి ఆయన ఆనవాలు, చేవ్రాలు. ‘గడ్డి పోచలు పేని, గట్టి ఏనుగునేని, కట్టువాడే జ్ఞాని’ అన్నారు కూనలమ్మ పదాల్లో ఆరుద్ర. బాపూ చేసిన పని సరిగ్గా అదే! ఎక్కడో నిలబడి ఒక్క పిలుపిస్తే- దేశం నలుమూలలా సామాన్యుడు ఆయుధమై హోరెత్తిపోయాడు. శత్రువు ఠారెత్తిపోయాడు. సంఘటిత ఆత్మ సామర్థ్యం అది. దిల్లీలో ఆయన నిరాహార దీక్షకు కూర్చుంటే- గల్లీల్లోని గాంధేయవాదులెవ్వరికీ అన్నం సహించకపోవడానికి కారణం అదే! మహాత్ముడి ఉనికి ఎలాంటిదంటే- ‘నీవెటనుందువో అచట అక్షిరాజీవములందు రాగము నశింపదు, ద్వేషము సంభవింపదున్‌’ అని కవి దాశరథి వేరే సందర్భంలో చెప్పిన మాట దానికి బాగా అన్వయిస్తుంది. అయితే, బాపూజీ కోరుకున్న స్వరాజ్యం ఇది కాదు. ‘ధృతి మన్నించి పరాయివాడు తన దారిన్‌ తాను పోగా, సమున్నతి స్వాతంత్య్రము వచ్చి పడ్డదనుకొన్నన్‌- వారిదే పిచ్చి’ అన్నారు విశ్వనాథ. అలాంటి సమున్నతమైన సంపూర్ణ స్వాతంత్య్రాన్ని సాధించడమే- గాంధీజీకి సరైన నివాళి!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని