భాగ్యనగరంపై పాక్‌ పడగనీడ

దసరా శరన్నవరాత్రుల సందడిలో మునిగిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పండగ వేళ హైదరాబాద్‌పై పెనువిధ్వంస విషం చిమ్మడానికి ముష్కర మిన్నాగులు సంసిద్ధమయ్యాయన్న సమాచారం- పాత ఘోరాల నెత్తుటి గాయాలను గుర్తుచేస్తూ, నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించింది.

Published : 04 Oct 2022 01:28 IST

సరా శరన్నవరాత్రుల సందడిలో మునిగిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పండగ వేళ హైదరాబాద్‌పై పెనువిధ్వంస విషం చిమ్మడానికి ముష్కర మిన్నాగులు సంసిద్ధమయ్యాయన్న సమాచారం- పాత ఘోరాల నెత్తుటి గాయాలను గుర్తుచేస్తూ, నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో సరిపోయింది కానీ; సమావేశాలూ ఊరేగింపులు, రద్దీ ప్రాంతాలపై గురిపెట్టిన ఉగ్రమూకల కుతంత్రం పారిఉంటే- మరోసారి మాటలకందని మహావిషాదమే సంభవించేది! పట్టుబడిన ఉగ్ర కుట్రదారుల దగ్గర గ్రెనేడ్లు లభ్యంకావడం తీవ్రంగా కలవరపరుస్తోంది. చైనాలో తయారై- పాక్‌ పాతకుల చేతుల మీదుగా కశ్మీర్‌కు, అక్కడి నుంచి  హైదరాబాద్‌కు అవి ఎప్పుడో చేరినట్లు చెబుతున్నారు. జనహనన ఆయుధాలను అలా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉగ్రతండాలు తరలిస్తుంటేే- దేశీయ అంతర్గత నిఘా వ్యవస్థలు ఏమయ్యాయి? సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నిరుడు బిహార్‌లోని దర్భంగాకు ముష్కరమూకలు ఒక బాంబు పార్శిల్‌ను పంపాయి. అదృష్టం కొద్దీ అదక్కడ ప్లాట్‌ఫామ్‌పై పేలడంతో ఎన్నో ప్రాణాలు నిలిచాయి. కదిలే రైలులో పేలుడుకు పథకరచన చేసిన మాలిక్‌ సోదరులు అప్పటికి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే తిష్ఠవేసినా- నిఘా వర్గాలు పసికట్టలేకపోయాయి. ‘ఉగ్రవాదులు తమ ప్రయత్నాల్లో ఒక్కసారి సఫలమైనా వారి లక్ష్యం నెరవేరినట్లే... వాళ్లను నిలువరించడంలో మనం ప్రతిసారీ విజయం సాధించాలి... లేకపోతే, భారీ విధ్వంసం తప్పదు’ అని అమెరికా అధ్యక్షుడిగా జార్జిబుష్‌ హెచ్చరించారు. మక్కా మసీదు, లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల వంటివి పునరావృతం కాకూడదంటే- నిద్రాణ ఉగ్ర బృందాల ఆనుపానుల కూపీతీస్తూ, ఎక్కడికక్కడ వాటిని ఏరిపారేయాలి!  

దాయాది మీద దుగ్ధతో ఉగ్రవాద భూతానికి ఆవాహన పలికిన పాకిస్థాన్‌-  దశాబ్దాలుగా ఇండియాతో పరోక్ష యుద్ధం చేస్తోంది. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌ వివరాల మేరకు 2000 సంవత్సరం నుంచి గత నెలాఖరు దాకా భారతదేశంలో 68వేలకు పైగా ఉగ్రవాద సంబంధిత సంఘటనలు నమోదయ్యాయి. భద్రతాసిబ్బంది, సాధారణ పౌరులు, ముష్కరులతో కలిపి 46 వేలకు పైగా ప్రాణాలు ఈ రావణకాష్ఠంలో ఆహుతయ్యాయి. 2004-2020 మధ్యకాలంలో జమ్మూకశ్మీర్‌లో సుమారు పద్నాలుగు వేల సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి జెల్లకొట్టిన పాక్‌- ముష్కరుల్ని, మారణాయుధాలను లోయలోకి నిరంతరం ఎగుమతి చేస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఉధంపుర్‌లో రెండు బస్సుల్లో పేలుళ్లకు పాల్పడిన లష్కరే తొయిబా ఉగ్రవాదిని స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పేల్చివేతలకు మునుపు  లోయలోని ప్రతీపశక్తులకు సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్‌ ద్వారా విధ్వంసక సామగ్రి అందినట్లు వాళ్లు తేల్చారు. మన రక్షణ ఏర్పాట్లలోని డొల్లతనానికి అది అద్దంపడుతోంది. ఆదివారం సాయంత్రం పుల్వామా జిల్లాలో గస్తీ దళాలపై దాడికి తెగబడిన ముష్కర మూకలు- ఒకరిని బలితీసుకున్నాయి. అదే రోజు షోపియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇలా వరస ఘటనలు జరుగుతున్నా- కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉనికి తగ్గిపోతోందని కేంద్రం నమ్మబలుకుతుండటమే విస్తుగొలుపుతోంది. ఇండియాపై అల్‌ఖైదా దుష్టనేత్రం, దేశవ్యాప్తంగా విస్తరించిన పీఎఫ్‌ఐకు సీమాంతర ఉగ్రతండాలతో సంబంధాలపై వెలువడుతున్న కథనాలు  ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరెన్నో ప్రాంతాల్లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రశక్తుల కదలికలు కనిపిస్తున్నాయి. అత్యాధునిక సాయుధ సంపత్తి, అత్యుత్తమ నిఘా వ్యవస్థల తోడుగా పాలకులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తేనే- భారతావని భద్రత శత్రు దుర్భేద్యం కాగలుగుతుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts