శత్రుసేనల్ని దునుమాడే శక్తిగా...

భారత వైమానిక దళంలో ప్రచండ శకారంభమిది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు వాయుసేనను శత్రు భీకరంగా తీర్చిదిద్దగలవన్న విశ్లేషణలు- ఒకప్పటికి ఇప్పటికి మధ్య గణనీయ పరివర్తనను కళ్లకు కడుతున్నాయి!

Published : 05 Oct 2022 00:43 IST

భారత వైమానిక దళంలో ప్రచండ శకారంభమిది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు వాయుసేనను శత్రు భీకరంగా తీర్చిదిద్దగలవన్న విశ్లేషణలు- ఒకప్పటికి ఇప్పటికి మధ్య గణనీయ పరివర్తనను కళ్లకు కడుతున్నాయి! రక్షణ రంగాన స్వావలంబనే ఏ జాతికైనా శ్రీరామరక్ష అన్న భావనకు ప్రథమ ప్రధాని నెహ్రూ గట్టిగా ఓటేశారు. తాత్కాలికంగా ఆయుధాలను సైనిక సామగ్రిని విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నా, భవిష్యత్తులో వాటిని సొంతంగానే సముపార్జించుకోవాలని దీర్ఘకాలిక లక్ష్యాన్నీ ఆయన నిర్దేశించారు. వాస్తవంలో తుపాకులు, తూటాలు, శిరస్త్రాణాలను సైతం దిగుమతి చేసుకునే దుస్థితి దశాబ్దాల తరబడి కొనసాగింది. ఆ దురవస్థ నెమ్మదిగానైనా మారుతున్న దాఖలాలు కొన్నాళ్లుగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఫిలిప్పీన్స్‌కు ‘బ్రహ్మోస్‌’ క్షిపణులను ఎగుమతి చేసే అవకాశాన్ని భారత్‌ అందిపుచ్చుకొంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ అభివృద్ధిపరచిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’ కొనుగోలుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్‌, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌ సైతం తేజస్‌ విలక్షణ సామర్థ్యానికి ఆకర్షితమైనట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉత్తమ జెట్‌ఫైటర్లుగా పేరున్న ఫ్రెంచ్‌ మిరేజ్‌ 2000, అమెరికా ఎఫ్‌ 16, స్వీడిష్‌ గ్రిపెన్‌, చైనా-పాక్‌ల జేఎఫ్‌ 17 థండర్‌లను మించి విపణిలో తేజస్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. పర్వత ప్రాంతాల్లో, ప్రతికూల వాతావరణంలో రేయింబవళ్లు ఎప్పుడైనా ఎక్కడైనా శత్రువుపై భయానక దాడి చేయగల తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ ప్రచండ తాజా చేరిక- వాయుదళం ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపజేసేదే. మన వాయుసేనకు, ఆర్మీకి కలిపి 160దాకా ప్రచండ శ్రేణి హెలికాప్టర్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఆర్డర్లు పెరిగితే అదనపు ఉత్పత్తి సామర్థ్యం సంతరించుకుంటామన్న వాగ్దానానికి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ అక్షరాలా కట్టుబడితే- భారత రక్షణ ఎగుమతుల జాబితా మరింతగా విస్తరించడం తథ్యమే!

పొరుగున జనచైనా ఆసియాన్‌, హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు రక్షణ ఉత్పత్తులు అందిస్తూ కొన్నేళ్లుగా స్వీయ ప్రాబల్యం విస్తరించుకుంటోంది. జ్ఞాతిద్వేషంతో రగులుతున్న పాకిస్థాన్‌ను చేరదీసి భారత భద్రతకు గడ్డుసవాళ్లు విసురుతోంది. ఇటువంటి విపత్కర స్థితిలో తన రక్షణావసరాలను కాచుకుంటూనే విశ్వసనీయ భద్రతా భాగస్వాముల సంఖ్యను పెంచుకోవడం ఇండియాకు ప్రాణావసరం. దశాబ్దాల ఆనవాయితీకి చెల్లుకొడుతూ రష్యన్‌ ఎంఐ-25, ఎంఐ-35ల స్థానే అమెరికన్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన భారత్‌ నిర్ణయం... కాలమాన పరిస్థితుల్లో మార్పులకు అనివార్యతలకు అద్దంపట్టింది. రక్షణ దిగుమతుల బిల్లును కుదించుకుంటూ స్వావలంబన సాధించడమే శాశ్వత పరిష్కారం. ఆ క్రమంలో తేజస్‌, ప్రచండల రూపేణా ఎన్నదగ్గ అడుగులు వేసిన భారత్‌- స్థానిక ప్రతిభా సంపన్నత, ఆధునిక సాంకేతికతల మేళవింపుతో ఆయుధ తయారీ పరిశ్రమను పరిపుష్టీకరించడానికి చేయాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుతం సుమారు 75 దేశాలకు భారత రక్షణ ఉత్పత్తులు చేరుతున్నాయి. చిన్న మధ్యశ్రేణి ఆయుధాలు, పరికరాలు, బులెట్‌ప్రూఫ్‌ జాకెట్లు వంటివే ఆ జాబితాలో సింహభాగం. జలాంతర్గాములు, భారీ యుద్ధ విమానాల ఎగుమతిదారుగా రక్షణ విపణిపై భారత్‌ తనదైన ముద్ర వేసేలా ప్రభుత్వ విధానాలిక మరింత పదును తేలాలి. గత ఎనిమిదేళ్లలో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల పరిమాణం ఏడింతలైందని ప్రధాని మోదీ ఇటీవల సగర్వంగా ప్రకటించారు. నిజానికి, విశ్వవిపణిలో మన వాటా ఒక్క శాతంలోపే! 2025 సంవత్సరం నాటికి సుమారు రూ.38 వేల కోట్ల విలువైన రక్షణ ఎగుమతుల లక్ష్యం సాధిస్తామంటున్న ప్రభుత్వం- ఆయుధ కర్మాగారాల నవీకరణపైనా, ఇతోధిక కేటాయింపులమీదా దృష్టి కేంద్రీకరించాలి. రక్షణ రంగాన పరిశోధన, అభివృద్ధికి భారీగా వెచ్చించాలి. దేశీయ ప్రతిభకు ప్రభుత్వ దార్శనిక మార్గనిర్దేశకత్వం జతపడితే- రక్షణ రంగం స్వయం సమృద్ధమై, శత్రుపక్షాన్ని ఠారెత్తిస్తుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts