ప్రలోభాలకేదీ కళ్ళెం?

ప్రజాస్వామ్యం కాదిది... ప్రలోభస్వామ్యం. ఉచిత వాగ్దానాలతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులెందరు హెచ్చరిస్తున్నా- ఎన్నికల వేళ ఓటర్లపై ఆనవాయితీగా కురుస్తూనే ఉంది... తాయిలాల వర్షం! ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న రాజకీయ పక్షాల విపరీత ధోరణుల నియంత్రణకంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో నిర్దిష్ట సవరణల్ని ఎలెక్షన్‌ కమిషన్‌ ప్రతిపాదిస్తోంది.

Published : 07 Oct 2022 01:27 IST

ప్రజాస్వామ్యం కాదిది... ప్రలోభస్వామ్యం. ఉచిత వాగ్దానాలతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులెందరు హెచ్చరిస్తున్నా- ఎన్నికల వేళ ఓటర్లపై ఆనవాయితీగా కురుస్తూనే ఉంది... తాయిలాల వర్షం! ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న రాజకీయ పక్షాల విపరీత ధోరణుల నియంత్రణకంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో నిర్దిష్ట సవరణల్ని ఎలెక్షన్‌ కమిషన్‌ ప్రతిపాదిస్తోంది. ఆయా వాగ్దానాల అమలుకు నిధులను ఎక్కడి నుంచి ఎలా సమీకరిస్తారో, కొత్తగా చేసే అప్పులు రాష్ట్రాల స్థూలోత్పత్తిలో ఏ మేరకు ఉంటాయో తదితర వివరాలన్నింటినీ పార్టీలు పొందుపరచాలని కమిషన్‌ అభిలషిస్తోంది. ఈ తాజా చొరవకు సుమారు ఒకటిన్నర దశాబ్దాల విస్తృత నేపథ్యముంది. తమిళనాట పోటెత్తిన ఉచిత వరదానాల సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తూ సుబ్రహ్మణ్యం బాలాజీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని 2007 జూన్‌లో మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ తోసిపుచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉచితంగా అన్నీ సమకూరుస్తామన్న అనుచిత హామీల వెల్లువ స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్న సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశానుసారం ఎలెక్షన్‌ కమిషన్‌ నూతన మార్గనిర్దేశాలు క్రోడీకరించేసరికి ఏడేళ్లు గడిచిపోయాయి. ‘చేయగలిగేవే చెప్పండి... ఇచ్చిన హామీల్ని ఎలా నిలబెట్టుకుంటారో వివరించండి!’ అని 2014 ఫిబ్రవరిలో పార్టీలకు ఎన్నికల సంఘం చేసిన ఉద్బోధ- ఓటి వాగ్దానాల వరదలో కొట్టుకుపోయింది. అసంబద్ధ హామీలను అవినీతి చర్యలుగా పరిగణించలేమన్న మునుపటి ధర్మాసనం తీర్పును పునఃపరిశీలించాలన్న అభ్యర్థనల నేపథ్యంలో, ఇప్పుడు ఈసీ వివరణాత్మక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఎన్నికల ఏరు దాటాక ఓటర్లను బోడి మల్లన్నల్ని చేస్తున్న పార్టీలు ఈసారైనా దిద్దుబాటు చర్యలకు కలిసివస్తాయా అన్నదే గడ్డుప్రశ్న.

ప్రజాస్వామ్య సత్ప్రమాణాలకు కట్టుబాటు చాటుతూ ఎన్నికల్లో పోటీపడి అధికారం చేపట్టాలనుకునే పార్టీలు ఏం చేయాలి? స్వీయసైద్ధాంతిక బలిమిని, పాలన అజెండాను విపులీకరించి వయోజనుల్ని మెప్పించి వారి ఓట్లను అర్థించాలి. ఎలాగైనా సరే అధికారమనే ఉట్టి కొట్టాలన్న యావ లావైన పార్టీలు ఎన్నికల భారతాన్ని ధనస్వామ్య దాదాగిరీగా భ్రష్టుపట్టించాయి. మద్యపుటేళ్లు పారించి కరెన్సీ నోట్లు వెదజల్లి ఓట్ల పరిగల్ని బుట్టలో వేసుకోవడంలో రాటుతేలిన పార్టీలు కొన్నాళ్లుగా మ్యానిఫెస్టోల్ని ప్రలోభ దస్త్రాలుగా దిగజార్చేశాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్రలకు పరిమితమైన ఉచిత హామీల వేలంవెర్రి క్రమేపీ తరతమ భేదాలతో దేశమంతటా భారీ ఊడలమర్రిలా విస్తరించి దిగ్భ్రాంతపరుస్తోంది. ఒకటా, రెండా? బూటకపు వాగ్దానాలతో ఓటర్లను బురిడీ కొట్టించడంలో పార్టీల పోటాపోటీ వాటి దివాలాకోరుతనాన్ని నడివీధిలో ఆవిష్కరిస్తోంది. ఇంటింటికీ ఫ్యాన్లు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సగం ధరలకే స్కూటీలు, గృహరుణాల మాఫీ, డ్వాక్రా రుణాల తెగ్గోత... ఇలా నోటికొచ్చిన హామీలతో ఓట్లు కొల్లగొట్టాలని తహతహలాడుతున్న రాజకీయ పక్షాలు బడ్జెట్‌ పరిమితుల్ని లెక్కచేయడం లేదు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్ని పట్టించుకోవడం లేదు. అప్పులు దూసితెచ్చి మరీ తాయిలాలు గుప్పిస్తున్నారు. రిజర్వ్‌బ్యాంకు మాజీ సారథి దువ్వూరి సుబ్బారావు ఆమధ్య సూటిగా ఆక్షేపించినట్లు- భవిష్యత్‌ రాబడుల్నీ తాకట్టు పెడుతున్నారు. ఓటర్ల విశ్వాసం చూరగొనదలచిన వారెవరైనా ఆచరణ సాధ్యమైన వాగ్దానాలే చేయాలని రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ ఉద్బోధించారు. అందుకు మన్నన దక్కాలంటే చేయాల్సిందేమిటి? చేతికి ఎముకే లేదన్న రీతిగా రెచ్చిపోతున్న వాగ్దాన కర్ణులు ఆయా హామీల్ని ఎలా, ఎంత గడువులో నెరవేర్చదలచారో పౌరులకు ముందుగానే వెల్లడించి తీరాలి. అలా అమలు పరచలేని పక్షంలో తక్షణం ఆ పాలకపార్టీ అధికారం కోల్పోయేలా ప్రత్యేక శాసనం రూపుదిద్దుకోవాలి. ప్రతి వాగ్దానం అమలుకు అధికార పక్షాన్ని జవాబుదారీ చేసేలా వ్యవస్థాగత ప్రక్షాళన కోసం నిబద్ధతతో పార్టీలు, పార్లమెంటు కూడి వస్తేనే- దేశంలో బాధ్యతాయుత రాజకీయం వేళ్లూనుకుంటుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts