జిన్‌పింగ్‌ కనుసన్నల్లో జనచైనా

మానవాళిలో సుమారు అయిదో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచార్థికంలో పద్దెనిమిది శాతానికి పైగా వాటాకు సొంతదారైన జనచైనాను దశాబ్దాలుగా ఒకే పార్టీ అనుశాసిస్తోంది. తొమ్మిది కోట్ల అరవై లక్షలకు పైబడిన సభ్యులతో స్థానికంగా సర్వంసహాధిపత్యాన్ని చలాయిస్తున్న ఆ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)- కొన్నేళ్లుగా ఏకవ్యక్తి కనుసన్ననలకే పరిమితమైపోయింది.

Published : 26 Oct 2022 00:46 IST

మానవాళిలో సుమారు అయిదో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచార్థికంలో పద్దెనిమిది శాతానికి పైగా వాటాకు సొంతదారైన జనచైనాను దశాబ్దాలుగా ఒకే పార్టీ అనుశాసిస్తోంది. తొమ్మిది కోట్ల అరవై లక్షలకు పైబడిన సభ్యులతో స్థానికంగా సర్వంసహాధిపత్యాన్ని చలాయిస్తున్న ఆ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)- కొన్నేళ్లుగా ఏకవ్యక్తి కనుసన్ననలకే పరిమితమైపోయింది. స్వదేశీ పాలకపక్షంపై తన పట్టును మరింతగా బిగిస్తూ చైనా అధినేతగా షి జిన్‌పింగ్‌ మూడోసారి పట్టాభిషిక్తులయ్యారు. దార్శనికుడు డెంగ్‌ జియావోపింగ్‌ స్వప్నించిన సమష్టి నాయకత్వ వ్యవస్థకు అలా ఆయన పూర్తిగా చెల్లుకొట్టేశారు. సాంస్కృతిక విప్లవం రోజుల్లో ఛైర్మన్‌ మావో ఆగ్రహానికి తన తండ్రి బాధితుడైన దరిమిలా జిన్‌పింగ్‌ అతికష్టమ్మీద సీపీసీలోకి అడుగుపెట్టారు. పార్టీలోని భిన్న వర్గాలతో సమదూరం పాటిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చైనా భావిగతికి సరైన దిశానిర్దేశం చేయగలిగిన నేతగా గుర్తింపు పొంది, పదేళ్ల నాడు హు జింటావో నుంచి ఆయన పాలనా పగ్గాలను అందుకున్నారు. నాటి పార్టీపెద్దల నమ్మకాలను వమ్ము చేస్తూ- కుర్చీ ఎక్కింది మొదలు తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు జిన్‌పింగ్‌ అనేక వ్యూహాలు పన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటం పేరిట రాజకీయ శత్రువులు, పోటీదారులపై ఉక్కుపాదం మోపారు. తన నమ్మినబంట్లను కీలక స్థానాల్లో కూర్చోబెట్టి మావో రోజుల నాటి వ్యక్తిపూజకు ఆయన మళ్ళీ బాటలు పరచారు. మిగిలిన దేశాలన్నీ సలాములు కొట్టే అతిశక్తిమంతమైన రాజ్యంగా చైనాను తీర్చిదిద్దేందుకు చరిత్ర ఎంచుకున్న కారణజన్ముడిగా జిన్‌పింగ్‌ తనను తాను సంభావించుకుంటారు. తన స్వప్న సాకారంకోసం నిరంకుశ పద్ధతులను అవలంబిస్తూ, సాధారణ జనజీవనాన్ని ఆయన కరకు ఆంక్షల చట్రంలోకి ఈడ్చుకొచ్చారు. వృద్ధిరేటు తిరోగమనంలో సాగుతున్నా, ‘జీరో కొవిడ్‌’ విధానంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నా- జిన్‌పింగ్‌ వ్యవహారశైలిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. ఆయన ఏలుబడిలో అంతర్జాతీయంగా అనేక అంశాల్లో విపరీతమైన దూకుడును ప్రదర్శిస్తున్న బీజింగ్‌- భారతదేశానికి భద్రతాపరమైన సవాళ్లెన్నో రువ్వుతోందిప్పుడు!

ఇండియాతో సత్సంబంధాలకోసం అంటూ డ్రాగన్‌ దేశాధినేతగా ఎన్నికైన తొలిరోజుల్లోనే జిన్‌పింగ్‌ నూతన పంచశీలను తెరపైకి తెచ్చారు. ఉభయ దేశాల పొలిమేరల్లో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ద్వైపాక్షిక బంధాల వృద్ధిని సరిహద్దు సమస్యలు ప్రభావితం చేయకుండా చూసుకొందామని నమ్మబలికారు. కానీ- ఇరువర్గాల నడుమ ఉద్రిక్తతలను తీవ్రస్థాయిలో రాజేసిన డోక్లాం సంక్షోభం, గాల్వాన్‌ ఘర్షణల వంటివి బీజింగ్‌ విస్తరణవాదానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఇండియాకు కంట్లో నలుసుగా ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్‌ను దువ్వుతున్న చైనా వర్గాలు- ఇటీవల ఆ దేశంలో తమ సైనిక అవుట్‌పోస్టుల ఏర్పాటు ప్రతిపాదనలనూ తెరపైకి తెచ్చాయి. ఆర్థిక శక్తియుక్తులు, రుణాల మాయవలలతో భారతావని ఇరుగుపొరుగు దేశాలను తన పిడికిట్లోకి తెచ్చుకొంటున్న బీజింగ్‌- అమేయ నౌకాశక్తితో హిందూ మహాసముద్రంపైనా దుష్టనేత్రాన్ని ప్రసరిస్తోంది. జాతీయ పునరుజ్జీవనానికి దేశ భద్రతను పునాదిగా అభివర్ణించే జిన్‌పింగ్‌- తమ సైన్యాన్ని ఆధునికీకరించడానికి ఆదినుంచీ అమిత ప్రాధాన్యమిస్తున్నారు.  గడచిన దశాబ్ద కాలంలో చైనీస్‌ రక్షణ వ్యయం దాదాపు రెట్టింపు అయ్యింది. తమ సైనిక దళాల వ్యూహాత్మక సామర్థ్యాలకు చైనా చురుగ్గా సానపడుతోంది. అది మనకు కంటకప్రాయం కాకూడదంటే- బలగాల నవీకరణలో ఇండియా సైతం దీటుగా స్పందించాల్సిందే. భౌగోళిక రాజకీయాల్లో డ్రాగన్‌ పన్నాగాలను తిప్పికొట్టేలా- సమర్థ విదేశాంగ విధానాన్ని కేంద్రం పదును తేల్చాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.