ఇది జాతీయ సంక్షోభం!

జీవనవేగం, అన్నింటా అనర్థక పోటీ ఇంతలంతలైన ఆధునిక ప్రపంచంలో ఒత్తిళ్లే ఉరితాళ్లవుతున్నాయి. కుంగిన మనసును సాంత్వనపరచేవారు కానరాక, రకరకాల కారణాలతో ఎవరికి ఎవరూ ఏమీకాని ఒంటిస్తంభాలుగా మిగిలిపోతున్న వాతావరణంలో- బలవన్మరణాలు పెచ్చరిల్లుతున్నాయి.

Published : 25 Nov 2022 01:05 IST

జీవనవేగం, అన్నింటా అనర్థక పోటీ ఇంతలంతలైన ఆధునిక ప్రపంచంలో ఒత్తిళ్లే ఉరితాళ్లవుతున్నాయి. కుంగిన మనసును సాంత్వనపరచేవారు కానరాక, రకరకాల కారణాలతో ఎవరికి ఎవరూ ఏమీకాని ఒంటిస్తంభాలుగా మిగిలిపోతున్న వాతావరణంలో- బలవన్మరణాలు పెచ్చరిల్లుతున్నాయి. 2017 నాటికి దేశంలోని ప్రతి లక్ష జనాభాకు సగటు ఆత్మహత్యల రేటు 9.9గా నమోదయ్యేది. 2021 నాటికి అది 12కు ఎగబాకింది. ఎన్‌సీఆర్‌బీ (నేర రికార్డుల బ్యూరో) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2020లో లక్షా 53వేలమంది మానసిక క్షోభతో ఉసురు తీసుకున్నారు. మరుసటి ఏడాది ఆ సంఖ్య 1.64లక్షలకు విస్తరించడం, జాతీయ సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది. చావుబతుకుల సమస్య తీవ్రతను ఇన్నేళ్లకు గుర్తించిన కేంద్రం- ఆత్మహత్యల నియంత్రణే లక్ష్యమంటూ తాజాగా జాతీయ వ్యూహాన్ని వెలువరించింది. వృత్తిపరమైన సమస్యలు, ఒంటరితనం, వేధింపులు, కుటుంబ సమస్యలు, గృహహింస, మద్యం, మానసిక రుగ్మతలు, ఆర్థిక నష్టాలు... బలవన్మరణాలకు ప్రధాన కారణాలుగా ఎన్‌సీఆర్‌బీ ఆమధ్య క్రోడీకరించింది. ఆత్మహత్యల నియంత్రణలో భాగంగా వచ్చే మూడేళ్లలో పకడ్బందీ నిఘా యంత్రాంగాల ఏర్పాటును ఇప్పుడు వ్యూహపత్రం లక్షిస్తోంది. అయిదేళ్లలోగా అన్ని జిల్లాల్లోనూ మానసిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడం, ఎనిమిది సంవత్సరాల గడువులో అన్ని విద్యాసంస్థల పాఠ్యప్రణాళికల్లోనూ మానసిక స్వస్థతను చేర్చడం- ప్రత్యేక వ్యూహంలోని ఇతర ముఖ్యాంశాలు. అవన్నీ దస్త్రాలకే పరిమితం కాకుండా కాచుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ భుజస్కంధాలపైనే ఉంది. కుంగుబాటును ‘మానసిక వ్యాధి’గా కాక తీవ్ర ఒత్తిడిగా పరిగణించాలంటూ అయిదేళ్లక్రితమే చట్టం తెచ్చిన కేంద్రం- రాష్ట్రాల్నీ కూడగట్టుకుని ఆత్మహత్యల ఉరవడి, సరైన దిద్దుబాటు చర్యలపై పటిష్ఠ కార్యాచరణను చురుగ్గా పట్టాలకు ఎక్కించాలి!

ఉద్యోగుల్లో మానసిక అనారోగ్యం కారణంగా గైర్హాజర్లు, ఉత్పాదక నష్టాలు, వలసలు అనివార్యమై కంపెనీలు ఏటా లక్షా 15 వేల కోట్ల రూపాయలదాకా వెచ్చించాల్సి వస్తోందని ఇటీవలి డెలాయిట్‌ అధ్యయనం మదింపు వేసింది. మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు ఒక్క వేతనజీవులకే పరిమితంకాదు. దేశీయంగా నిరుడు నమోదైన మొత్తం బలవన్మరణాల్లో రోజుకూలీలవి సుమారు నాలుగోవంతు. మనోవ్యాధితో కుంగిపోయి తమను తాము అంతమొందించుకున్నవారిలో గృహిణులు, నిరుద్యోగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రైతులు... వేల సంఖ్యలో ఉన్నారు. వారందరి అర్ధాంతర నిష్క్రమణం ఆయా కుటుంబాల్లో అసంఖ్యాక పరిచయస్తుల్లో రగిలించే దుర్భర దుఃఖోద్వేగాన్ని ఏ కొలమానాలు అంచనా కట్టగలవు? ప్రతి జిల్లాలోనూ మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు అందుబాటులోకి రావడంతోనే ఆత్మహత్యల నియంత్రణ సాధ్యపడుతుందా? క్షణికావేశంలో దారుణ నిర్ణయాలకు ప్రేరేపిస్తున్న సామాజిక ఆర్థిక అంశాలు, జీవనశైలి సమస్యలు తేలిగ్గా ఉపేక్షించరానివి. పీకలోతు సమస్యల్లో కూరుకుపోయి బయటపడటానికి దారీతెన్నూ కనిపించక బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిని ఆదుకోవడం ఎలాగన్నదానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ఉపాధి లేమి, రైతుల రుణభారం, చదువుల తిప్పలు తదితర సమస్యల మూలాల్ని ఛేదించాలి. నేటి పోటీ ప్రపంచంలో విపరీత ఒత్తిళ్లను, ఒడుదొడుకుల్ని స్థిమితంగా ఎలా అధిగమించాలో బడి దశలోనే పిల్లలకు నూరిపోసేలా బోధనాంశాల్ని సాంతం ప్రక్షాళించాలి. విద్యార్థుల్ని ‘వర్రీయర్స్‌’గా కాక ‘వారియర్స్‌’గా మారుస్తామని కేంద్రం గతంలో ఇచ్చిన హామీని అక్షరాలా నిలబెట్టుకుంటే- పౌరుల మానసిక ఆరోగ్య పరిరక్షణ క్రతువులో అదే తొలి మైలురాయి అవుతుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts